ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఉత్తరప్రదేశ్ లో ఆటవిక రాజ్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసి పడుతున్న సమయంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో లేదా పోలీసు వ్యవస్థ బీజేపీ అధీనంలో ఉన్న చోట్ల పోలీసుల దురాగతాలు మితిమీరి పోతున్నాయి. పోలీసు కాల్పులలో, దాష్టీకానికి ఒక వేపు జనం మరణిస్తుంటే, బలైపోతూ ఉంటే బీజేపీ ప్రభుత్వాల వైఖరి చీదర కలిగిస్తోంది. బీజేపీ నాయకులు, అధికారంలో ఉన్న బీజేపీ తమ నాయకత్వం ఎంత పటిష్ఠమైందో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. పైగా నిరసన తెలియజేస్తున్న వారి మీద అఘాయిత్యాలకు పాల్పడినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం కనబరచడం లేదు. ఈ వితండవాదంలో  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిదే అగ్రసానం. 2019 డిసెంబర్ 19న నిరసన ప్రదర్శనలు చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన బాహాటంగా ప్రకటించారు. అప్పటి నుంచి అక్కడ పోలీసుల కిరాతకాలు పెచ్చరిల్లిపోయాయి. నిందంతా నిరసనకారుల మీదే మోపుతున్నారు. అయితే పోలీసుల అఘాయిత్యాలకు సంబధించిన వీడియో సాక్ష్యాలు బయటపడ్డ తరవాత, ఏక పక్షంగా అరెస్టులకు సంబంధించిన సమాచారం వెలికి వచ్చిన తరవాత పోలీసు దురాగతాలు జరిగాయని అంగీకరించక తప్పలేదు.

ఉత్తరప్రదేశ్ లో పోలీసుల అఘాయిత్యాలకు బలై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వ మొండి వైఖరిలో మార్పు లేదు. పైగా నిరసనకారులనే నిందిస్తున్నారు. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చిందని బుకాయిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ హయాంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నైతిక సంక్షోభానికి నిదర్శనం. ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణం. అందువల్ల ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరగాలి. ప్రజల మీద అఘాయిత్యాలకు పాల్పడిన వారి మీద చర్య తీసుకోవాలి. కానీ ప్రభుత్వం వారికి అండగా నిలబడుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రభుత్వ బాధ్యతను రూఢి చేస్తోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు అది సైనిక ప్రభుత్వం కాదని వారు చేస్తున్నది ప్రభుత్వ సేవ అని మర్చిచిపోయారు. రెచ్చగొట్టినా సరే సంయమం పాటించడం సభ్య సమాజంలో పోలీసుల బాధ్యత. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రజల మీద, ముఖ్యంగా ఒక వర్గం వారి మీద కత్తిగట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. నిరసనకారులు దౌర్జన్యానికి దిగారని బుకాయిస్తున్నారు. ఈ వాదనల నిగ్గు తేలడానికి సమగ్ర విచారణ అత్యవసరం. నిరసనకారుల ముసుగులో హింసాత్మక ఘటనలకు పాల్పడింది ఎవరో తేలాల్సిందే.

అదుపుతప్పిన నిరసనకారులను శాంతింప చేయడంలో నిమగ్నమైన ఒక పోలీసు ఇన్స్పెక్టర్ బులంద్ షహర్ లో ప్రాణాలు కోల్పోయారు. చట్టబద్ధ పాలనకు విఘాతం ఎందుకు కలిగిందో పోలీసు ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందో తెలుసుకోవడానికి ప్రయత్నించే బదులు పోలీసులు అల్లరి మూకల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక మతం వారి మీద కసితీర్చుకోవడానికి కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కేవలం మూడు రోజులు శిక్షణ ఇచ్చి పోలీసు మిత్రులు అని కొంతమందిని రంగంలోకి దించారు. పోలీసులు మూకలా ప్రవర్తిస్తున్నారనడానికి ఇదీ ఓ నిదర్శనమే. కరడుగట్టిన మితవాద వర్గాలకు చెందిన వారిని ఇలా పోలీసు మిత్రులుగా నియమించారని ప్రతిపక్షాలవారు ఆందోళన పడ్తున్నారు.

ముస్లింలను భయభ్రాంతులను చేయడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇళ్లను, ఆస్తులను ధ్వంసం చేశారు. ఒక మతం వారిని నేరస్థులుగా నిరూపించడానికి కొంతమంది వ్యక్తులను అక్రమంగా అరెస్టు చేశారు. నిర్బంధంలో ఉన్న పిల్లల మీద కూడా కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. మరీ కిరాతకమైన వైపరీత్యం ఏమిటంటే సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న, మనుషుల ప్రాణాలను ఏ మాత్రం ఖాతరు చేయని పోలీసులు జరిగిన ఆస్తి నష్టానికి నిరసనకారులే పరిహారం చెల్లించాలని అడుగుతున్నారు. నిరసనలో పాల్గొనని ముస్లింలను కూడా పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఎన్ని దారుణాలకు పాల్పడినా తమకు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న ధీమాతో పోలీసులు ప్రవర్తించడం అధికారంలో ఉన్న వారి మద్దతు, సహాయ సహకారాలు లేకుండా సాధ్యమయ్యే పని కాదు. ఇది ప్రతుత్వ తిరోగమన ధోరణికి ప్రతీక.

ఈ పరిణామాలను బట్టి చూస్తే ఉత్తరప్రదేశ్ పోలీసు రాజ్యంగా మారుతోందనిపిస్తోంది. దీనికి మతం కూడా తోడవుతోంది. ఇలాంటి రాజ్యంలో ప్రజాస్వామ్య హక్కులకు స్థానం ఉండదు. పౌరహక్కుల ఉద్యమకారులని అరెస్టు చేయడమే దీనికి ఉదాహరణ. వీరి మీద నిరాధార ఆరోపణలు మోపారు. ఈ అరెస్టులను ఏ రకంగానూ సమర్థించడం వీలు కాదు. మానవహక్కులను పరిరక్షించాలనుకునే వారు అణగారిన వర్గాల హక్కులకోసం పోరాడుతున్నారు. వీరిని నిర్బంధించడం అంటే ఇసుమంత అసమ్మతిని కూడా సహించే లక్షణం లేకపోవడమే. న్యాయానికి విలువ లేకుండా చేయడమే.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చర్యలు చూస్తే ముస్లింలను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారనడం నిజమేనని రుజువవుతోంది. వారికి మౌలిక హక్కులను, జీవించే హక్కును కూడా ప్రశ్నార్థకం చేస్తున్నారు. వారు శాంతియుతంగా నిరసన తెలియజేసే పరిస్థితి కూడా లేకుండా పోతోంది. ఇలాంటి సంఘటనలు చెదురుమదురుగా తప్ప జనానికి తెలియడం లేదు. ఒక వేళ అలాంటి వార్తలు ఏమైనా వచ్చినా అవి పక్షపాత దృష్టితోనో, ప్రతికూల వైఖరితోనో ఉంటున్నాయి. భయం, కలహాలు ప్రజాస్వామ్య సమాజానికి విఘాతం కలిగిస్తాయి. అందువల్ల సమాజంలోని అన్ని వర్గాల వారు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిలదీయాల్సిన అగత్యం ఉంది. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడానికి నిలబడాల్సి ఉంది. అందుకోసం జనాభిప్రాయాన్ని సమీకరించాలి. సమాజాన్ని విడదీసే కుటిల యత్నాలను నిలవరించాలి. సమాజాన్ని విడదీసే ప్రయత్నాలు కొనసాగనివ్వకూడదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top