ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

దౌత్య యత్నాలే మేలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన దేశంపై ఉగ్రదాడులు చేయాలన్న సంకల్పాన్ని వమ్ము చేయడానికి ఫిబ్రవరి 26 తెల్లవారు ఝామున భారత వైమానికదళ యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోని బాలాకోట్ పై బాంబుల వర్షం కురిపించాయి. అంతకు ముందు పదిహేను రోజుల కింద పుల్వామాలో సి.ఆర్.పి. దళాల మీద దాడి చేసి జైష్ 40 మందిని పొట్టన పెట్టుకున్నందువల్ల భారత వైమానిక దళం బాలా కోట్ పై దాడి చేయడం భారతీయుల ప్రతీకార వాంఛకు ప్రతిరూపంగా నిలిచింది. అణ్వాయుధాలు ఉన్న పాకిస్తాన్ పై నిర్ణయాత్మకమైన రీతిలో ప్రతీకారం తీర్చుకున్నందుకు దేశ ప్రజలందరూ హర్షించారు. సాంప్రదాయిక యుద్ధం కాకపోయినా తీవ్రవాదుల ఆగడాలను నిరోధించడానికి ఈ దాడి తోడ్పడిందని సైనిక వ్యూహాల నిపుణులు వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నందువల్ల మనం దాడి చేయలేమన్న వాదన బాలాకోట్ పై దాడితో వీగిపోయింది. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా మిగిలిపోయి, అప్పుల ఊబిలో ఉన్నందువల్ల తమ గగనతలాన్ని భారత్ అతిక్రమించినందుకు ఈ రగడను మరింత పెద్దది చేయదని అనుకున్నారు. కానీ మన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కి, మొహం నిండా గాయాలతో ఉన్న వీడియోలు మనం దాడి చేసిన మర్నాడు విడుదలైన తరవాత మన విజయోత్సాహం కొంత చల్లబడింది. అభినందన్ ను మార్చి ఒకటవ తేదీన పాకిస్తాన్ విడుదల చేసింది. భారత వైమానిక దళాధికారులు ఆయనకు భారత-పాక్ సరిహద్దులో స్వాగతం చెప్పారు. సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి రెండు దేశాలు ఇక చేయవలసింది దౌత్య పద్ధతులు అనుసరించడమే.

రెండు దేశాలూ దౌత్య విధానాలను అనుసరిస్తే తమ దేశాల్లో ఉన్న అంతర్గత సమస్యల మీద దృష్టి సారించడానికి అవకాశం వస్తుంది. సమస్యల మీద ఆత్మ పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దువల్ల తీవ్రవాద సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని భారత ప్రభుత్వం గ్రహించడానికి వీలవుతుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా సరిహద్దులో తీవ్రవాద దాడులు కొనసాగాయి. భారత ఆర్థిక వ్యవస్థ, సామాజిక సామరస్యం, జాతీయ సమైక్యతవంటి అంశాలకు పరిష్కారం కనుగొనడంలో భారత ప్రభుత్వం విఫలమైంది. పుల్వామా దాడి తర్వాత మనం చూపిన యుద్ధోన్మాదం, వెర్రి సాహసం గొడవలో పడి అత్యంత భద్రత ఉండవలసిన కశ్మీర్ లో అంత భారీ స్థాయిలో తీవ్రవాదులు ఆర్.డి.ఎక్స్. ను ఎలా సమకూర్చగలిగారన్న అంశాన్ని అంతగా పట్టించుకోలేదు. గూఢచార వర్గాలు అందజేసిన సమాచారాన్ని వినియోగించుకుని చేయవల్సిన కట్టుదిట్టాలు చేయనే లేదు. పుల్వామా దాడి తర్వాత కయ్యానికి కాలు దువ్వే రీతిలో మాట్లాడినందువల్ల సహజంగానే ఈ మౌలిక ప్రశ్నల గురించి ఆలోచించనే లేదు.

ఇప్పుడు మనం అనుసరించిన విధానంవల్ల మనమే సందిగ్ధ పరిస్థితిలో పడిపోయాం. కశ్మీర్ లో ఉన్న పరిస్థితిని, పాక్ విషయంలో అనుసరించవలసిన విధానాన్ని ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందే తప్ప దీర్ఘకాలిక దృక్పథం కనిపించడమే లేదు. దేశంలోనూ, సరిహద్దులోనూ ఉద్రిక్తతలను వినియోగించుకుని ఈ ప్రభుత్వం లబ్ధి పొందాలని చూస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించే వారు భావిస్తున్నారు. దౌత్యపరమైన మార్గాలన్నింటినీ వినియోగించుకోకుండా యుద్ధ కాంక్ష ప్రదర్శించడం సరైన పద్ధతి కాదు. అంతర్గతంగా ఉన్న రాజకీయ కాంక్షలు విదేశాంగ విధానాన్ని మసకబారనీయకూడదు. పాకిస్తాన్ ను లొంగదీయడానికి ఘర్షణ విధానాన్ని అనుసరించడం రాజనీతిజ్ఞత కాదు. వినాశకరమైన పరిణామాలను, దక్షిణాసియాలో అణు యుద్ధ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయకూడదు. భవిష్యత్ పరిణామాలను సరిగా అంచనా వేయకుండా ముప్పు తెచ్చే విధానాలు అనుసరించడం వివేకవంతమైన పని కాదు. అలాగే ఏ లాబీ అయినా సైనిక వ్యయం పెంచమని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకూడదు. ఎన్నికల ప్రయోజనాల ఒత్తిడి ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుల నిర్ణయాలకు కళ్లెం వేస్తాయని ప్రజాస్వామ్యం మీద, యుద్ధాల మీద జరిగిన అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. అందుకని యుద్ధోన్మాదం వివేకవంతమైన రాజ్య విధానం కాదు.

బల ప్రయోగం కన్నా సరైన వ్యూహాలవల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని అంగీకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పాకిస్తాన్ తో వ్యవహారించడంలో పౌరుషం ఒక్కటే మార్గం కాదు. యుద్ధమే ఎన్నడూ అంతిమ లక్ష్యం కాదు. అనేక సంవత్సరాలుగా కశ్మీర్ లో సైనిక బలాన్ని వినియోగించినందువల్ల కీడే ఎక్కువ జరిగింది. కశ్మీరీ ప్రజలు మరింత దూరమయ్యారు. భారత-పాకిస్తాన్ సంబంధాలలో ఉన్న ప్రతిష్ఠంబనను తొలగించడానికి భౌగోళిక ఆర్థిక విధానాలవల్ల ఉన్న ప్రయోజనాలను పూర్తిగా ఇప్పటివరకు అన్వేషించనే లేదు. మరిన్ని సైనిక చర్యలతో ప్రస్తుత ప్రతిష్ఠంభనను తొలగించడం సాధ్యం కాదు. యుద్ధ ప్రమాదాన్ని తగ్గించడంవల్ల అధికార పార్టీ ఎన్నికల రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం ఉన్నా దౌత్యవేత్తలు రంగంలోకి దిగాల్సిందే.

నిరంతర ఉద్రిక్తత, ఘర్షణ శాంతియుత సహజీవనానికి ఉపకరించవు. శాంతి నెలకొనడానికి, తద్వారా మన ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని మరీ మరీ నొక్కి చెప్పవలసిన అగత్యం లేదు.

Back to Top