ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

వ్యవసాయ రంగంలో అపసవ్య విధానాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.) ప్రభుత్వం ప్రతిపాదించిన మధ్యంతర బడ్జెట్ లో వ్యవసాయం-పశు సంవర్ధన, మత్స్య పరిశ్రమ తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను విస్తృతం చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నారు. జాతీయ స్థూల వ్యవసాయ ఉత్పత్తిలో పశుసంవర్ధనకు 25 శాతం, మత్స్య పరిశ్రమకు ఆరు శాతం వాటా ఉంది. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టుంపు చేస్తామని ఊదరగొడ్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రంగాలకు రాయితీలు ప్రకటించడంలో చిత్త శుద్ధి ప్రదర్శించి ఉంటే బాగుండేది. కానీ రైతులు ముఖ్యంగా చిన్న కమతాలు ఉన్న రైతులు కుదేలైపోయి సంక్షోభంలో కూరుకుపోవడానికి ఈ ప్రభుత్వం స్వప్రయోజనాలకోసం పాకులాడడం ఎంత కారణమో ప్రకృతి వైపరీత్యాలూ అంతే కారణం. అందువల్లే ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తన గోవు రాజకీయాలను ప్రోత్సహించడానికే రాష్ట్రీయ గోకుల్ మిషన్, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ పథకాలను ప్రకటించింది. ఇది హిందీ మాట్లాడే ప్రాంతాల వారిని ఆకట్టుకోవడానికి వేసిన పథకం తప్ప పశుసంవర్ధనకు ఉపకరించేది ఏమీ లేదు. అలాగే మత్స్య పరిశ్రమ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం అని ప్రకటించడంలో కూడా వచ్చే ఎన్నికలలో మత్స్యకారుల ఓట్లు రాబట్టే ప్రయత్నమే కనిపిస్తోంది తప్ప మత్స్యకారుల జీవితాలు బాగుపడే సూచన ఏ మాత్రం లేదు.

మత్స్యకారులకు రాయితీలు ప్రకటించడం వెనక అసలు ఉద్దేశం తీర ప్రాతాలలో మౌలిక సదుపాయాల కల్పనా పథకాలను ముందుకు తోసే ధ్యాస మాత్రమే ఉంది. వీటివల్ల నిజానికి మత్స్యకారుల జీవితాలు ఛిద్రమయ్యే ప్రమాదమే ఎక్కువ. పరస్పర విరుద్ధమైన ఇలాంటి చర్యలతో మత్స్యపరిశ్రమ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంవల్ల ఫలితం ఏముంటుంది? ఒక వేపు రైతుల జీవితాలకు భంగం కలిగించే విధానాలు అనుసరిస్తూ మరో వేపున కిసాన్ క్రెడిట్ కార్డులు, రైతులు చెల్లించవలసిన వడ్డీలో 2 శాతం రాయితీ ప్రకటించడంవల్ల ఒరిగేదేముంటుంది? మీడియాలో వస్తున్న వార్తలనుబట్టి చూస్తే ఈ రంగంలో వ్యవస్థీకృతంగా పని చేసే కంపెనీలకే ఎక్కువ లాభ ఒనగూరుతుంది. ఉదాహరణకు సముద్రజీవుల నుంచి ఆహారం ఎగుమతి చేయడమే తీసుకోండి. 2000 సంవత్సరం నుంచి వ్యవసాయాధారిత ఉత్పత్తుల వ్యాపార సంస్థలకే కోటి రూపాయల దాకా వ్యవసాయ రుణాలు అందజేస్తున్నారు. ఈ సంస్థలకు వ్యవసాయంతో ఉన్న సంబంధమల్లా వ్యాపారమే తప్ప వ్యవసాయానికి ఉపకరించే అంశం ఏమీ లేదు. వ్యవసాయ రుణాలపై వడ్డి రాయితీ బాగా ఉపయోగపడేది ఈ కార్పొరేట్ సంస్థలకే. ఈక్వెడార్, ఇండొనీషియా, వియత్నాం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికే ఈ రాయితీ ఉపకరిస్తుంది. పరిపాలనా సంబంధమైన, వ్యవస్థాపరమైన మార్పులన్నీ ఈ సంస్థలకే మేలు చేస్తాయి. ఈ సంస్థలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగలుగుతాయి.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే "జాతీయ స్థాయి ఉత్పత్తి" స్థానంలో "వ్యవసాయ రంగ స్థాయిలో ఉత్పాదకత అభివృద్ధి" మీద శ్రద్ధ తీసుకుంటున్నామని, దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని  ప్రధాని మోదీ గంభీరోపన్యాసాలు చేయడం చూస్తే గందరగోళం మాత్రమే మిగులుతుంది. రైతులు, ముఖ్యంగా చిన్న రైతులు తమ ఉత్పాదకత పెంచడానికి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరల విషయానికి వస్తే జనాకర్షకమైన కనీస మద్దతు ధరను మించి ఒక్క అడుగైనా ముందుకు పడడం లేదు. ప్రభుత్వం ధాన్యం సేకరిస్తే తప్ప కనీస మద్దతు ధర ప్రకటించినా ప్రయోజనం ఏమీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో ప్రజా పంపిణీ విధానం అమలు కోసం, జాతీయ ఆహార భద్రత కోసం కావలసిన ధాన్యం సేకరణకే పరిమితం అవుతుందని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ 2014 జూన్ లో ఒక ఉత్తర్వు జారీ చేసింది. ధాన్యం కాకుండా ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అసమర్థతవల్ల విపరీతమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధరల్లో ఎగుడుదిగుడు చాలా ఎక్కువ. పాడి రైతులు, ముఖ్యంగా మహారాష్ట్రలోని రైతులు ధరలు తగ్గడంవల్ల సరఫరాలో ఉన్న సమస్యలవల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.

