ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

జాతీయ పౌరుల జాబితాలో అయోమయం

Citizenship cannot be seen as existing outside the larger concerns of humanity.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అస్సాంలో ప్రచురించిన జాతీయ పౌరుల జాబితా రాజకీయ వాతావరణాన్ని కలచి వేసింది. వివిధ సామాజిక శక్తులు ఆందోళన పడ్తున్నాయి. జాతీయ పౌరుల జాబితా గురించి ఊదరగొట్టిన అధికార పక్షంతో సహా ఈ జాబితాలో లేని వారు కూడా కలవరపడుతున్నారు. అధికార పక్షం ఊహించినదానికన్నా ఈ జాబితాలో తక్కువ మంది పేర్లు ఉన్నాయి. మరీ విచిత్రం ఏమిటంటే అధికార పక్షమైన భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే వారి పేర్లు కూడా ఈ జాబితాలో కనిపించలేదు. ఈ జాబితా తయారు చేయడం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ జాబితాలోంచి మినహాయించిన వారి పేర్లు తక్కువ కావడం ఒక రకంగా హర్షదాయకమైందే. జాబితాలో పేర్లు లేనివారు చాలా ఆందోళన పడ్తున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జాబితాలో పేర్లు కనిపించని వారు క్షోభ అనుభవించడమే కాక విదేశీ ట్రిబ్యునళ్లు, కోర్టుల్లో అర్జీలు పెట్టుకోవలసి వస్తోంది. జాబితాలో లేని వారిని దుర్భరమైన నిర్బంధ శిబిరాల్లో ఉంచుతున్నారు. వారు రెండవ శ్రేణి పౌరులుగా మిగిలిపోయి తీవ్రమైన వ్యధకు గురవుతున్నారు. ఇలా బాధలు అనుభవిస్తున్న అణగారిన వర్గాల వారి పరిస్థితి ముందే దుర్భరంగా ఉంది. అయితే అధికారపక్షం ఎజెండా వీరి విషయంలో ఎలాంటి సహానుభూతికి అవకాశం ఇవ్వదు. నిజానికి జాతీయ పౌరుల జాబితా అన్న ఆలోచనే జనాన్ని విడదీసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్న సమయంలో మానవీయ అంశాలను ఖాతరు చేయడం లేదు. దీని ప్రభావం కేవలం అస్సాం కే పరిమితం కాకుండా మొత్తం రాజకీయ వ్యవస్థపైనే ఉంటుంది.

జాతీయ పౌరుల జాబితా రూపొందించడం అనే ఆలోచనే మనవాళ్లు, పరాయివాళ్లు అన్న ధోరణి నుంచి ప్రారంభమైంది. దీనికి ఎవరు మనవాళ్లు అన్న విషయంలో నిర్ణీత తేదీలను నిర్ణయించారు. ఇదివరకే విపరీతంగా ఉన్న సామాజిక ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఘర్షణలను, పరస్పర అనుమానాలను తొలగించడానికే ఈ పని ప్రారంభించారు అని అనుకున్నా అదీ నెరవేరడం లేదు. ఇలాంటి ప్రయత్నాలు నిజానికి సమన్వయానికి సర్దుబాటుకు దోహదం చేయాలి. చారిత్రిక పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఉపకరించాలి. ఏకాభిప్రాయంతో భవిష్యత్తుకు బాటలు వేయగలగాలి. ఇవన్నీ సాధించాలంటే విశాలమైన దృక్పథం అవసరం. అధికారంలో ఉన్న బీజేపీకి ఈ విశాల దృక్పధం లేదు కాని ఎన్నికలలో లబ్ధి పొందాలన్న సంకల్పం మాత్రం గట్టిగా ఉంది. అందువల్ల సమన్వయం సాధించాలని అస్సాంలోని ప్రగతిశీల శక్తుల ఆశలు వమ్ము కాక తప్పదు. జాతీయ పౌరుల జాబితా విషయంలో కొంత మంది చేస్తున్న ప్రకటనల్లో "చొరబాటుదార్లు", "చెదలు" అన్న మాటలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన వారు అస్సాంలో నివసించడానికి కావాలనే అనుమతించారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఇది సామాజికంగా జనాన్ని చీల్చే ధోరణే. సమన్వయం, ఈ సమస్యకు ముగింపు అన్న భావనలకు ఇతర వర్గాలలో భయం సృష్టించాలన్న ప్రయత్నాలకూ ఎక్కడా పొంతన కుదరదు.

