చట్టబద్ధ ప్రక్రియకు తిలోదకాలు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
దిశ మీద అత్యాచారం చేసి, హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంవల్ల పోలీసులకు, తెలంగాణా ప్రభుత్వానికి కొంత "విశ్వసనీయత" దక్కి ఉండవచ్చు. అదే విధంగా ఇది చాలా మందిలో రగులుతున్న ప్రతీకార కాంక్షను తీర్చి ఉండవచ్చు. అత్యాచారానికి గురైన దిశ తల్లిదండ్రులకు కూడా కొంత ఊరట కలిగి ఉండవచ్చు. ఇలా నిందితులను కడతేర్చడంపై శాంతి భద్రతలను అమలు చేసే వారికి, పోలీసులకు, న్యాయాన్యాయాలను నిర్ణయించే న్యాయవ్యవస్థకు మధ్య కొన్ని వైరుధ్యాలు కూడా ఉండి ఉండవచ్చు. అదే సమయంలో ఈ ఎన్ కౌంటర్ చట్టసభల సభ్యులకు, రాజకీయ నాయకులకు మధ్య ఉన్న విభజన రేఖను కూడా చెరిపి వేసింది. చట్టసభల సభ్యులు రాజ్యాంగంలోని నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని సారభూతమైన శాసనాలు రూపొందించాలి. చట్టసభల సభ్యులు ఏం మాట్లాడినా రాజ్యాంగ నియమాలకు, నిబంధనలకు లోబడే మాట్లాడాలి. వారి అభిప్రాయ వ్యక్తీకరణ చట్టపరిధిలో ఉండాలి. ఎందుకంటే శాసనాలు రూపొందించేటప్పుడు వారు ఈ పరిధుల్లోనే వ్యవహరించవలసి ఉంటుంది. కానీ దిశ ఉదంతంలో కొంతమంది చట్టసభల సభ్యులు ఈ పరిమితులకు కట్టుబడి వ్యవహరించలేదు. అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్న నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని కొందరు చట్టసభల సభ్యులు కీర్తించారు.
కొందరు చట్టసభ సభ్యుల అభిప్రాయాలు రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించినట్టుగా ఉంది. ఇది తన రాజకీయ పక్షం తరఫున మాట్లాడే రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగా ఉంది. పౌర సమాజానికి చెందిన కొందరు కూడా భావోద్వేగాలను సమర్థిస్తూ పోలీసుల చట్ట వ్యతిరేక ప్రవర్తనను సమర్థించారు. పోలీసులు "తొందరపాటు"లో తీసుకున్న చర్యను సమర్థించేటప్పుడైనా ఇలాంటి వారు సరైన చట్టబద్ధ ప్రక్రియకు అనుగుణంగా వ్యవహరించి ఉండవలసింది. చట్టసభల సభ్యులు, పోలీసులు కూడా నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తిస్తారని ఆశిస్తాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించే చట్టసభల సభ్యులు ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వైపరీత్యమే. పోలీసుల ప్రవర్తన సమర్థనీయం కాకపోవడమే కాక అనుమానాస్పదంగా కూడా ఉంది. పోలీసులు ఇలా వ్యవహరించడం మీద నియంత్రణ లేకుండా పోతోంది. పోలీసుల చర్యను అనేక మంది న్యాయనిపుణులు తప్పు పట్టారు.
అత్యాచారం చేశారన్న నిందితులను ఎన్ కౌంటర్ చేయడం ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన పోలీసులకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఘర్షణ ఉన్నట్టు తయారైంది. పోలీసుల చర్య అత్యుత్సాహంగానే కాక న్యాయ వ్యవస్థ ధర్మబద్ధతనే అతిక్రమించేదిగా తయారైంది. ఈ కేసును జాగ్రత్తగా దర్యాప్తు చేయాలన్న నియమాన్ని పోలీసులు లెక్కచేయలేదు. పోలీసులు తీసుకున్న చర్య చట్టపరమైన, రాజ్యాంగపరమైన ప్రక్రియను ఉల్లంఘించినట్టుగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. నేరాలను దర్యాప్తు చేసేటప్పుడు అనుసరించవలసిన ప్రక్రియను అనుసరించలేదు. న్యాయ వ్యవహారాల్లో పరిజ్ఞానం ఉన్న వారికి ఇది విపరీతంగా కనిపిస్తుంది.
సక్రమమైన ప్రక్రియను అనుసరించేటట్టయితే పోలీసులు తీసుకున్న "సత్వర చర్య"ను, చట్టసభల సభ్యులు మాట్లాడిన తీరును ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. పోలీసులు అనుసరించిన పద్ధతివల్ల న్యాయవాదులు, న్యాయవ్యవస్థ క్షుణ్నంగా పరిశీలించడానికి వీలు లేకుండా చేసింది. తార్కికమైన చర్య హేతుబద్ధంగా ఉండాలి. సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు తీర్పు చెప్పేట్టుగా ఉండాలి. అప్పుడే నిందితులపై చట్ట ప్రకారం కఠినమైన శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు "సత్వర చర్య" తీసుకున్నందువల్ల న్యాయవ్యవస్థ న్యాయాన్యాయాలను నిశితంగా పరిశీలించి తీర్పు చెప్పే అవకాశమే లేకుండా పోయింది. పోలీసుల చర్యవల్ల జనానికి విషయం చెప్పే అవకాశమే లేకుండా పోయింది. పోలీసులు నియతమైన ప్రక్రియ అనుసరించడానికి, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటారని అనుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీనితో పోలీసులు సమాజంలో సవ్యమైన న్యాయ ప్రక్రియ, చట్టబద్ధ పాలన గురించిన రాజ్యాంగంలోని అంశాలను పౌరులకు తెలియజెప్తారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. పోలీసులు సైతం చట్టానికి, రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ఉండవలసిందే. నేరాలకు సంబంధించిన కేసుల విషయంలో రాజ్యాంగ విహితమైన పద్ధతులకు కట్టుబడి ఉండవలిసిందే. కానీ పోలీసులు ఈ కేసులో హేతుబద్ధంగా వ్యవహరించలేదు. "ఆత్మ రక్షణకోసం" ఆ నలుగురిని కాల్చేయవలసి వచ్చిందన్న వాదన నమ్మ శక్యంగా లేదు. ఎందుకంటే ఆ నలుగురు చేసిన నేరానికి వాళ్లే తప్ప ఇతర సాక్షులు ఎవరూ లేరు.