ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఫెడరల్ స్ఫూర్తికి తిలోదకాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహజంగానే కొంత మద్దతు, అనేకానేక అభ్యంతరాలూ వ్యక్తమైనాయి. సభ్య సమాజం, ప్రజల తరఫున మాట్లాడే మేధావి వర్గం, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన అభ్యంతరాలు ఇప్పటికే బహుళ ప్రచారంలో ఉన్నాయి. వాటిని పునరుద్ఘాటించవలసిన అవసరం లేదు. కశ్మీర్ పై నిర్ణయాన్ని ప్రతిపక్షాల దృష్టి నుంచి చూడడం అంటే రాజ్యాంగ ప్రమాణాలను ఖాతరు చేయక పోవడాన్ని, ఏ నిర్ణయమైనా విస్తృతమైన సంప్రదింపుల తరవాతే తీసుకోవాలన్న నియమాన్ని ఉల్లంఘించడాన్ని, జరిగే అన్యాయం గురించి ఆలోచించడమే. ప్రశ్నించడమే. అధికార పక్షం అన్యాయంగానే కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది.

ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థించుకోవడం అసాధారణమైంది ఏమీ కాదు. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం అంటే ఆ ప్రాంతాన్ని దేశంలో సమైక్యం చేయడం, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పాటు పడడమేనని కేంద్రం సమర్థించుకోవడం మామూలే. కశ్మీర్ భారత్ కు భిన్నం కాదు అని చెప్పాలంటే 370వ అధికరణం, దానితో సంబంధం ఉన్న 35-ఎ అధికరణం అడ్డంకిగా ఉన్నాయన్నది ప్రభుత్వ వాదన. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ పటిష్ఠమైన ప్రభుత్వాలు ఉండాలంటే కశ్మీర్ ను "సమైక్యం" చయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారూ భావిస్తున్నారు.

కశ్మీర్ ను సమైక్యం చేయడం అని అధికార పక్షం చెప్పే మాట వెనక తామ వాదనే చెల్లాలన్న ధోరణి ఉంది. ఇందులో దేశ సమైక్యత, ఆ ప్రాంత అభివృద్ధి, కశ్మీరీ ప్రజల సంక్షేమం అన్న మాటలు సహజంగానే ఇమిడి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వాదన, అనేక రాజకీయ పక్షాలు ఈ వాదనను సమర్థించడం సవ్యమైన రాజకీయ చైతన్యం కొరవడడానికి నిదర్శనం. ప్రభుత్వ వాదనలు  నిజానికి ఊకదంపుడు మాటలే తప్ప వాస్తవం మీద ఆధారపడ్డవి కాదు. ఇది అభివృద్ధికరమైన జాతీయవాదానికి అనుగుణమైంది కాదు. దేశంలోని అనేక ప్రాంతాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు రాష్ట్రాల మధ్య కూడా కనిపిస్తాయి. ఈ ప్రాంతాలు, రాష్ట్రాలూ భారత ఫెడరల్ వ్యవస్థలో భాగమే. ఫెడరల్ విధానంలో సామరస్యం కొనసాగితేనే రాష్ట్రాలకు విలువ ఉంటుంది. ఈ ప్రాంతాలలో నివసించే వారిలో వ్యధ ఉంటే సామరస్యం సాధ్యం కాదు.

అధికారం కేంద్రీకృతం అయితే సంక్షేమం సాధ్యం కాదు. ఒక వేళ అదే సాధ్యమయ్యేటట్టయితే మన దేశంలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలే ఉండేవి కావు. ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందించే సామర్థ్యం మన పట్టణాలకు లేదు. గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేసినందువల్ల, ప్రాంతీయ అభివృద్ధి మీద శ్రద్ధ తీసుకోనందువల్ల వలసలు తప్పడం లేదు. దీనివల్ల వేలాది గ్రామాల్లో నాగరికత ధ్వంసం అయింది. ఉత్తరాఖండ్ దీనికి మంచి ఉదాహరణ. అక్కడి గ్రామాలు ఇప్పుడు దయ్యాల కొంపలుగా మారిపోయాయి. నిర్జనంగా తయారయ్యాయి. మనుషుల, జీవావరణ మనుగడకు ఏ మేరకు ఉపయోగపడుతుందన్న అంశం మీదే ఒక ప్రాంతం విలువ ఆధారపడి ఉంటుంది.

కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంవల్ల మరిన్ని అవకాశాలు కల్పించగలమని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఆర్థిక లావాదేవీలకు ఎక్కువ అవకాశం ఉండే పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించలేదన్నది వాస్తవం. దీనివల్ల అవకాశం కోల్పేయేది ప్రధానంగా సామాన్యులే. అనుభవాన్నిబట్టి చూస్తే పట్టణాలు అత్యంత సంపన్నులకే అవకాశాలు కల్పిస్తున్నాయి. అవి ఆధునిక అగ్రహారాలుగా మారిపోతున్నాయి. అట్టడుగు వర్గాల వారికి అవకాశమే ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వ వాదన అన్యాయాన్ని ఎదిరించే వర్గాల వారి వాణిని కప్పి పుచ్చుతాయి. కశ్మీర్ లోయలో ఈ పరిస్థితి మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వారికి నైతికంగా కనీస స్థానమైనా దక్కలేదు. 370వ అధికరణానికి సంబంధించి ప్రభుత్వం ఏ చేయబోతోందో తెలుసుకునే హక్కైనా తమకు ఉండాలని కశ్మీర్ ప్రజలు భావించారు.

ఎలాంటి సంప్రదింపులు లేకుండా కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఆత్రుతలో ఉందని తేలిపోయింది. సకల వ్యవహారాలూ తమ గుప్పెట్లోనే ఉంచుకోవాలనే ప్రయత్నం కొన్ని సార్లు విలోమ ఫలితాలు ఇవ్వవచ్చు. కశ్మీర్ కల్లోలం ఆధారంగానే అధికార కేంద్రీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం అంటే వ్యవసాయ, ఉపాధి, పట్టణాల నిర్వహణా రంగంలో ఉన్న సంక్షోభాన్ని విస్మరించడమే. ఘర్షణలను నివారించడానికి ఫెడరల్ విధానం మంచి అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కుదించడంవల్ల ఇది సాధ్యం కాదు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అధికార కేంద్రీకరణ ద్వారానే ఘర్షణలను పరిష్కరించాలనుకుంటోంది. వికేంద్రీకృతంగా ఉన్న ఘర్షణలను విస్మరిస్తే దానివల్ల బాధితులైన వారు ఎప్పుడో ఉవ్వెత్తున ఎగసిపడే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఫెడరల్ విధానాన్ని అనుసరిస్తేనే ఘర్షణల నివారణ సాధ్యం అవుతుంది. మానవుల అభివృద్ధి ఆధారంగా ఉండే ఫెడరల్ విధానంలో సమానత్వ భావన ఉంటుంది. అంటే నాగరకంగా జీవించే అవకాశం కల్పించాలి.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top