నైతిక విలువలకు కట్టుబడే ప్రజాస్వామ్యం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ప్రజాస్వామ్యాన్ని పట్టించుకునే వారు నిర్దిష్టమైన అంచనా వేయడానికి, ముఖ్యంగా ఉదారవాద ప్రజాస్వామ్యం గురించి తర్కిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా రెండు అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. ఒకటి - ఆ ప్రజాస్వామ్యం ఎంత బలమైంది అని, రెండు - ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తారు. ప్రక్రియలు రాజ్యాంగపరమైన హామీలకు సంబంధించినవి. ఈ హామీలు ప్రతి పౌరుడికి రాజకీయ రంగంలో తన వంతు పాత్ర నిర్వర్తించడానికి తోడ్పడతాయి. ఇందులో పౌరుల్లో ఎక్కువ తక్కువలు ఉండవు. పౌరులందరికీ ఇలాంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో సమాన విలువ ఉంటుంది. ఎన్నికల రంగంలో ఈ సమానత మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే ఓటు వేయడానికి హక్కు ఉండడం అంటే ప్రతి ఓటుకు ఒకే విలువ ఉండడం. ఇదే అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పౌరులు ఒక నిర్దిష్ట ప్రాంతంవారనో, ఒక భాష మాట్లాడే వారనో, ఒక మతానికి చెందిన వారనో మొదలైన మీమాంసలకు ఓటు హక్కుకు సంబంధం ఉండదు. రాజ్యాంగం అందరికీ సమాన స్థాయి కల్పిస్తుంది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులలో ఒక్క ఓటు హక్కే కాదు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యే హక్కూ, అదీ తమ వ్య్వక్తిగత విషయాలపై కాకుండా మొత్తం ప్రజా హితం గురించి మాట్లాడే హక్కూ ఉంటుంది.
రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే పౌరులు ఎవరి అనుమతి, ప్రాపకం, సానుభూతి అవసరం లేకుండా దేశంలో ఉండొచ్చు. అంటే ఆదర్శపూర్వక పరిస్థితులు ఉంటే పౌరులు ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడవలసిన అగత్యం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే పౌరసత్వం సామాజిక దొంతరలకు సంబంధించింది కాదు.
అయితే మన దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రజాస్వామ్యం ఈ భావనకు అంటే ఉదారవాద ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధంగా ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకోసం జన సమీకరణను విజ్ఞులైన పౌరులను తయారు చేయడానికి కాకుండా కుల, మతాల ఆధారంగా కొన్ని వర్గాల ప్రజల మద్దతు మాత్రమే సమీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. అలాంటి రాజకీయ పార్టీలు మత ప్రాదిపదికన, ఒక వర్గం వారిని చేరదీసే ప్రాతిపదికన పని చేస్తున్నాయి. ఇలా వ్యవహరించడంలో ఒకే ఒక లక్ష్యం ఉంది. అది మతం ఆధారంగా రాజకీయంగా అధిక సంఖ్యాకుల మద్దతు సంపాదించమే. తమ రాజకీయ పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు. అత్యధిక సంఖ్యాకులైన వారికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఈ మెజారిటీపై ఆధార పడింది కాదు. ఒక మత వర్గంపై మాత్రమే ఆధారపడింది.
వ్యక్తికి, లేదా కేవలం సొంత వ్యక్తిత్వం మీదే ఆధార పడిన వారి అస్తిత్వం లేకుండా చేయడం అంటే అది ఆ వ్యక్తి మీద విపరీతమైన ద్వేషం ఉన్నందువల్లే. ఆ వ్యక్తి మైనారిటీ వర్గానికి చెందిన వాడే అయి ఉంటాడు. ఇలా ఒక వ్యక్తి మైనారిటీ వర్గానికి చెందిన వాడు అయినందువల్ల అస్తిత్వాన్ని హరింప చేయడం నైతికంగా దురాక్రమణ పూరితమైంది. దీనివల్ల ఒక వర్గం వారు ఎరుక కలిగిన పౌరులుగా మారి తమ అస్తిత్వాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది.
ప్రజాస్వామ్యం అందరికీ అవకాశం ఉండే రాజకీయ ఆవరణ. అందులో వ్యక్తులు తమ హక్కులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ప్రజాస్వామ్య ఆవరణలో అందరికీ అవకాశం కల్పించడానికి రాజ్యాంగపరమైన హక్కు ఉంటే సరిపోదు. కానీ అది అవసరమే. వ్యక్తి తనను తాను తెలుసుకోవడానికి ఈ హక్కు మాత్రమే సరిపోదు. దానివల్ల పౌరులందరికీ సమాన విలువ ఉండడం సాధ్యం కాదు. సమానంగా పౌరుల దృష్టిని ఆకర్షించడం సాధ్యం కాదు. దానికి హామీ కూడా ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ఆవరణలో భాగమైన ప్రతి వ్యక్తి నైతిక సంసిద్ధత తెలియజేయాలి. ఇతరులకు కూడా సమాన విలువ ఉంటుందని గుర్తించాలి.
స్పందించే గుణం గల ప్రజాస్వామ్యంలో నైతిక సంసిద్ధత అవసరం. ప్రజాస్వామ్య ఆవరణ ఆహ్వానించేదిగా ఉండాలి తప్ప ద్వేషించేదిగా ఉండకూడదు. అప్పుడే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి కేవలం వస్తువుగా మారిపోకుండా ఉండగలడు. ఇలా ద్వేష భావానికి గురయ్యే వారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉండవచ్చు గాక. కానీ ఇలాంటి సామాజిక సమూహాలు తమ వాణి వినిపించగలుగుతున్నారని నమ్మకంగా చెప్పడం సాధ్యం కాదు. కానీ తమ వాణి వినిపించడానికి ఈ అవకాశం ఉండాలి. వ్యవస్థల్లోనూ, బహిరంగ ఆవరణల్లోనూ వారికి స్థానం ఉండాలి. కానీ ఇలాంటి అవకాశం సన్నగిల్లుతోందని చెప్పడానికి సందేహించవలసిన అవసరం లేదు.
గత రెండు దశాబ్దాలుగా అమలవుతున్న ప్రజాస్వామ్య ప్రక్రియలో నైతికంగా స్పందించే గుణాన్ని ప్రదర్శించడం అసాధ్యం అయిపోతోంది. అందువల్ల ప్రజాస్వామ్యంలో రాజకీయ ఆవరణ అందుబాటులో ఉన్నంత మాత్రాన సరిపోదు. గౌరవప్రదంగా ఆ ఆవరణను వినియోగించుకోగలగాలి. సార్వ జనీనమైన గౌరవాదరాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకునే అవకాశం ఉండాలి. ప్రజాస్వామ్య ఆకాంక్షలకు, వాటిని సాధించడానికి వీలుండాలి. రాజకీయ సమాజం సుసంఘటితమై నైతిక సమాజంగా అవతరించడానికి అవకాశం ఉండాలి. నైతిక విలువలను పాటించడంవల్ల, పరస్పర గౌరవాదరాలవల్ల మాత్రమే ఇది సాధ్యం. నైతిక సంఘీభావం సాధించడంవల్లే ఇది సాధ్యమవుతుంది తప్ప రాజకీయంగా మెజారిటీవర్గం ఆధిపత్యం చెలాయించే ధోరణి ప్రదర్శించడం వల్ల ప్రయోజనం లేదు.