వ్యక్తులపై తీవ్రవాదుల ముద్రా!
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
స్వతంత్ర భారత చరిత్రలో "జాతీయ భద్రత"కు సంబంధించిన చట్టాలు ఎంత కిరాతకమైనవైనా 2019నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) సవరణ చట్టం (యు.ఎ.పి.ఎ.) లాంటి మహా కిరాతకమైంది ఏదీ లేదు. 1967నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టాన్ని సవరించిన తరవాత కేంద్ర ప్రభుత్వం ఏ వ్యక్తినైనా "తీవ్రవాదిగా" ముద్ర వేయవచ్చు. సవ్యంగా ఆలోచించే వారెవరికైనా ఇది భయంకర చట్టమే అనిపిస్తుంది.
యు.ఎ.పి.ఎ. ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థనైనా "తీవ్రవాద సంస్థ"గా ప్రకటించవచ్చు. ఆ సంస్థకు క్రియాశీలంగా మద్దతిచ్చే ఎవరిమీదైనా చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఇలా చర్య తీసుకోవడానికి విచారణ గానీ, నిర్దిష్ట ప్రక్రియగానీ అనుసరించవలసిన అగత్యం లేదు. అయితే ఈ సంస్థ గానీ లేదా ఏ వ్యక్తి అయినా చర్య తీసుకున్న తరవాత సమీక్షా సంఘం ఎదుట విచారణ కోరవచ్చు. అప్పుడు ఆ సంస్థను, వ్యక్తులను తీవ్రవాదులు అనొచ్చో లేదో నిర్ణయిస్తారు.
తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేది వ్యక్తులే తప్ప సంస్థలు కాదు అని ప్రభుత్వం రాజ్యసభలో వాదించింది. అలాంటి వ్యక్తులను తీవ్రవాదులుగా ముద్ర వేయకపోతే చట్టం నుంచి తప్పించుకుని మరో పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తారని ప్రభుత్వం వాదించింది. యు.ఎ.పి.ఎ. చట్టాన్ని సవరించడానికి ముందు కూడా తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారిని చట్ట రీత్యా శిక్షించడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు వ్యక్తులను "తీవ్రవాదులు"గా ముద్రవేస్తే కలిగే ప్రయోజనం ఏమిటో అంతు పట్టదు.
దీనికి ఒక కారణం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి వ్యక్తులను తీవ్రవాదులుగా ముద్ర వేస్తుంది. ఐక్య రాజ్య సమితి నియమావళిపై భారత్ సంతకం చేసింది కనక ఈ సవరణ చేశామని వాదించవచ్చు. ఇందులో కొంత సబబు ఉన్నప్పటికీ భద్రతా సమితి నిర్ణయం ఏమైనప్పటికీ తీవ్రవాది అని ముద్ర వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలో అర్థం కాదు.
ఇలా తీవ్రవాదిగా ముద్ర వేయడమే ఒక సమస్య అయితే దానికి అనుసరించే పద్ధతి మరింత తీవ్రమైన సమస్య. సంస్థలను తీవ్రవాద సంస్థలుగా ముద్రవేసే అవకాశం ఉన్నట్టుగానే వ్యక్తులనూ (వారు తీవ్రవాదులు అయినప్పటికీ) అదే గాట కట్టడం వ్యక్తులకు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు ఉంటాయన్న వాస్తవాన్ని వాటంగా విస్మరించారు. రాజ్యాంగంలోని 21 వ అధికరణం గురించి ప్రభుత్వానికి తెలియదనుకోవాలా లేక తెలిసినా విస్మిరించిందనుకోవాలా?
యు.ఎ.పి.ఎ. కింద ఒక వ్యక్తి మీద తీవ్రవాది అన్న ముద్రపడినంత మాత్రాన వెంటనే చట్టపరంగా వచ్చే ఇబ్బంది ఏమీ లేకపోవచ్చు కానీ పర్యవసానాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఒక వ్యక్తిపై తీవ్రవాది అన్న ముద్ర వేయాలంటే అతను తీవ్రవాది అని నిరూపించవలసిన అవసరమూ లేదు. లేదా అతని కార్యకలాపాలవల్ల తీవ్రవాది కావలసిన అగత్యమూ లేదు.
ఇప్పటికే అమాయకులైన అనేక మంది ముస్లింలు పస లేని రీతిలో తీవ్రవాదులన్న ఆరోపణల కారణంగా జైళ్లలో మగ్గుతున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) పని గట్టుకుని ముస్లింలు కాని వారి మీద కేసును బలహీనపరుస్తోంది. అందువల్ల ఈ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేస్తారని నమ్మడం అసాధ్యం. దర్యాప్తు చేయడం, చట్ట ప్రకారం శిక్షించడం "కష్ట సాధ్యం" అవుతోంది అన్న వాదన నిశిత పరిశీలనకు నిలిచేది కాదు. చట్టంలో కొత్తగా చేసిన సవరణలోని అంశాలు తీవ్రవాద చర్యలకు పాల్పడిన ఆరోపణలున్న వారి మీద దర్యాప్తును, చట్ట ప్రకారం శిక్షించడానికి నిజానికి తోడ్పడేవి ఏమీ కాదు. దర్యాప్తు, శిక్షించడం సాధ్యం కాకపోవడానికి దర్యాప్తు వ్యవస్థలు ఆ పనిని నీరుగార్చడమే ప్రధాన కారణం.
ఈ సవరణ చట్టాన్ని ఆమోదించిన తీరుకూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ సవరణ బిల్లును జులై 8న లోకసభలో ప్రతిపాదించారు. ఆగస్టు రెండున రాజ్యసభ దీనిని ఆమోదించేసింది. ఈ సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపలేదు. పార్లమెంటులో నిశిత పరిశీలనా జరగలేదు. చెప్పుకోదగ్గ చర్చా లేదు. లోకసభలో అధికార పక్షానికి మంచి మెజారిటీ ఉన్నందువల్ల ఇతర బిల్లులను ఆమోదింప చేసుకున్నట్టుగానే దీన్నీ హడవుడిగా ఆమోదించేశారు. రాజ్య సభలో ప్రాంతీయ పార్టీలు అధికార పక్షానికి మద్దతిచ్చాయి. పార్లమెంటు కేవలం లాంఛనం స్థాయికి దిగజారింది. అలాంటప్పుడు పార్లమెంటు సమావశాలు ఫల ప్రదంగా జరిగాయని ప్రచారం చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి? 2019 ఎన్నికలలో పరాజయ బాధ నుంచి ఇప్పటికీ తేరుకోని ప్రతిపక్షాలు ఈ బిల్లులకు నామ మాత్రమైన ప్రతిఘటన కూడా చూపలేదు. అంటే మన దేశంలో ప్రజాస్వామ్యం ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రమాదకర స్థితిలోనే ఉంది.
అసమ్మతి వ్యక్తం చేసే వారిని, క్రియాశీలమైన సామాజిక కార్యకర్తలను 2018లోనే "పట్టణ నక్సలైట్లు" అన్నారు. వారి మీద సందిగ్ధకరమైన ఆరోపణలు మోపి జైళ్లల్లో పెట్టారు. జామీనుకు కూడా అంగీకరించడం లేదు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చట్టాలు అవసరమే. కానీ తాజా సవరణలను దుర్వినియోగం చేసే అవకాశమే ఎక్కువ. ఇలాంటి విషయాల గురించి చట్టాలు చేసేటప్పుడు ప్రభుత్వం ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని తీరాలి.