ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ముదురుతున్న ఆర్థిక మందగమనం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నా 2019 జులై-సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో మన స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) 4.5 శాతం దగ్గరే చతికల పడి ఉంది. ఇది ఈ సంవత్సరంలో రెండవ త్రైమాసికం పరిస్థితి. మొదటి త్రైమాసికంలో జి.డి.పి. వృద్ధి రేటు 5 శాతం ఉండేది. వృద్ధి రేటు క్రమంగా తగ్గడం ఇది ఆరవ సారి. ఈ కాలంలో వృద్ధి రేటు 3.6 శాతం తగ్గింది. 2013 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ప్రస్తుతం ఉన్న వృద్ధి రేటు కన్నా స్వల్పంగా తక్కువ. అప్పుడు వృద్ధి రేటు 4.3 శాతం ఉండేది.

వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం గిరాకీ తగ్గడం. అది క్రమేపీ తగ్గుతోంది. ప్రభుత్వ వ్యయం పెరిగినా వృద్ధి రేటు పతనావస్థలోనే ఉంది. ఎందుకంటే వినియోగం తగ్గుతోంది. ప్రైవేటు పెట్టుబడులు స్తంభించి పోయాయి. వార్షికంగా సర్దుబాటు చేసిన వృద్ధి రేటు ప్రకారమైతే అది 3.6 శాతమే ఉంది. ఖర్చుల ధోరణిని గమనిస్తే ప్రైవేటు ఖర్చుల రేటు రెండవ త్రైమాసికంలో 5 శాతం పెరిగింది. అది మొదటి త్రైమాసికంలో 3.1 శాతం ఉండేది. అయితే ఈ ఖర్చు పెరిగినట్టు కనిపిస్తున్నా అనేక రంగాలలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కూడా వినియోగం తగ్గింది. స్థూల మూలధన సమీకరణ మొదటి త్రైమాసికంలో 4 శాతం పెరిగితే రెండవ త్రైమాసికంలో 1 శాతం మాత్రమే పెరిగింది. అయితే ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం రెండవ త్రైమాసికంలో 15.6 శాతం పెరిగింది. ఇది మొదటి త్రైమాసికంలో 8.8 శాతమే ఉండేది. కార్పొరేట్ సంస్థలు రుణాలు చెల్లించకపోవడం, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడడంవల్ల, బ్యాంకింగేతర రంగంలో సంక్షోభం కారణంగా పెట్టుబడులకు డిమాండు తగ్గింది. దీనికి కారణం రుణాలు ఇచ్చే విధానం కఠినంగా ఉండడం. దీనికి తోడు సరఫరాలో కూడా ఇబ్బందులున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఎటూ ఉంది. సుదీర్ఘ కాలం పాటు గిరాకీ తగ్గితే దీర్ఘ కాలంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం కూడా తగ్గుతుంది. పెట్టుబడులు పెట్టడంలో జాప్యం జరుగుతుంది. దీర్ఘ కాలికంగా అభివృద్ధి కుంటువడుతుంది.

స్థూల విలువ జోడించిన (గ్రాస్ వాల్యూ ఆడెడ్-జి.వి.ఎ.) విధానాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఆర్థిక వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో 4.9 శాతం ఉంటే రెండవ త్రైమాసికంలో 4.3 శాతమే ఉంది. ఉత్పత్తి రంగాలలో మందగమనం ఆవరించింది. ఇది ఆందోళన కలిగించే అంశం. మొదటి త్రైమాసికంలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు 2 శాతం ఉంటే రెండవ త్రైమాసికంలో 2.1 శాతం ఉంది. గనుల రంగంలో మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 2.7 శాతం ఉంటే అది రెండవ త్రైమాసికంలో 0.1 శాతానికి తగ్గింది. వస్తూత్పత్తి రంగంలో వృద్ధి రేటు ఒక శాతం తగ్గింది. విద్యుత్తు, ఇతర ప్రజలకు ఉపయోగపడే రంగాలలో మొదటి త్రైమాసికంలో 8.6 శాతం వృద్ధి నమోదైతే అది రెండవ త్రైమాసికంలో 3.6 శాతానికి పరిమితమైంది. నిర్మాణ రంగంలో మొదటి త్రైమాసికంలో వృద్ధి 5.7 శాతం అయితే రెండవ త్రైమాసికంలో అది 3.3 శాతమే ఉంది. వాణిజ్యం, హోటల్ పరిశ్రమ, రవాణా, కమ్యూనికేషన్ల రంగంలో మొదటి త్రైమాసికంలో 7.1 శాతం వృద్ధి ఉంటే రెండవ త్రైమాసికంలో అది 4.8 శాతం దగ్గరే చతికిల పడింది. ఆర్థిక సేవల రంగం మొదటి త్రైమాసికంలో కనబర్చిన వృద్ధి 5.9 శాతం అయితే రెండవ త్రైమాసికంలో అది 5.8 శాతం ఉంది. ప్రభుత్వ వ్యయం పెరిగినదువల్ల ప్రభుత్వ పరిపాలన, రక్షణ రంగం, ఇతర సేవల్లో మాత్రం వృద్ధి మొదటి త్రైమాసికంలో 8.5 శాతం ఉంటే రెండవ త్రైమాసికంలో 11.6 శాతం అయింది.

