ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మీడియా ఎవరికి బాధ్యత వహించాలి?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

భారత మీడియాకు సంబంధించి ఇటీవలి రెండు సంఘటనలను చూస్తే మీడియా వాస్తవ అంశాలకు ఎందుకు కట్టుబడి ఉండాలి, ప్రజలకు ఎందుకు సన్నిహితంగా ఉండాలి అనే విషయాలు అర్థం అవుతాయి. ఎన్నికల ద్వారా, ఇతర మార్గాలలో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణే ప్రజాస్వామ్యానికి మూలం. అయితే మీడియా సమాచారం అందించేటప్పుడు అధికార వర్గాలను, ప్రభుత్వాలను విమర్శనాత్మక దృష్టితో చూడాలి. అప్పుడే మీడియా తన మీద ఆ వర్గాల నుంచి ఒత్తిడి లేకుండా కాపాడుకోగలుగుతుంది. ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ లో మధ్యాహ్న భోజన పథకం కింద ఒక ప్రాథమిక పాఠశాలలో రొట్టెతో పాటు కేవలం ఉప్పు మాత్రమే ఇస్తున్నారన్న వార్త రాసినందుకు ఒక పత్రికా రచయిత మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకన్నా ముందు జమ్మూ-కశ్మీర్ లో మీడియా మీద ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ కశ్మీర్ కు సంబంధించిన కేసులో ఒక పక్షంగా చేరడానికి ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకున్నారు. ఆయన మాజీ న్యాయ మూర్తి. ఈ అర్జీలో కశ్మీర్ లో మీడియా మీద ఆంక్షలు విధించడం సబబేనని ఆయన పేర్కొన్నారు.

 

ఈ రెండు సందర్భాల్లోనూ వైపరీత్యం కలత కలిగించేదిగా ఉంది. మొదటి సందర్భంలో పత్రికా రచయిత ఎత్తి చూపిన లోపాలపై చర్య తీసుకోవడం మానేసి ఆ విషయం బయట పెట్టిన పత్రికా రచయిత మీదే కేసు పెట్టారు. రెండవ సందర్భంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడానికి ఏర్పడిన ప్రెస్ కౌన్సిలే ఆ స్వేచ్ఛను హరించడాన్ని సమర్థించింది. ఇలాంటి వైఖరి అనుసరించడం ఆ సంస్థ అస్తిత్వాన్నే సవాలు చేసేదిగా ఉంది.

ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛగా ఉంటూనే బాధ్యతాయుతంగా ఉండాలన్న ప్రాతిపదిక మీదే ప్రెస్ కౌన్సిల్ అస్తిత్వంలోకి వచ్చింది. స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించుకోవలనడంలో భిన్నాభిప్రాయానికి తావు లేదు. అయితే మీడియా ఎవరి విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలి అన్నది అసలు ప్రశ్న. మీడియా దేశ ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. "పత్రికల మీద ప్రభుత్వ, లేదా అధికార వర్గాల నియంత్రణ వినాశనానికి దారి తీస్తుంది. అందువల్ల సమకాలిక పత్రికా రచయితలు, ఇతరులు పత్రికలను నియంత్రించాలి. అందులో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలి. అది నిష్పాక్షిక వ్య్వవస్థగా ఉండాలి" అని ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసేటప్పుడు భావించారు. ప్రెస్ కౌన్సిల్ సలహాలివ్వగలదు, ఓ అడుగు ముందుకు వేస్తే మందలించగలదు, అంటే ప్రెస్ కౌన్సిల్ అరవగలదు తప్ప కరవ లేదు అన్న విమర్శ దశాబ్దాలుగా ఉన్నదే. అయితే అనేక సందర్భాలలో ప్రెస్ కౌన్సిల్ వ్యవహార సరళి మన్ననలు పొందిన మాట కూడా వాస్తవం. పంజాబ్ లో 1990ల ఆరంభంలో తీవ్రవాదం పెచ్చరిల్లినప్పుడు ప్రెస్ కౌన్సిల్ అక్కడి పత్రికా రంగానికి అండగా నిలబడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశం తలెత్తినప్పుడు కూడా ఒక మతంపట్ల పక్షపాత దృష్టితో వ్య్వహరించిన పత్రికలను ప్రెస్ కౌన్సిల్ మందలించింది. ఈ పక్షపాత దృక్పథం ప్రజలు మతాల వారీగా చీలిపోవడానికి దారి తీసింది.

