ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

తప్పులు దిద్దుకున్న సుప్రీంకోర్టు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

.

ఈ దశాబ్దంలో సుప్రీం కోర్టు అనేక సార్లు తన తప్పులు దిద్దుకుంది. 1976నాటి ఎ.డి.ఎం. జబల్ పూర్ కు ఎస్.కె.శుక్లా కు మధ్య ఉన్న కేసులో జరిగిన తప్పిదాన్ని 2017 నాటి కె.ఎస్.పుట్టుస్వామికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేసులో తీర్పుతో సరి దిద్దుకుంది. అలాగే 2013 నాటి సురేశ్ కుమార్ కౌశల్ కు నాజ్ ఫౌండేషన్ కు మధ్య ఉన్న కేసులో జరిగిన పొరపాటును 2018 నాటి నవతేజ్ సింగ్ జోహార్ కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేసులో తీర్పు ద్వారా సరి దిద్దుకుంది. పరిస్థితులు మారినందువల్ల న్యాయస్థానాలు చట్టం గురించి తమ అభిప్రాయాలు మార్చుకోవచ్చు. కానీ ఇటీవలి ఈ రెండు తీర్పుల ద్వారా సుప్రీం కోర్టు కొంతమేరకైనా మానసిక పరివర్తనకు గురైనట్టు కనిపిస్తోంది. ఈ  దిద్దుబాటు కేవలం చట్టాన్ని విడమర్చడంలోనో, వాస్తవాన్ని గ్రహించనందువల్లనో జరిగిన పొరపాటు సరిదిద్దుకోవడానికి పరిమితం కాకుండా అంతకన్నా లోతైన మార్పు ఉంది. ఒక ముఖ్యమైన ప్రశ్నను న్యాయస్థానం సరైన వైఖరిలో చూడలేదని అందువల్లే తమ పొరపాటును సరిదిద్దుకోవలసి వచ్చిందని రుజువవుతోంది.

1989 నాటి షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డు తరగతుల మీద అత్యాచార నిరోధక చట్టంపై గతంలో 2018నాటి డా. ఎస్.కె. మహాజన్ కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పునఃసమీక్షించుకుని సవరించుకుంది. మహాజన్ కేసును పునః సమీక్షించినప్పుడు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచి అంతకు ముందు జారీ చేసిన నిర్దేశాల ప్రకారం అత్యాచారా నిరోధక చట్టం కింద ఒక ప్రభుత్వాధికారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి అంటే పై అధికారుల అనుమతి తీసుకోవడం, పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ దర్యాప్తు చేయడం తప్పని సరి వ్యవహారంగా ఉండేది. ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయడానికి ముందు ఈ దర్యాప్తు జరగవలసిన ఆవశ్యకత ఉండేది.

అంతకు ముందున్న తీర్పులను విశ్లేషించి, అత్యాచారాల చట్టాన్ని పునః సమీక్షించడం అంటే చట్టంలో ఉన్న లొసుగులను చక్క దీద్దడమే. నేరాలకు సంబంధించిన ఏ చట్టమూ లేనప్పుడు న్యాయస్థానాలు ప్రత్యేకమైన పద్ధతులను నిర్దేశించలేవు. సాధారణంగా న్యాయస్థానాలు అస్పష్టమైన మార్గ నిర్దేశాలు జారీ చేయడం పరిపాటి. కానీ ప్రత్యేకంగా ఈ కేసులో అంతకు ముందు ఇచ్చిన తీర్పు అసలు అత్యాచార నిరోధక చట్టాల మూలాన్నే దెబ్బ తీసేదిగా ఉంది. దీనివల్ల కులం ఆధారంగా దాడులకు గురైన వారికి న్యాయం కలగడం అసాధ్యంగా ఉండేది.

కానీ తాజా తీర్పు ఈ పరిధి దాటి వర్తిస్తుంది. మహాజన్ కేసులో గతంలో ఇచ్చిన తీర్పు సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని; దళితులు, ఆదివాసులు అత్యాచార నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయంతో ఇంతకు ముందు న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు గ్రహించింది. దేశవ్యాప్తంగా దళితుల మీద అత్యాచారాలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయన్న వాస్తవాన్ని సుప్రీం కోర్టు గమనించింది. ఈ దాడులు కొనసాగడాని నేర నిర్ణయ వ్యవస్థ విఫలం కావడమే కారణమని కూడా అంగీకరించింది. ఈ లోపాల వల్లే దళితుల మీద దాడి చేసిన వారికి చాలా అరుదుగా మాత్రమే శిక్షలు పడేవి. దళితులకు, ఆదివాసులకు రక్షణ కల్పించాలంటే మరింత గట్టి చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. మహాజన్ కేసులో మొదట తీర్పు చెప్పిన బెంచీలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు సవర్ణులే. ఈ తీర్పును పునః సమీక్షించిన బెంచీలో ముగ్గురు న్యాయమూర్తులు ఉంటే అందులో ఒకరు దళిత న్యాయమూర్తి కూడా ఉన్నారు.

