నిరసనల పరమార్థం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు ప్రజల ప్రతిఘటనోద్యమాన్ని మరింత విస్తృతం చేశాయి. ఇలా విస్తృతతం కావడం వెనక రెండు పార్శ్వాలు ఉన్నాయి. మొదటిది, నిరసనల ద్వారా సమస్యను జనం దృష్టికి తీసుకురావడం. ఇది గాంధేయ విధానం. శాంతి, సామాజిక సామరస్యత దీనికి మూలకందం. ఈ నిరసనల వెనక డా. బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తి కూడా ఉంది. రాజ్యాంగాన్ని గుర్తు చేస్తున్నట్టుగా ఈ నిరసనలు ఉన్నాయి. రాంజ్యాంగంపై అంబేద్కర్ భావన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం, "ప్రజాస్వామ్య జాతీయవాదం" అన్న లక్షణాలు ఉన్నాయి.
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను పరిరక్షించడం చట్ట రీత్యా అధికారంలో ఉన్న వారి బాధ్యత. హక్కుల పరిరక్షణ వ్యక్తుల హక్కులకే కాకుండా మైనారిటీల హక్కులకు కూడా వర్తిస్తుంది. అంబేద్కర్ దృష్టిలో జాతీయవాదానికి ఓ విశిష్టత ఉంది. ప్రతి మనిషిని గౌరవించడం ఈ జాతీయవాదం ప్రత్యేకత. మహాత్మా గాంధీ, అంబేద్కర్ జాతి అన్న భావనలో శాంతి ఉండాలని భావించారు. ఈ భావనకు స్వేచ్ఛ మూలాధారం. ఈ ఇద్దరు మహాపురుషులూ సత్యాన్వేషణ చేసిన వారే.
దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు ఈ ఇద్దరు నాయకుల సూత్రాలను అనుసరించవలసిన ఆవశ్యకతనే చాటి చెప్తున్నాయి. నిరసనకారులు ఈ ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవడం కేవలం వాగాడంబరం కోసం కాదు. ఉద్దేశ పూర్వకంగానే వారు ఆ పని చేస్తున్నారు. వీరు నిరంతరం తాము గాంధీ, అంబేద్కర్ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. ఒక సమస్యను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు అంబేద్కర్ నైతిక శక్తిని సంతరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కులం, స్త్రీ పురుష భేదాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను, విశ్వజనీన సత్యాన్ని వారు ఈ దృష్టితోనే చూస్తున్నారు. కుల వివక్ష, లింగ వివక్ష, అఘాయిత్యాలకు సంబంధించిన వాస్తవాలను కప్పి పుచ్చడంలో రాజకీయ కుట్ర ఇమిడి ఉంది. ఈ సత్యం కోసం పోరాడడానికి జన సమీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నిరసనల ద్వారా సంకేత రూపంలోనైనా రాజ్యాంగ నైతికతను, ప్రజాస్వామ్య ఆవశ్యకతను చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నిరసనలు సామూహికంగా విశ్వజనీన సత్యాన్వేషనకు దారి చూపాయి. గాంధీ, అంబేద్కర్ చూపిన నైతికత ఈ అన్వేషణకు స్ఫూర్తి. ఇందులో తాము చెప్పేదే సత్యం అన్న భావన లేదు. తాము చెప్పేదే సత్యం అనుకునే వాళ్లు విశ్వజనీన పౌరసత్వం కన్నా కులం, లింగ వివక్షే గొప్పవనుకుంటారు. తమ సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కావలసింది ముఖం మీద ముసుగు వేసుకోకుండా విశ్వజనీన సత్యం కోసం అన్వేషించడమే. ఈ అన్వేషణ వెనక ఆత్మ బలం ఉంటుంది. అందువల్ల ముసుగు వేసుకునే అవసరం ఉండదు.
అసత్యం చెప్పే వారికే ముసుగు అవసరం అవుతుంది. ఆత్మ శక్తి ఉన్న సత్యానికి రాజకీయ శక్తి కాగలిగిన సామర్థ్యం ఉంటుంది. దీనిని ఎదుర్కోలేని వారు జనంలో సంకుచిత భావాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తారు. జాతీయతావాదం, స్వేచ్ఛ అని వారు వల్లించే మాటలన్నీ ఈ ముసుగులే. ఇలాంటి వారు సవ్యమైన సకల నిరసనలనూ, ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతికి దేశద్రోహం, జాతిద్రోహం అన్న ముద్ర వేస్తారు. జాతీయతావాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని భిన్న ధ్రువాల కింద చిత్రీకరిస్తారు. గాంధీ, అంబేద్కర్ ఆలోచనా ధోరణి దృష్టితో జాతీయవాదాన్ని పరిశీలిస్తే సోషలిస్టు జాతీయవాదం, బహుజన జాతీయవాదం, ప్రజాస్వామ్య జాతీయవాదం ద్యోతకం అవుతాయి. ప్రస్తుతం నిరసనలను వ్యతిరేకిస్తున్న వారు పౌరసత్వానికి ఉన్న రాజ్యాంగ హక్కునూ సంకుచిత దృష్టితోనే చూస్తారు. లేదా ప్రాంతీయ దృష్టితో చూస్తారు. ఒక మతం దృష్టితో పౌరసత్వాన్ని చూడడం అంటే పౌరసత్వానికి ఉన్న విశ్వజనీన భావాన్ని విస్మరించడమే, తృణీకరించడమే. అందుకే ప్రతిపక్షాల నిరసనలకు "బూటకపు నిరసనలు", "టుక్డే టుక్డే గ్యాంగ్" అన్న పేర్లు పెడ్తారు. ఇది జాతీయవాదాన్ని సంకుచిత దృష్టితో పరిగణించడానికే ఉపకరిస్తుంది. అప్పుడు విశ్వజనీన పౌరసత్వం అన్న భావన, జాతీయవాదం మసకబారతాయి. కాని ఇవే రాజ్యాంగ మౌలిక సూత్రాలు.