ఆహార ధాన్యాల ఉత్పత్తి మీదకన్నా "అధిక విలువ" గల ఇతర ధాన్యాల ఉత్పత్తుల మీద శ్రద్ధ పెడితే వ్యవసాయరంగం విస్తృతం అవుతుందని, రైతుల ఆదాయనికి భద్రత ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. కానీ అధిక విలువగల ఉత్పత్తులకు ఎదురయ్యే ఇబ్బందులూ ఎక్కువే ఉంటాయి. 85 శాతం మంది రైతులకు ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఏ దారీ లేదు. రైతులు కనక అధిక విలువగల ఉత్పత్తులను పండిస్తే వారు అంతిమ ధరలో వారి చేతిలో ఉండేది అయిదింట ఒక వంతు మాత్రమే. మిగతా నాలుగు వంతులు "ఇబ్బంది"ని ఎదుర్కోవడానికి సిద్ధపడే వ్యాపార సంస్థల చేతుల్లోనే ఉంటుంది. రైతులకు బేరమాడే అవకాశమే ఉండదు. ఉదాహరణకు మీగడ తీసిన పాలపొడి అమ్ముకోవడం కోసం ఈ పదార్థాలు తయారు చేసే సంస్థలు తాజా పాలు కొనడం మానేశాయి. ప్రపంచ మార్కెట్లో మాంద్యంవల్ల ఈ పాలపొడికి గిరాకీ తగ్గినందువల్ల అమ్మకాలు తగ్గాయి కనక ముందు ఆ పాలపొడి అమ్ముకోవాలనుకుంటున్నారు. పైగా ఈ పెద్ద వ్యాపారుల పుణ్యమా అని చిన్న రైతులకు చోటే లేకుండా పోయింది. మార్కెట్ సంస్కరణలు లేనప్పుడు ఉత్పాదకత పెంచినందువల్ల ఫలితం ఏముంటుంది?

ఎన్.డి.ఎ. ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల అమ్మకం(ప్రోత్సాహం, సదుపాయ కల్పన) చట్టం ఏ రకంగానూ రైతుల ప్రయోజనాలు కాపడడానికి ఉపకరించదు. సూపర్ మార్కెట్లు, ఎగుమతిదార్లు, వాణిజ్యవేత్తలు ఈ మార్కెట్ యార్డులకు బయట రైతుల దగ్గరనుంచి నేరుగా కొనడానికి ఎందుకు అనుమతించరు? ప్రైవేటు వ్యాపారులు కనీస మద్దతు ధర ప్రకారం కొనడానికి ఈ చట్టం ఎలా తోడ్పడుతుంది? ఒకే చట్టం కింద పంటల, పశువుల మార్కెట్లు భిన్నమైన రీతిలో పని చేసే అవకాశం ఎందుకుండాలి? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గ్రామీణ ఓటర్లలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది కనక భావోద్వేగాలతో కూడిన విధానాల ద్వారా వారిని ఆకట్టుకోవాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే నిర్దిష్టమైన విధానాలు రూపొందించడం లేదు. పశు సంతతిని పరిరక్షించాలని చెప్పే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఉన్న 48వ అధికరణాన్ని పట్టించుకునే నాథుడే లేడు. సామాజిక-మత భావనాలను ఆసరాగా చేసుకుని ఈ ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోంది. పశుపాలన మీద ఆధారపడే వారు ఈ విధానాల ఆంతర్యాన్ని గ్రహింస్తే తప్ప ప్రయోజనం ఉండదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top