ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

రుణమాఫీలో హ్రస్వ దృష్టి

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

వ్యవసాయ సంక్షోభాన్ని రాజకీయం చేసినందువల్ల ప్రభుత్వాల విధాన రూపకల్పన వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా గ్రామీణ సంక్షోభాన్ని పట్టించుకోకుండా రాజకీయ దృష్టితోనే సాగుతోంది. రుణభారం నుంచి తప్పించుకోవడానికి రైతులు రుణ మాఫీ కోరారు. తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలంటున్నారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నికరంగా ఉండవు. దీనివల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాతావరణ పరిస్థితులు సవ్యంగా ఉండకపోవడంతో రైతుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్టు అవుతోంది.

మహారాష్ట్రలో మూడు పార్టీలు కలిసి కొత్తగా ఏర్పటు చేసిన మహా వికాస్ అఘాది ప్రభుత్వం 2015 మార్చి ఒకటి నుంచి 2019 సెప్టెంబర్ 30 దాకా రెండు లక్షల రూపాయల కన్నా తక్కువ ఉన్న రైతుల రుణాలు మాఫు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని మూడు నుంచి ఆరు నెలలోగా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మహారాష్ట్రలో రైతులు ఆందోళనకు దిగిన తరవాత మునుపటి ప్రభుత్వం కూడా 89 లక్షల మంది రైతులకు మేలు చేసే రూ. 34,044 ఖర్చయ్యే రుణ మాఫీ పథకాన్ని ప్రకటించింది. అయితే ఈ రుణమాఫీకి అర్హులు ఎవరు అన్న విషయం సంక్లిష్టంగా ఉన్నందువల్ల ఇది సవ్యంగా అమలు కాలేదు. ఆన్ లైన్ పద్ధతి, ప్రభుత్వం బ్యాంకులకు విడతల వారీగా డబ్బు చెల్లించడంవల్ల అమలు అస్తవ్యస్తమైంది.

రుణ మాఫీ తాత్కాలిక ఉపశమనం కలిగించినా దీనివల్ల సానుకూల ప్రభావం ఏమీ లేదని అనుభవంలో రుజువైంది. అందువల్ల మెరుగైన విధానాలు అనుసరించవలసిన అవసరం ఏర్పడింది. అంటే అణగారిన వర్గాలకు చెందిన వారికి, చిన్న, సన్నకారు రైతులకు, కొద్దిపాటి భూమి మాత్రమే ఉన్న వారికి ఉపయోగపడే విధానం రూపొందించవలసిన అవసరం వచ్చింది. 2006 నుంచి కేరళలో అమలు చేస్తున్న రైతుల రుణ విముక్తి కమిషన్ ఆదర్శప్రాయంగా ఉంది. ఇది సమగ్రంగా, అందరికీ ఉపయోగపడేలా ఉంది. ఇది శాశ్వత వ్యవస్థ. ఈ వ్యవస్థలో రైతుల ప్రతినిధులు, మాజీ న్యాయమూర్తులు ఉన్నారు. వీరు వ్యక్తిగత దరఖాస్తులను పరిశీలించి రుణాల చెల్లింపు గడువు పొడిగించడం లాంటి చర్యలు సిఫార్సు చేస్తారు. ఈ కమిషన్ కు, ఎన్నికలకు ఎలాంటి సంబంధమూ ఉండదు.