ఆర్థిక మాంద్యం కారణంగా అవ్యవస్థీకృత రంగం కూడా కుదేలైనా దీనికి సంబంధించిన ప్రభుత్వ గణాంకాలు అందుబాటులో లేవు. ఆర్థిక మాంద్యం లేబర్ మార్కెట్ ను కూడా దెబ్బ తీసింది. భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సి.ఎం.ఐ.ఇ.) అంచనా ప్రకారం నిరుద్యోగం గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా అక్టోబర్ లో 8.45 శాతం పెరిగింది. నిరుద్యోగం సెప్టెంబర్ లో 7.16 శాతం, ఆగస్టులో 8.19 శాతంగా నమోదయ్యాయి. సి.ఎం.ఐ.ఇ. నిర్వహించిన కన్స్యూమర్ పిరమిడ్స్ హౌజ్ హోల్డ్ సర్వే (సి.పి.హెచ్.ఎస్.) ప్రకారం కార్మికుల భాగస్వామ్యం 77 పాయింట్లు తగ్గి 2019 నవంబర్ లో 42.3 శాతానికి చేరింది. ఇంత తక్కువ భాగస్వామ్యం నమోదు కావడం 2016 తరవాత ఇదే మొదటి సారి. 2016లోనే సి.ఎం.ఐ.ఇ. ఈ గణాంకాలు సేకరించడం ప్రారంభించింది. సి.పి.హెచ్.ఎస్. 25 రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలు సేకరిస్తే అందులో 15 రాష్ట్రాలలో అక్టోబర్ లో కన్నా నవంబర్ లో కార్మిక భాగస్వామ్యం తగ్గినట్టు తేలింది. ఉపాధి కోల్పోవడం, ఆదాయాలు తగ్గడంవల్ల వినియోగానికి గిరాకీ తగ్గింది. గ్రామీణ సంక్షోభమే దీనికి ప్రధాన కారణం.

మొదటి త్రైమాసికంలో మందగమనం తరవాత గిరాకీ పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉండింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అందువల్ల గ్రామీణ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన సవ్యంగా అమలు కాలేదు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బకాయిలూ చెల్లించలేదు. ఈ మొత్తమే రూ. 25,000 కోట్లు దాటింది. వినియోగం, గిరాకీ పెరగాలంటే ఉపాధి అవకాశాలు పెంచాలి. అయితే ఇది త్వరలో జరుగుతుందన్న ఆశ లేదు.

దేశంలో ఆర్థిక స్థితిగతులు, సానుకూల ద్రవ్య ఉద్దీపనలు, సరఫరాలో లోపాలు లేకుండా ఉంటేనే గిరాకీ పెరుగుతుంది. దీనికి విస్తృతమైన ద్రవ్య విధానం కావాలి. ఆర్థిక సహాయంవల్ల ఫలితం ఏమీ కనిపించడం లేదు. ఊహించినట్టుగా డిసెంబర్ 5న రిజర్వూ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించలేదు. రెపో రేట్లూ మారలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో జి.డి.పి. వృద్ధి రేటు 6.1 శాతం ఉంటుందని ముందు వేసిన అంచనాలను 5 శాతానికి కుదించారు. 2020 ఆర్థిక సంవత్సరం రెండవ అర్థభాగంలో చిల్లర ద్రవ్యోల్బణం 3.5 నుంచి 3.7 శాతం ఉంటుందని ముందు అంచనా వేస్తే అది ఇప్పుదు 5.1 నుంచి 4.7 శాతం ఉంటుందంటుందని అంచనా. అక్టోబర్ నాటికే ద్రవ్య లోటు లక్ష్యానికన్నా వంద శాతం పెరిగింది. ఈ పరిస్థితిలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ నియమాన్ని సడలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వ్యయం తగ్గిస్తే అభివృద్ధి రేటు మరింత తగ్గుతుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top