మహాజన్ కేసులో పునఃసమీక్ష తరవాత ఇచ్చిన తీర్పు ఆహ్వానించ దగిందే కాని ప్రస్తుత సందర్భాన్నిబట్టి చూస్తే అది అంత విశిష్టమైంది ఏమీ కాదు. ఎందుకంటే మహాజన్ కేసులో మొదట తీర్పు వెలువడిన కొద్ది నెలలకే 2018 నాటి షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తరగతుల మీద అత్యాచార నిరోధక చట్టంలో సవరణలు చేశారు. అందువల్ల సుప్రీంకోర్టు మునుపటి తీర్పును పునః సమీక్షించడం కేవలం లాంఛన ప్రాయమైందే. పార్లమెంటు ఆమోదించిన చట్ట సవరణకు అత్యున్నత న్యాయస్థానం కేవలం ఆమోద ముద్ర మాత్రమే వేసింది. మరో ముఖ్యమైన కారణమూ ఉంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి అత్యంత హీన స్థాయిలో ఉంది. అందువల్ల అత్యున్నత న్యాయస్థానం కేవలం ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయమే తీసుకుందేమో అనిపిస్తోంది. ఉందనుకుంటున్న హృదయ పరివర్తన లేదేమోనన్న అనుమానమూ వస్తోంది. ఇటీవల న్యాయవ్యవస్థ గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన రీతిలోనే వ్యవహరించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ పునఃసమీక్ష కూడా అందులో భాగమే అయి ఉండవచ్చు. మొదటి తీర్పును పునఃసమీక్షించిన బెంచిలో ఉన్న న్యాయ మూర్తి బి.ఆర్.గవాయ్ దళితుడు. ఒక దళితుడు సుప్రీంకోర్టు బెంచీలో ఉండడం దశాబ్దకాలంగా ఇదే మొదటి సారి. కాని న్యాయమూర్తి గవాయ్ విడిగా తీర్పేమీ చెప్పలేదు. బ్రాహ్మణుడైన న్యాయమూర్తి అరుణ్ మిశ్రా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచి తరఫున తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టులోనూ అట్టడుగు వర్గాల వారు నోరు విప్పి మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు.

సుప్రీంకోర్టు సరిదిద్దుకున్న మరో రెండు సందర్భాల కన్న మహాజన్ కేసు పునఃసమీక్ష తరవాత వెలువరించిన తీర్పు భిన్నమైంది. ఆ రెండు తీర్పులు అణగారిన వర్గాల వారి హక్కులను పరిరక్షించడానికి తోడ్పడతాయి. మహాజన్ కేసులో తాజా తీర్పు మాత్రం దళితుల హక్కులకు మరింత భంగం కలగకుండా నిరోధించడానికి మాత్రమే తోడ్పడుతుంది. తాజా తీర్పు వెలువరించడానికి కారణం ముందు ఆ అవకాశం లేకుండా చెయడమే. తాజా తీర్పు మీద ఎంత అట్టహాసంగా హర్షం వ్యక్తం అవుతున్నా అది మహాజన్ కేసులో పునఃసమీక్ష తరవాత ఇచ్చిన తీర్పు దళితుల మీద జరుగుతున్న దాడులను కొంత మేర నిరోధించడానికి తోడ్పడుతుందే తప్ప కులోన్మాదంవల్ల వారి మీద దాడులను నివారించడానికి, ఎదుర్కోవడానికి తోడ్పడుతుందే తప్ప వారికి మరిన్ని హక్కులు కల్పించడానికి ఉపకరించదు. ఎందుకంటే మన న్యాయవ్యవస్థలో కుల తత్వం తక్కువేమీ కాదు.

మహాజన్ కేసులో ఇచ్చిన తీర్పులో ఉన్న లోపాలను సుప్రీంకోర్టు సంపూర్ణంగా గుర్తించిందా? తాజా తీర్పును పరిశీలిస్తే అలా జరగలేదనే రూఢి అవుతోంది. అయితే కొన్ని లోపాలనైనా సుప్రీంకోర్టు అంగీకరించడం ఆహ్వానించదగిందే. తాజా తీర్పు గుడ్డిలో మెల్లలా తోడ్పడుతుంది.

Back to Top