ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

తాయిలాల ఎన్.డి.ఎ. బడ్జెట్

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అధికారాంతంలో ఉండి త్వరలో ఎన్నికలు ఎదుర్కోవలసిన స్థితిలో ఉన్న ప్రభుత్వాల చేతిలో తాత్కాలిక బడ్జెట్లు మాంత్రికుడి చేతిలో మంత్రదండంలా ఉంటాయి. ఇటీవల ఎన్.డి.ఎ. ప్రభుత్వం ప్రతిపాదించిన తాత్కాలిక బడ్జెట్ అచ్చం ఇలాగే ఉంది. నిర్హేతుకమైన ఆదాయ మార్గాలు, పన్నుల రాయితీలతో కూడిన ఈ బడ్జెట్ ఊహించినట్టుగానే రాజకీయ ప్రతిష్ఠ కోల్పోతున్న ప్రభుత్వం తన పట్టు  సంపాదించడానికి చేసిన ప్రయత్నంగానే ఉంది. కొద్ది కాలానికి మాత్రమే వర్తించవలసిన ఈ తాత్కాలిక బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం ఉద్దేశించడం మునుపెన్నడూ లేనిదే. ఈ బడ్జెట్ అధికారంలో ఉన్న ప్రభుత్వం రాబోయే ఎన్నికల సందర్భంలో విడుదల చేసే ఎన్నికల ప్రణాళికలా ఉంది. ప్రజల్లో ఆకాంక్షలను పెంచడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో మాయ చేసింది.

ఉదాహరణకు చిన్న కమతాలున్న రైతులకు ఏటా రూ. 6,000 ఆదాయ మద్దతు ఇవ్వడానికి ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కోసం కొత్తగా నిధులు కేటాయించింది. ఈ పథకానికి కేటాయించిన నిధులు సరిపోతాయా అనే అంశాన్ని పక్కన పెట్టినా దీనిలో రాజకీయ ప్రయోజనాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఈ పథకంలో మొదటి విడతగా రూ. 2,000 చెల్లిస్తే అది ఎన్నికల తాయిలమే అవుతుంది. ఓట్లు కొనడానికి ఎంచుకున్న మార్గమే. మరో వేపున ఎన్నికల తర్వాతకు వాయిదా వేస్తే, ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసినట్టు అవుతుంది. ఈ పథకం జనాకర్షకమైంది కనక ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దాన్ని విడనాడే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఖజానాపై భారం పడ్డా ఏ రాజకీయ పక్షమూ ఈ పథకాన్ని నిలిపి వేయడం కుదరదు. కానీ ఈ మొత్తం చాలా తక్కువ అని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు చేయకూడని పని చేస్తున్నట్టే. అధికార పక్షం తన ఓటు బ్యాంకుని ఆకట్టుకోవడానికి మరో కారణం తమకు మరో సారి అధికారం అప్పగిస్తే ఇలాంటి మరిన్ని పథకాలు అమలు చేస్తామని ఆశగొల్పుతున్నట్టుగా ఉంది. అవ్యవస్థీకృత కార్మికుల కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి శ్రమ యోగీ మంధన్ కార్యక్రమం కూడా ఇలాంటిదే. ఇలాంటివి అనేకం ఈ బడ్జెట్ లో ఉన్నాయి.

ప్రతిపక్షం లోని కాంగ్రెస్ "నిరుద్యోగం" పై వ్యతిరేక ప్రచారంపై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నందుకు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. నిజానికి నిరుద్యోగం లేబర్ మార్కెట్ లోని నిర్మాణపరమైన సమస్య. దీన్ని ఎదుర్కోవడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కాని ఈ విధాన నిర్ణయాలపై చర్చ ఊసే లేదు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రధానమంత్రి లాగే శుష్క వాగ్దానాలకే పరిమితం అవుతున్నాయి. బీజేపీని విమర్శించిన ప్రతిపక్షాలు అదే మాయాజాలంలో చిక్కుకుంటున్నాయి. ఒకరిని మించిన శుష్క వాగ్దానాలు మరొకరు చేస్తున్న తరుణంలో విధానాలు, సిద్ధాంతాల మధ్య వివిధ పక్షాలలో తేడా ఏమిటో గమనించడం కష్టం అవుతుంది. ఎన్నికలు వ్యక్తుల చుట్టే తిరిగే ప్రమాదమే ఎక్కువ. ఓటర్లు "అభ్యర్థుల" మీద తమకు ఉండే అవగాననుబట్టి ఓట్లేస్తారు. తమ సామాజిక-ఆర్థిక ఆందోళనలు అభ్యర్థులు ఎంత మేరకు పరిష్కరించగలుగుతారు అని మాత్రమే చూస్తారు. ఈ దృష్టితో చూస్తే అధికార పక్షం అసంఘటిత కార్మికుల కోసం ప్రతిపాదించిన పింఛన్ పథకం పసందైన ఎత్తుగడ. ఉపాధికి సంబంధించిన గణాంకాల విషయంలో వివాదాలు చెలరేగుతున్న దశలో ఉద్యోగాల మార్కెట్ లో అవకాశాలు అడుగంటుతున్నాయని ప్రభుత్వం అంగీకరించినట్టయింది. నిరుద్యోగ సమస్య ఉందని పరోక్షంగానైనా అంగీకరించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవ్యవస్థీకృత రంగంపై ప్రభుత్వం దృష్టి నిలిపినట్టయింది. ఈ పని చేయడం ద్వారా ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలకు అనుల్లంఘనీయమైన లక్ష్య నిర్దేశం చేసినట్టయింది.

