ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధర

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఆహార పదార్థాల ధరలు అమాంతం పెరగడం మన దేశంలో సర్వసాధారణం. కాని ఈ విషయంలో ప్రభుత్వ స్పందన అలసి సొలసి చెప్పే సమాధానం లాగే ఉంది. రైతుల పరిస్థితి మెరుగు చేస్తామని బ్రహ్మాండమైన వాగ్దానాలు మాత్రం చేస్తుంటారు. గత కొన్ని వారాలుగా కూరగాయల ధరలు, ముఖ్యంగా ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విధాన నిర్ణయాలు తీసుకునే వారిలో తొట్రుపాటు కనిపిస్తోంది. ప్రభుత్వం ఎంత హడావుడి పడ్డా ఎగుమతుల మీద కనీస ఎగుమతి ధర విధించడం, దేశంలోని వ్యాపారస్థులు తమ దగ్గర నిలవ ఉంచుకోదగిన సరుకుపై పరిమితి విధించడంవంటి ఆనవాయితీ ప్రకారం తీసుకునే వ్యూహాలకే పరిమితం అవుతోంది. 2017లో కిలో ఉల్లిపాయల ధర రూ. 80, కిలో టొమాటోల ధర రూ. 110 అయినప్పుడు కూడా ప్రభుత్వం ఇలాంటి చర్యలే తీసుకుంది. కూరగాయాలు పండని కాలంలో ధర పెరగడం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు. ఏడాది విడిచి మరో ఏడాది ఇలాంటి పరిస్థితే తలెత్తుతోంది. ఈ ధరల పెరుగుదలకు కారణాలు తమ చేతిలో లేవని విధాన నిర్ణయాలు చేసే వారు చెప్తుంటారు. ప్రభుత్వం ఇలాంటి నిస్సహాయత వ్యక్తం చేయడం మామూలే.

సత్వర చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఏ చర్యా తీసుకోకుండా అసలు విషయాన్ని కప్పి పుచ్చడం పరిపాటి అయిపోయింది. ఇలా ధరలు పెరిగినప్పుడల్లా ఏదో కదాచిత్తుగా జరిగిన వ్యవహారంగా భావిస్తారు కాని వ్యవస్థాపరంగా ఉన్న లోపాలను పట్టించుకోరు. ఇది ప్రభుత్వం చేసే వాగ్దానాలకు అమలుకు మధ్య ఉన్న వైరుధ్యం కూడా. "ఒకే దేశం-ఒకే మార్కెట్" అనే ప్రభుత్వం నిజానికి గిట్టుబాటయ్యే మార్కెట్లు, ముఖ్యంగా ఉల్లిపాయల మార్కెట్లు రైతులకు అందుబాటులో లేకుండా చేస్తాయి. వెంటనే ధరలు అదుపు చేయడం కోసం ఈ పని చేస్తుంది. ప్రభుత్వ నిస్సహాయత ఈ ప్రభుత్వానికి మద్దతిచ్చే మధ్యతరగతి జీవుల చెవికి ఇంపుగానే ఉంటుంది. మధ్య తరగతి ప్రజలు బొటాబొటి జీవితమే గడుపుతుంటారు. కాని ఇలాంటి సంవేదనల మీద ఆధారపడి సాగే రాజకీయాలు అసలు సమస్యలను మరుగున పడేస్తుంటాయి. ఉదాహరణకు ప్రభుత్వం అనుసరించే విధానాలు రైతులను "నికర కొనుగోలుదార్లుగా లేదా వినియోగదార్లుగా" ఎందుకు చూడవు, ఇలాంటి సందర్భాలలో వినియోగదార్ల సంక్షేమం అన్న విధానం నిజంగా వినియోగదార్లకు అనుకూలంగా ఉందా మొదలైనవి చర్చనీయాంశాలు కాకుండా పోతాయి. ఈ విషయంలో ప్రభుత్వ వాదనలు సాధారణంగా వాస్తవ దూరంగా ఉంటాయి. రైతులు పండించే కూరగాయల ధరలు మధ్య దళారులకు అయ్యే ఖర్చు, లాభాల మీదే ఆధారపడి ఉంటాయి కనక ధరలపై పంట పండించే వారికి ఏ ప్రమేయమూ ఉండదు. చిల్లర వ్యాపారులే ఎక్కువ లాభం పొందుతూ ఉంటారు. చిల్లర ధరలు సాధారణంగా టోకు ధరలకు అనుగుణంగా ఉండవు. ఉదాహరణకు జాతీయ తోటల పెంపకం బోర్డు విడుదల చేసిన సమాచారం ప్రకారం 2018 జనవరిలో దిల్లీలో కిలో ఉల్లిపాయలు రూ. 32 ఉంటే 2018 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లో ఆ ధర వరసగా రూ. 20, 11, 9కి పడిపోయింది. అలాగే చిల్లరగా 2018 జనవరిలో కిలో ఉల్లిపాయల ధర 49 ఉంటే ఆ తరవాత తగ్గింది రూ. 37, 38కి మాత్రమే. అదే విధంగా గత కొన్ని వారాలుగా దిల్లీలో కిలో ఉల్లి పాయలు రూ. 30 నుంచి రూ. 32 దాకా ఉన్నాయి. చిల్లర ధరలు మాత్రం రూ. 50 నుంచి 59 మధ్య ఉన్నాయి.

అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రస్తుత పరిస్థితిలో వ్యవస్థాపరమైన అంశాలను పట్టించుకోనే లేదు. ఉత్పత్తి చేసే వారికి గిట్టే ధర, వినియోగదారు కొనే ధరకు మధ్య అంత వ్యత్యాసం ఎందుకు ఉంటుందో గమనించనే లేదు. దీన్నిబట్టి "వినియోగదార్లకు అనుకూల" విధానం అనుసరిస్తామన్నది వాక్చాతుర్యానికే పరిమితం అవుతోంది. అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు 2017లో విడుదల చేసిన నివేదిక చూస్తే వినియోగదార్లకు అనుకూల వైఖరి అన్నది ధరలు పెరిగే స్థితి ఉన్నప్పుడల్లా ప్రభుత్వం ఉల్లిపాయల వ్యాపారాన్ని కట్టడి చేయడానికే పరిమితం అవుతోందని తేలింది. స్థిరమైన వాణిజ్య విధానాలు కొరవడడం ఉత్పత్తిదార్లకు ఏ మాత్రం అనువుగా ఉండవు. కనీస ఎగుమతి ధర నిషేధమూ ఉపకరించడం లేదు. టన్ను ఉల్లిపాయల ఎగుమతి ధర 300 డాలర్లు ఉంటే ఇప్పుడు దాన్ని 850 డాలర్లు చేశారు. ఎగుమతి ధర పెరిగినా రైతుకు ఒరిగేది ఏమీ లేదు. అంతే కాకుండా అప్పుడప్పుడూ మాత్రమే ఎగుమతి చేస్తే అంతర్జాతీయ మార్కెట్లు ఎగుమతిదారుగా మన మీద విశ్వాసం తగ్గుతుంది. ఎగుమతుల విలువా పడిపోతుంది.

వైపరీత్యం ఏమిటంటే ఈ ప్రభుత్వం 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేట్టు చేస్తామంటోంది. తోటల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్తోంది. 2022 నాటికి ఎగుమతులు కనీసం 60 బిలియన్ డాలర్లు ఉంటాయంటోంది. కాని ఆచరణలో మాత్రం రైతులు సాంప్రదాయికమైన మండీ వ్యవస్థ మీదే ఆధారపడవలసి వస్తోంది. ఈ మండీల్లో వేలం వేయడం వ్యాపారుల, కమిషన్ ఏజెంట్ల చేతుల్లోనే ఉంటుంది. భారత ఆహార మార్కెట్లో భాగస్వాముల సంఖ్య పెరిగినా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ గానీ, టోకు మార్కెట్లు కానీ మారలేదు. ఇలాంటి మార్పుకు దోహదం చేసే విధనాలూ అనుసరించలేదు. వినియోగదార్లకు వర్తించే ధర పెరిగినా రైతుకు అందే ధర పెరగడం లేదన్నది వాస్తవం. ఆహార పదార్థాలు కొనని వ్యవసాయ దార్లపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇలాంటి రైతులకు ఎవరు బాధ్యత వహిస్తారు?

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top