ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఆవరిస్తున్న ఆర్థిక మాంద్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయింది. ఇటీవలి కాలంలో ఇంతగా తగ్గిపోవడం ఇదే మొదటి సారి. ఈ ఆర్థిక మాంద్యానికి వినియోగం, గిరాకీ తగ్గడమూ కారణమే. గత ఏడాది ప్రైవేటు వినియోగ వ్యయం 7.3 శాతం ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 3.1 శాతమే ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రైవేటు వినియోగ వ్యయం 4.1 శాతం మాత్రమే ఉంది. అంటే పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే త్రైమాసికంలో ఈ పరిస్థితి ఎదురైంది. స్థూల నికర పెట్టుబడి సమకూరడంలో ఇదే ధోరణి కొనసాగింది. గత సంవత్సరం ఇది 13.3 శాతం ఉంటే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4 శాతమే ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇది నాల్గవ త్రైమాసికంలో 2 శాతమే ఉంది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, గనులు, వస్తూత్పత్తి రంగంలో విపరీతమైన తగ్గుదల కనిపించింది. ఇందులో విపరీతమైన ప్రతికూల ప్రభావం వస్తూత్పత్తి రంగం మీద ఉంది. ఈ రంగం స్థూల విలువ ఆధారిత పెరుగుదల కేవలం 0.6 శాతమే ఉంది. ఇది గతేడాది 12.1 శాతం ఉండేది. ఏ యేటికా యేడు చూస్తే ప్రధాన పరిశ్రమల్లో పారిశ్రామికోత్పత్తి బాగా తగ్గింది. జౌళి ఉత్పత్తులు 0.1 శాతానికి, చర్మంతో తయారు చేసే వస్తువులు 0.2 శాతం, కాగితం ఉత్పత్తుల పెరుగుదల మైనస్ 14.2 శాతం పెరుగుదల  నమోదైంది. అలాగే కారు బొగ్గు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు మైనస్ 2.2 శాతం, రసాయనిక ఉత్పత్తులు 0.3 శాతం, రబ్బర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు మైనస్ 4.1 శాతం, లోహాలు కాని ఖనిజ ఉత్పత్తులు మైనస్ 11 శాతం, తయారు చేసిన లోహ ఉత్పత్తులు మైనస్ 9.8 శాతం, విద్యుత్ పరికరాలు మైనస్ 4.6 శాతం, ఇతర యంత్ర పరికరాల ఉత్పత్తి మైనస్ 1.6 శాతం, మోటారు వాహనాల ఉత్పత్తి మైనస్ 8.4 శాతం, ఇతర రవాణా వాహనాల ఉత్పత్తి మైనస్ 1.7 శాతం నమోదయ్యాయి. ప్రధానమైన ఈ పారిశ్రామిక ఉత్పత్తిలో పెరుగదల తగ్గడంవల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంది. దీని ప్రభావం మధ్య కాలికంగా కూడా ఉంటుంది.

అభివృద్ధి రేటులో గత కొంతకాలంగా తగ్గుదల కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా 2016 నవంబర్ లో పెద్ద నోట్ల రద్దు, సవ్యంగా అమలు కాని వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) అమలు ఈ మందగమనానికి ప్రధాన కారణం. సౌదీ అరేబియాలోని అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారం మీద డ్రోన్ దాడులు జరిగిన తరవాత అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంవల్ల ఆర్థిక మాంద్యం మరింత దిగజారే ప్రమాదం ఉంది.

2017-18లో నియమిత కాలిక కార్మిక శక్తి సర్వేలో కూడా ఆర్థిక మాంద్యం ఛాయలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అప్పుడే పరిస్థితి స్పష్టంగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాలలో 5.8 శాతం పురుషులు, పట్టణ ప్రాంతాలలో 7.1 శాతం పురుషులు; గ్రామీణ ప్రాంతాలలో 3.8 శాతం మహిళలు, పట్టణ ప్రాంతాలలో 10.8 శాతం మహిళలు నిరుద్యోగులుగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. నేషనల్ సాంపుల్ సర్వే నివేదికలో 1972-73 తరవాత 45 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం తాండవిస్తోందని తేలింది.