జాతీయ ప్రయోజనాలు, నిజాయితీని పరిరక్షించడానికి కశ్మీర్ పత్రికా రచయిత దాఖలు చేసిన పిటిషన్ లో తానూ భాగస్వామిని అవుతానని ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులు తెలియజేశారు. కశ్మీర్ టైంస్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విషయ ప్రసారం మీద, పత్రికా రచయితల కదలికల మీద విధించిన ఆంక్షలు తొలగించాలని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆగస్టు 5 నుంచి ఈ ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ ఆంక్షల కారణంగా పత్రికలు ఎలాంటి సమాచారమూ అందించలేక పోయాయి. మీడియా నిశ్చేష్టంగా ఉండిపోవలసి వచ్చింది. తమ మీద ప్రభావం చూపే నిర్ణయాల గురించి సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. అసలు వ్య్వహారం ఇదే. ప్రజలకు సమాచారం అందించడం జాతీయ ప్రయోజనం కిందకు రాదా? ఒక అంశం మీద అభిప్రాయాలు ఏర్పరచుకునే హక్కు ప్రజలకు లేదా? కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఏమిటో ఆంక్షల కారణంగా మీడియా ఏ సమాచారమూ అందించలేక పోయింది. భారత మీడియాకు కశ్మీర్ గురించి ఏ సమాచారమూ అందుబాటులో లేకుండా పోయింది.

1857నాటి భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంకన్నా ముందు నుంచే భారతీయ పత్రికలకు మహోన్నతమైన చరిత్ర ఉంది. ప్రధానంగా 19వ శతాబ్దం చివరలో, స్వాతంత్ర్య పోరాట కాలంలో మన పత్రికలు వీరోచితంగా పని చేశాయి. అనేక రకాల ముప్పులు ఎదుర్కున్నాయి. నిస్వార్థంగా సేవ చేశాయి. ఇలాంటి పత్రికా రచయితలు సంఘ సంస్కర్తలు, స్వాతంత్ర్య పోరాట యోధులు కూడా. వివిధ భాషల్లో పత్రికలు నిర్వహించిన వారు తమకు ఉన్నదంతా పత్రికలు నడపడానికే వినియోగించారు. ఇంగ్లీషు పత్రికలు కూడా ఈ పనే చేశాయి. బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతను ఎదుర్కుని నిలబడ్డాయి.

అనేక మంది పత్రికా రచయితలు, మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడి వ్యవహార సరళిని ఖండించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణలో భాగస్వామి కావాలనుకున్నప్పుడు ప్రెస్ కౌన్సిల్ సభ్యులను సంప్రదించనైనా లేదు. ఇలా వ్యవహరించినందుకు ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు పత్రికా రచయితలకే కాక ప్రజలకు కూడా సంజాయిషీ ఇచ్చుకోవాలి.

స్వేచ్ఛగా వ్యవహరించే మీడియావల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. పరిపాలనకు సంబంధించిన అంశాలపై ప్రజలకు మీడియా సమాచారం అందిస్తుంది. ప్రజల సమస్యలు, సూచనలు వ్యక్తీకరించడానికి ఉపకరిస్తుంది. తమ వాణి వినిపించుకునే వారు ఎవరూ లేరనుకునే వారికి మీడియా అండగా ఉంటుంది. ఇవన్నీ వాస్తవానికి దేశ సమైక్యతకు సంబంధించిన అంశాలే.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top