తీవ్రంగా ఉన్న వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించడానికి నిలకడగా ఉండే దీర్ఘ కాలిక చర్యలు అవసరం. వ్యవసాయ రంగం చాలా కాలం నుంచి సంక్షోభంలో ఉంది. నిర్మాణాత్మక చర్యలు తీసుకోకపోతే ఈ సంక్షోభం పునరావృతం అవుతూనే ఉంటుంది. వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోతున్నందువల్ల రుణమాఫీ వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండడం లేదు. వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం ఇదే. పైగా రుణ మాఫీ బ్యాంకులు మొదలైన వాటి నుంచి రుణాలు తీసుకునే వారికే మాత్రమే ఉపయోగపడడంతో పాటు ధనిక రైతులు సైతం లబ్ధి పొందుతున్నారు. అర్హులైన రైతులకు సహాయం అందని పరిస్థితి తలెత్తుతోంది. గ్రామీణ రుణ పంపిణీ విధానం గాడి తప్పుతోంది. నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్న బ్యాంకులపై మరింత భారం పడుతోంది. అదీ గాక రుణ మాఫీ ప్రభుత్వ ఖజానాకు భారంగా తయారవుతోంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను దిగజారుస్తోంది. అందుకే దీర్ఘకాలికంగా దీనివల్ల ప్రయోజనం ఉండడం లేదు.

అనావృష్టి, పెరిగిపోతున్న వ్యవసాయ ఖర్చులు, పండిన పంటకు సరైన ధర లభించకపోవడం, రైతుల ఆదాయం తగ్గడం మొదలైన సమస్యలను రుణ మాఫీ తీర్చగలుగుతుందా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అదీగాక ప్రభుత్వాలు అనుసరించే విధానాలు వినియోగదార్లను దృష్టిలో ఉంచుకుంటున్నాయి తప్ప ఉత్పత్తి దార్లను కాదు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం మీదే శ్రద్ధ వహిస్తున్నాయి. వ్యవసాయం తీరే మారిపోయింది. పంటలు పండించే తీరు, యాంత్రీకరణ, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత, తోటల పెంపకం మీద దృష్టి కారణంగా సేద్యం చేయడానికి ఎక్కువ పెట్టుబడి, పండిన పంటను నిలవ చేసే సదుపాయాలు అవసరమవుతున్నాయి. ధరలు ఎగుడుదిగుడుగా ఉన్నందువల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రుణగ్రస్థులైపోతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధర తగ్గడం, ఆ ధరలు కూడా నిలకడగా ఉండకపోవడంవల్ల వ్యవసాయ సంక్షోభం ముదిరిపోతోంది.

తక్షణ సహాయం అందించినందువల్ల పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. మూల కారణాలకు పరిష్కారం లభించడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతున్నాయి. గిరాకీ తగ్గడంవల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యవసాయేతర రంగం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అవ్యవస్థీకృత రంగం పరిస్థితి సైతం దిగదుడుపుగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో గిరాకీ తగ్గుతోంది.

ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఉత్పాదకత పెంచే, వ్యవసాయ పెట్టుబడుల భారం తగ్గించే, స్వామీనాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు దహర అందించే, వ్యవసాయోత్పత్తులను నికరంగా ప్రభుత్వం సేకరించే, భూకమతాలను సుసంఘటితం చేసే, బ్యాంకుల ద్వారా రుణాలు అందించే, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వ్యయం పెరిగే, సమర్థవంతమైన పంటల బీమా సదుపాయం కల్పించే, వ్యవసాయోత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు నెలకొల్పే విధానాలు అనుసరించవలసిన అగత్యం ఉంది. ప్రభుత్వాలు ఈ నిర్మాణాత్మక వ్యవహారాలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. మెరుగైన సాంకేతిక అందుబాటులో ఉంచడానికి పెట్టుబడులు పెరగవలసిన అవసరమూ ఉంది. పండిన పంటను నిలవ చేయడానికి తగినన్ని గిడ్డంగులు అందుబాటులో ఉండడంతో పాటు పరిశోధనా కార్యకలాపాలు, విస్తరణ కార్యక్రమాలు విస్తృతం కావాలి. అన్నింటికీ మించి ఒక గుంపుగా ఏర్పడి ధరలను ప్రభావితం చేసే ముఠాలకు అడ్డుకట్ట వేయాలి. ఎగుమతి-దిగుమతి విధానాల్లో సానుకూల మార్పు రావాలి.

Back to Top