ఉపాధి కొరవడితే జనాభా ప్రయోజనం శూన్యం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
జనాభా సంబంధ పరివర్తనలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ప్రజనన శక్తి, రెండవది మృతుల సంఖ్యలో మార్పు. ఏ జనాభాలోనైనా ప్రజనన సామర్థ్యమే జనసంఖ్యా సంబంధ ప్రయోజనాన్ని ప్రధానంగా నిర్దేశిస్తుంది. ఇటీవలి శతాబ్దాల్లో సంతానం కలిగే సామర్థ్యం ఉన్న మహిళల్లో ప్రజనన సామర్థ్యం తగ్గిపోవడంవల్లే దేశంలో జనాభా పెరుగుదల మందగిస్తోంది. దీన్నే ప్రజనన రేటు అంటారు. వచ్చే కొద్ది దశాబ్దాలలో జనాభా మందగించడంతో పాటు పని చేయగలిగిన వారి సంఖ్య పెరగడంవల్ల జనాభాకు సంబంధించిన విధానాలపై భారీ ప్రభావం ఉండబోతోంది. ఎక్కువ ప్రజనన శక్తి ఉన్న రాష్ట్రాలలోనూ ప్రజన సామర్థ్యం గణనీయంగా మందగిస్తోంది. 2017 నాటికి 22 పెద్ద రాష్ట్రాలలో ప్రజనన సామర్థ్యం ప్రతి మహిళకు 2.2 శాతానికి చేరింది. అయితే స్త్రీ-పురుష జనాభాలో మార్పు వస్తున్నందువల్ల అవసరమైన ప్రజన సామర్థ్యం 2.1 ఉండాల్సి ఉన్నా ఇది 2.2 శాతం ఉంది. ప్రజనన సామర్థ్యం, మరణాల సంఖ్య, వయసుకు సంబంధించిన అంశాల్లో వివిధ రాష్ట్రాల మధ్య అపారమైన వ్యత్యాసాలు గోచరిస్తున్నాయి. ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లడం, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉన్నత విద్యకు అవకాశాలు ఉండడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన అందుబాటులోకి రావడం వల్ల ప్రజనన సామర్థ్యం తగ్గుతోంది.
నమూనా నమోదు వ్యవస్థ (సాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం - ఎస్.ఆర్.ఎస్.) అందజేసే సమాచారాన్నిబట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల మధ్య ప్రజనన సామర్థ్యంలో తేడాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వివిధ వయసుల వారి మధ్య ప్రజనన సామర్థ్యం తగ్గినప్పటికీ పట్టణ ప్రాంతాలలోని వారిలో ఎక్కువ వయసు ఉన్న వారిలో ప్రజన సామర్థ్యం పెరుగుతోంది. మరో వేపు గ్రామీణ ప్రాంతాలలో 35 ఏళ్లు పైబడిన మహిళల్లో ప్రజనన శక్తి తగ్గుతోంది. పట్టణ ప్రాంతాలలో ఈ వర్గం వారిలో సంతాన సాఫల్య శక్తి పెరుగుతోంది. అయితే మొత్తం మీద చూస్తే ఈ సామర్థ్యం తగ్గుతోంది. చదువు కూడా మహిళల్లో ప్రజనన సామర్థ్యం మారడానికి కారణం అవుతోంది. సగటున చూస్తే విద్యావంతులైన మహిళల్లో ప్రజన సామర్థ్యం తక్కువే ఉన్నా పట్టణ ప్రాంతాలలోని మహిళల్లో 30 ఏళ్లు మించిన విద్యావంతుల్లో ప్రజనన సామర్థ్యం ఎక్కువ ఉంది. విద్య లేని వారిలో ఈ సామర్థ్యం తక్కువగా ఉంది. విద్యావంతులైన వారు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. పిల్లలు కనడాన్ని జాప్యం చేయగలుగుతున్నారు. వైద్య సదుపాయాలు పెరిగినందువల్ల మహిళలు ఆలస్యమైనా పిల్లల్ని కనగలుగుతున్నారు. అయితే పట్టణ ప్రాంతాలలో ఊహించిన దానికన్నా సంతాన ప్రాప్తి రేటు ఎక్కువగా తగ్గుతోంది. 2017 నాటి అంచనాల ప్రకారం పట్టణ ప్రాంతాలలో సంతాన ప్రాప్తి రేటు 1.7 కు తగ్గిపోయింది. మరణించే వారితో పోలిస్తే పుట్టే వారి సంఖ్య బిహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో మినహా మిగతా రాష్ట్రాలలో తగ్గుతోంది. పది రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఈ రేటు 2.2 కన్నా తక్కువ ఉంది.
మన దేశంలో జనాభా పరివర్తన అన్ని చోట్లా ఒకేలా లేదు. జనాభా వృద్ధి మందగించినా పని చేయగలిగేవారి సంఖ్య పెరుగుతూ ఉన్నందువల్ల దీనితో ప్రయోజనం ఉండవచ్చు. అంటే సాధారణ జనాభా కన్నా పని చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రయోజనం పని చేసే వారి సామర్థ్యాన్ని సవ్యంగా ఉపయోగించుకోగలిగితే 40-50 ఏళ్ల దాకా ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఉంటుందనుకున్న ప్రయోజనం కూడా నిష్ప్రయోజనంగా మారుతుంది. మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య జనాభా స్వరూపంలో తేడాలున్నాయి. జనాభావల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ప్రయోజనం ఉండొచ్చు. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రకారం దక్షిణాది, పశ్చిమ భాగాల్లో జనాభావల్ల ప్రయోజనం అయిదేళ్లలో సమసి పోవచ్చు. కొన్ని రాష్ట్రాలలో ఈ ప్రయోజన పది నుంచి పదిహేనేళ్ల దాకా ఉండొచ్చు. సంతాన సాఫల్య రేటు అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో ఈ ప్రయోజనం మరి కొంత కాలం ఉండవచ్చు. వివిధ ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నందువల్ల మన దేశంలో జనాభా స్వరూపంవల్ల ప్రయోజనం కొంత కాలం ఉంటుంది.
పని చేసే వారి సంఖ్య పెరిగితే అభివృద్ధి పెరుగుతుంది. కానీ ఈ ప్రయోజనం పొందడానికి విధానాలు రూపొందించే వారు సిద్ధంగా ఉన్నారా? మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, తగిన ఉద్యోగాల కల్పన సాధ్యమైతేనే ప్రయోజనం పొందగలం. పని చేసే వారి సంఖ్యకు అనుగుణంగా ఇవన్నీ పెరగాలి. ఎందుకంటే పని చేసే వారు ఉన్నంత మాత్రాన వారికి అవకాశాలు కల్పించకపోతే దానంతట అదే అభివృద్ధి సాధ్యం కాదు.
అందువల్ల పని చేయగలవారికి లాభసాటి ఉపాధి కావాలి. పని చేయగలిగే వారికి సముచిత విద్య, నైపుణ్యం అవసరం. కానీ నిరుద్యోగం గత 45 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా 6.1 శాతం ఉంది కనక ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. పని చేయగలిగిన వారున్నా వారికి ఉద్యోగార్హత ఉండడం లేదు. వారి ఆరోగ్యం, విద్య, వృత్తి శిక్షణ ఉండాల్సిన స్థాయిలో లేవు. అంటే జనాభా స్వరూపాన్నిబట్టి ప్రయోజనం పొందే అవకాశం కనిపించడం లేదు.