నిరుద్యోగం పెరగడం వల్ల గిరాకీ తగ్గింది. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించింది. అందువల్ల ప్రధాన వస్తూత్పత్తి రంగం మీద ప్రతికూల ప్రభావం ఏర్పడింది. అంతకన్నా ఘోరమైందేమిటంటే ఈ ప్రభావం ఇతర రంగాల మీద తీవ్రంగా కనిపించింది. గత కొంత కాలంగా వాహనాల అమ్మకం తగ్గిపోయింది. మారుతి సుజుకి, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ వంటి వాహనాల తయారీ కంపెనీలలో పని లేని రోజులు పెరిగిపోయాయి. అంటే వేతనం లేకుండా సెలవులు ఇచ్చేస్తున్నారు. సబ్ కాంట్రాక్టు కార్యకలాపాలూ తగ్గాయి. వ్యవస్థీకృత రంగం మీదే ఇంత తీవ్ర ప్రభావం ఉంటే ఇక అవ్యవస్థీకృత రంగం మీద దుష్ప్రభావాన్ని ఊహించుకోవలసిందే.

పన్నుల వసూళ్లు కూడా మందగించాయి. 2016-17 లో ముందే పన్నులు చెల్లించడం 18 శాతం ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మధ్య నాటికి అది 6 శాతానికి పడిపోయింది. అంటే వ్యవస్థీకృత రంగంలో పన్ను వసూళ్లు తగ్గిపోయాయి. రెండవ త్రైమాసికంలో కూడా పరిస్థితి మెరుగు పడే అవకాశాలు లేవు.

రిజర్వూ బ్యాంకు వరసగా రెపో రేటు (బ్యాంకుల దగ్గర నిధులు లేనప్పుడు బ్యాంకులు రిజర్వూ బ్యాంకు దగ్గర నిధులు తీసుకున్నప్పుడు వసూలు చేసే వడ్డీ రేటు) తగ్గిస్తూ వస్తోంది. ఇటీవలే రెపో రేటు 0.35 శాతం తగ్గించారు. బ్యాంకులు ఈ సదుపాయాన్ని వినియోగదార్లకు బదలాయించవచ్చునన్న ఉద్దేశంతో ఆగస్టులో రెపో రేటు తగ్గించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి రుణాలు తీసుకోగలరు, వినియోగ దార్లు రుణాలు తీసుకోగలరు అన్న ఉద్దేశంతో రిజర్వూ బ్యాంకు రెపో రేటు తగ్గిస్తుంది. రెపో రేటుకు అనుగుణంగా రుణాల మీద వడ్డీ రేట్లను వసూలు చేయాలని రిజర్వూ బ్యాంకు ఇతర బ్యాంకులకు సలహా ఇచ్చింది. అయితే బ్యాంకులలో డిపాజిట్లు తగ్గిపోతున్నాయి. పొదుపూ తగ్గుతోంది.

ఆగస్టు ఆఖరి వారం నుంచి ప్రభుత్వం కూడా అనేక ఉద్దీపన చర్యలు ప్రకటించింది. పది బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది. రూ. 50,000 కోట్ల మేర బ్యాంకులకు నిధులు సమకూర్చింది. వాణిజ్య వాహన తయారీదార్లకు రాయితీలు ప్రకటించింది. 400 జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. మరి కొన్ని ఉద్దీపన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇవన్నీ సూక్ష్మ స్థాయి ప్రయత్నాలు. నిర్మాణాత్మక, చక్రీయ కారణాలవల్ల ఆర్థిక మాంద్యం ఆవరిస్తున్న దశలో ప్రభుత్వం ద్రవ్య సంబంధ, ఆర్థిక సంబంధ స్థూల చర్యలు కూడా తీసుకోక తప్పదు. వినియోగం, పెట్టుబడులు పెరగడానికి అనువైన చర్యలు తీసుకోవడం అనివార్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది అత్యవసరం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రభుత్వ వ్యయం పెంచాల్సిందే. కానీ కోశ విధానాన్ని పునః పరిశీలించాల్సిందే.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top