విశ్వవిద్యాలయాలు ఆలోచనా నిలయాలు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
విశ్వవిద్యాలయాలు వ్యవస్థలుగా తమంతట తాము ప్రస్థానం సాగించవు. విశ్వవిద్యాలయాల ఆలోచన ఆకట్టుకునేట్టుగా ఉంటే అవి ప్రఖ్యాతిలోకి వస్తాయి. అందుకే విశ్వవిద్యాలయాలంటే కేవలం భవనాలు కావు. అంకెలు కావు. విశ్వవిద్యాలయాలు వాస్తవానికి వ్యవస్థాగతమైన భావ సముచ్ఛయాలు. ఆ భావాలలో మానవీయ విలువలు ఉంటాయి. విశ్వవిద్యాలయాలకు సూత్రప్రాయమైన భావాలు ఉంటాయి. ఇలాంటి విలువలతో కూడిన భావాలను సంస్థాగతం చేయడం, ఆలోచనలకు నెలవులుగా మార్చడం అవి నిర్వర్తించవలసిన బాధ్యత. ఆదర్శవంతంగా నిలవాల్సిన విశ్వవిద్యాలయాలు సృజనాత్మక ఆలోచనలను, ఆ ఆలోచనలు చేసే వారిని ప్రోది చేయాలి. సామాజిక అంశాలకు నిబద్ధమై ఉండాలి. పాండిత్యానికి కేంద్రాలుగా ఉండాలి. అంటే విశ్వవిద్యాలయాలు సృజనాత్మక భావాలు ఉన్న వారిని ఆదరించాలి, విభిన్నమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి. తమ సంస్థల పరిధిలో ఈ ఆలోచనలను పెంపొందింప చేయాలి.
విశ్వవిద్యాలయం ఆలోచనలను ప్రోత్సహిస్తే విద్యార్థులు వివేచించి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా ఉంటారు. సాంస్కృతికమైన చర్చలు, సంవాదాలకు తరచి చూసే భావాలున్నవారు అవసరం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసమ్మతి వ్యక్తం చేసే భావాలున్నప్పుడు చలన శీలత ఎక్కువగా ఉంటుంది. విశ్వవిద్యాలయాలు వ్యవస్థలుగా సామాజిక, మేధోపరమైన నిబద్ధతకు తావిస్తాయి. ఇవ్వాలి. సంవాదాలకు, అసమ్మతికి చోటివ్వడమే కాదు అసమ్మతి విస్తరించడానికి అవకాశం కూడా ఇవ్వాలి. అసమ్మతితో కూడిన వాదనలకు, సంవాద స్ఫూర్తికి విశ్వవిద్యాలయాల్లో అవకాశం ఉంటే జ్ఞాన సముపార్జనలో, సామాజిక ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి దాయకంగా ఉంటుంది. ఇవి విశ్వజనీనం కావడానికి వీలుంటుంది. వీటికి అవకాశం లేకపోతే నిరసనలు పెల్లుబుకుతాయి. ప్రభుత్వ అధీనంలో నడిచే విశ్వవిద్యాలయాలు అణగారిన వర్గాల అవసరాలను పట్టించుకుని తీరాలి. అప్పుడే అణగారిన వర్గాల విద్యార్థులు అవకాశాలను సుసంపన్నమైన సంపదగా మలుచుకోగలుగుతారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఇలాగే జరుగుతుంది. విద్యార్థుల ఆకాంక్షలను రాజ్య వ్యవస్థ ఉపేక్షించకూడదు. విద్యార్థులతో వ్యవహరించేటప్పుడు రాజ్యవ్యవస్థ జాగ్రత్తగా నడుచుకోవాలి. రాజ్యవ్యవస్థ సంకుచితమైన సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా ఉండాలి. మేధోపరమైన అంశాలను ప్రోత్సహించాలి. ఆదర్శాలకు దన్నుగా నిలవాలి. విచ్ఛన్నానికి ఊతం ఇవ్వకూడదు. నైతిక స్థైర్యంతో వ్యవహరించవలసిన రాజ్యవ్యవస్థ, విశ్వవిద్యాలయాలు విద్యార్థులను శత్రువులుగానో, దేశద్రోహులుగానో, జాతి వ్యతిరేకులుగానో పరిగణించకూడదు. విశ్వవిద్యాలయాల, విద్యార్థుల విషయంలో మితిమీరిన జోక్యం చేసుకోవడం, వాటిని వ్యతిరేకించడం అంటే సామాజిక, మేధోపరమైన వాటి లక్షణాలను తృణీకరించడమే. ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను అణచి వేయడానికి ప్రయత్నిస్తే ఇతర విశ్వవిద్యాలయాలలోనూ అసమ్మతిని అణగదొక్కుతారన్న భావన పాతుకుపోతుంది. ఇది విశ్వవిద్యాలయం అన్న భావనకే విఘాతం కలిగిస్తుంది. విద్యార్థుల నోరు మూయించడానికి మాత్రమే దారి తీస్తుంది. పౌర సమాజం విశ్వవిద్యాలయాల ప్రాధాన్యాన్ని గుర్తించాలి.
ప్రభుత్వ వ్యయంతో నడించే విశ్వవిద్యాలయాలు విద్య, పాండిత్యం సామాజిక స్థాయిలో విస్తరించడానికి తోడ్పడాలి. అప్పుడే మానవీయ విలువలను ప్రోది చేయగలుగుతాం. విశ్వవిద్యాలయాలు ఆలోచనలకు కేంద్రం అనుకున్నప్పుడే ఒక జాతి మేధోపరమైన ఔన్నత్యం ద్యోతకం అవుతుంది. అందువల్ల ఒక విశ్వవిద్యాలయాన్ని అపఖ్యాతి పాలు చేయడం అంటే ఆత్మహత్యా సదృశం అయినా కాకపోయినా కనీసం కచ్చితంగా దురదృష్టకరం. ఆలోచించే మెదళ్లను ప్రోత్సహిస్తేనే జాతి నైతిక, సాంస్కృతిక, మేధోపర ఔన్నత్యం విలసిల్లుతుంది. దీనికి ప్రాథమిక కేంద్రాలు విశ్వవిద్యాలయాలే. మన దేశంలోనూ, విదేశాల్లోనూ నిరసన తెలియజేస్తున్న వారు ఈ వాస్తవాన్ని గ్రహించారు. విశ్వవిద్యాలయాలను కాపాడుకోవాలనుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థలను విచ్ఛిన్నం చేయడానికి రాజకీయ అల్లకల్లోలాన్ని రెచ్చగొట్టే వారిని ఈసడిస్తున్నారు.