ప్రజల ఆకాంక్షల మీద ఆధారపడే రాజకీయాలు బ్రహ్మాండంగా కనిపించే ప్రకటనలు ఆచరణ యోగ్యం కాదని రుజువు చేస్తాయి. రైతులకు, అవ్యవస్థీకృత రంగ కార్మికులకు పింఛన్ వంటి పథకాలు ఇలాంటివే. రూ. 5,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారికి ఆదాయం పన్నులో రిబేట్ ఇవ్వడమూ ఇలాంటి ఆర్భాటంలో భాగమే. మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది రెండంచుల కత్తిలా తయారవుతుంది. ఇలాంటి జనాకర్షక పథకాల అమలు నిలిపి వేయడం ఏ పక్షానికైనా అసాధ్యం అవుతుంది. అయితే వీటిని అమలు చేయడం అంతకన్నా కష్టం. ఉదాహరణకు ఆదాయపు పన్నులో ప్రకటించిన రిబేటు అమలులోకి రావాలంటే ఆర్థిక బిల్లులో సవరణ చేయవలసి వస్తుంది. ఇది సమయం పట్టే వ్యవహారం. మరో వేపున ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వీటిని అమలు చేయగలిగినా ఇతర వర్గాల వారు కూడా ఈ రకమైన సదుపాయాలు కావాలని ఒత్తిడి చేస్తారు. అన్ని వర్గాలలోని పేదలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం కోటా అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రకటన ఇలాంటిదే. తాము మళ్లీ అధికారంలోకి వస్తే అధికాదాయ వర్గాలకు సైతం పన్ను రాయితీ కల్పిస్తామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇవ్వడం మరింత అవేశాన్ని పెంచుతుంది.

ఆకాంక్షలను తీర్చడానికి అనుసరించే ఈ విధానాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాయా అన్నఅంశాన్ని లేవనెత్తుతాయి. ఈ రాయితీలన్నింటివల్ల ద్రవ్య లోటు 3.4 శాతానికి పెరుగుతుందని, ఇది అంతకు ముందు పెట్టుకున్న 3.3 శాతం పరిమితికి 0.1 శాతం మాత్రమే ఎక్కువ అని ప్రభుత్వమే చెప్తోంది. అయితే ఈ లెక్కలు స్థూల జాతీయోత్పత్తి 11.5 శాతం ఉంటుందన్న తప్పుడు అంచనాల మీద ఆధారపడ్డాయి. ఇంత అభివృద్ధి అసాధారణమైంది. రిజర్వూ బ్యాంకు నుంచి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అధిక డివిడెండ్లు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం మారిపోతే బ్యాంకులతో సంస్థాగత ఒప్పందాలూ మారిపోవచ్చు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించాలంటే వ్యవస్థాపరమైన మార్పులకు అనుగుణంగా చిత్త శుద్ధితో కూడిన విధానాలు అవసరం. ద్రవ్య సంబంధమైన అసమానతలు పెరుగుతున్నప్పుడు, సత్వర ప్రోత్సాహకాల కోసం వెంపర్లాట అధికం అయినప్పుడు ఎన్నికల తర్వాత  అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఇలాంటి దీర్ఘకాలిక అంశాలపై దృష్టి నిలపగలుగుతుందా? ఈ పరిస్థితిని బట్టి చూస్తే తాత్కాలిక బడ్జెట్ ఓటర్లకు వరాల జల్లు కురిపించడమే కాదు తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి ఉరి తాడుగా పరిణమించే అవకాశం కూడా ఉంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం విభిన్నమైన సమర్థమైన ఎజెండా రూపొందించడం అసాధ్యం అవుతుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top