పౌరుల జాబితా రూపొందించడానికి అనుసరించిన వివక్షా పూర్తిత విధానాలు, పద్ధతులు ఒక వర్గాన్ని ఏరి వేయడానికి అనుగుణంగానే ఉన్నాయి. పౌరులమని నిరూపించుకోవడానికి దాఖలు చేయవలసిన పత్రాల జాబితా చూస్తే పుట్టుకతోటే పౌరులవుతారన్న సూత్రానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇలాంటి వైఖరి వివక్ష చూపడానికే ఉపకరిస్తుంది. ఇతరులు అని ముద్ర వేయడమే జాతీయ పౌరుల జాబితా తాయారు చేయడంలో పరమ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది అధికార పక్షానికి మంచి ఆయుధంగా ఉపయోగపడ్తోంది. పైగా ఇలాంటి ప్రక్రియ ఇతర ప్రాంతాలలోనూ, ఆ మాటకొస్తే దేశమంతా అమలు చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. అస్సాంలో చారిత్రక పరిణామాలు భిన్నమైనవి. ఇలాంటి కుతర్కాన్ని దిల్లీకి, తెలంగాణాకు, మహారాష్ట్రకు కూడా వర్తింప చేస్తారా? ఇది అనుమానాలు రేకెత్తించి ఒక వర్గం ప్రజలు దేశ పౌరులు కారు అని చెప్పడానికి ఉద్దేశించిందే. దేశమంతటా ఇదే పద్ధతి అనుసరిస్తారేమోనన్న భయాందోళనలు వ్యాపించాయి. నిర్భంధ కేంద్రాలు అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ఒక వర్గం వారు చట్టబద్ధంగా విదేశీయులు కాకపోయినప్పటికీ వాస్తవంగా వారిని విదేశీయులుగానే పరిగణిస్తున్నారు. ఈ భయాందోళనలను పారదోలడానికి కచ్చితమైన హామీ ఉండాలి. అధికార పక్షం ఒక వర్గం ప్రజలను విదేశీయులు అని ప్రచారం చేస్తోంది. ఇది మత ప్రాతిపదికన జరుగుతోంది. బహుళత్వం, అనేక రకాల అసమానతలు ఉన్న ఈ దేశంలో ఘర్షణలకు తావిస్తోంది.  

మౌలికంగా ఆలోచిస్తే పౌరసత్వం లాంటి అంశాల విషయంలో వ్యవహరిస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధత, వీటిపై విశ్వవ్యాప్తంగా ఉన్న అవగాహనను కాదని సనాతనమైన ధోరణిలోనే వ్యవహరించగలమా? చరిత్రలో వలసలు ఎప్పుడూ ఉన్నాయి. వివిధ కారణాలవల్ల సమకాలీన సమయంలో ఎక్కువ అయినాయి. పౌరసత్వం దానికి అనుబంధంగా ఉండే అంశాలు రాజ్యానికో, దేశానికో పరిమితం కాకుండా అది మానవతా దృష్టి మీద ఆధారపడి ఉండాలి. అలా కాకుండా సనాతన భావాలపై ఆధారపడి పౌరసత్వాన్ని నిర్ణయించేటట్టయితే మనది జాతి మీద ఆధారపడ్డ ప్రజాస్వామ్యంగా దిగజారుతుంది. మరీ మితి మీరితే మత రాజ్యంగా మిగిలిపోతుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాల ఆధారంగా నాగరికమైన పౌరసత్వాన్నే పెంపొందించవలసిన అవసరం ఉంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top