ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కదులుతున్న బ్రిక్స్ పునాదులు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

నవంబర్ 2019లో జరగనున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి) 11వ శిఖరాగ్ర సభ  చర్చనీయాంశాలను ఖరారు చేయడానికి జరిగిన సమావేశంలో వెనెజులా విషయంలో తీర్మానం ఆమోదించడంలో ఎలాంటి వైఖరి అనుసరించాలన్న అంశంపై పొరపొచ్చాలు స్పష్టంగా కనిపించాయి. ఈ సభలో విభేదాలు ద్యోతకం కావడం అంతర్జాతీయ సహకారానికి ముప్పే అయినా శాస్త్ర సాంకేతికత, వినూత్న ఆవిష్కారాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, డబ్బు అక్రమ చెలామణి మొదలైన విషయాలపై మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇది బ్రిక్స్ పూర్తి స్థాయిలో సహకరించుకోవడానికి అనువుగా ఎదగగలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.

ప్రపంచంలో త్వరితగతిన అభివృద్ధి సాధిస్తున్న బ్రిక్స్ కూటమి కలిసికట్టుగా వ్యవహరించడం మాటలకే పరిమితం అవుతోంది కానీ ఆచరణలో ఆ స్ఫూర్తి కనిపించడం లేదు. ఆ దేశాల్లో ఉన్న ద్రవ్య, రాజకీయ వాస్తవికతలే దీనికి కారణం. ప్రస్తుత బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో విదేశాంగ విధానమే ఈ వైరుధ్యాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రపంచం బహుళ పక్షమైంది అన్న అభిప్రాయం ఆధారంగానే గత పది పదిహేనేళ్లుగా బ్రెజిల్ విదేశాంగ నీతి ఉంటోంది. బోల్సనారోకు ముందు అధికారంలో ఉన్న వారు బహుళ పక్ష ప్రపంచంలో తమ దేశం పేద దేశాల మధ్య "సమతూకం సాధించే దిశగా" వ్యవహరించాలని భావించారు. కానీ బ్రెజిల్ కొత్త నాయకత్వం బహుళ పక్ష వాస్తవికతను కాదని పశ్చిమ దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా అమెరికాకు చేరువ కావాలనుకుంటోంది. వలసల మీద ఇటీవల కుదిరిన ఒప్పందం నుంచి వైదొలగడం, చైనాతో దశాబ్ద కాలంగా ఉన్న వాణిజ్య సంబంధాలను తృణీకరించడం, వెనెజులాలో నికొలస్ మదురో ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా రాజకీయ, సైనిక జోక్యాన్ని సమర్థించడం చూస్తే బ్రెజిల్ బ్రిక్స్ దేశాల ఐక్యతకు బలహీనమైన లంకెగా కనిపిస్తోంది.

2008-09 అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తరవాత బ్రిక్స్ కూటమి కనీసం ఆర్థిక సహకారం విషయంలో పస లేనిదని అమెరికా భావిస్తోంది. బ్రిక్స్ లో భాగమైన దేశాలలో ముఖ్యంగా చైనాలో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) రెండంకేల సంఖ్య నుంచి 7 శాతానికి తగ్గినందువల్ల అమెరికా ఈ అభిప్రాయానికి వస్తోంది. అయితే ఈ అయిదు దేశాలకు కలిపి బ్రిక్స్ అన్న సంక్షిప్త రూపాన్ని ప్రచారంలోకి తెచ్చిన గోల్డ్ మాన్ సాక్స్ సంస్థ మాత్రం ఈ దేశాలు ఈ సహస్రాబ్ది నుంచి సత్వరాభివృద్ధి సాధిస్తాయని చెప్పింది. అందుకే ఈ సంస్థ బ్రిక్స్ దేశాలకోసం ఉద్దేశించిన నిధిని రద్దు చేసింది. ఇతర అభివృద్ధి చెందుతున్నా మార్కెట్లలో పెట్టుబడి పెడ్తామని చెప్పింది. అయితే బ్రిక్స్ దేశాలు 2014లో న్యూ దెవలప్మెంట్ బ్యాంకు ఏర్పాటు చేశాయి. అంతర్జాతీయ పరిపాలనా వ్యవస్థలో తమకు తగిన ప్రాధాన్యం లేదన్న దృష్టితో ఈ బ్యాంకు ఏర్పాటు చేశాయి.

బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ పరిపాలనా వ్యవస్థలో తమకు తగిన ప్రాధాన్యం లేదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ దేశాల మధ్య సిద్ధాంత సారూప్యత, రాజకీయ నిర్మాణం, సంస్కృతిలో కూడా సామ్యం లేదు. అయితే అభివృద్ధి విషయంలో అసమ్మతి ఉన్నంత కాలం బ్రిక్స్ అవసరం ఉండొచ్చు. అయితే బ్రెజిల్ అమెరికాతో కత్తు కట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు బ్రిక్స్ దేశాల ఐక్యతకు విఘాతం కలిగించవచ్చు. మరో వేపున రష్యా భౌగోళిక రాజకీయ వ్యవహారాల్లో ఐక్య రాజ్య సమితికి ప్రధాన పాత్ర ఉండాలంటోంది. అలాంటప్పుడు బ్రిక్స్ దేశాల మీద, దానికి సంబంధించిన వ్యవస్థల మీద ఒత్తిడి పెరగొచ్చు. ఈ దేశాలు ఒక దాని మీద మరొకటి ఆధారపడి విధానాలు రూపొందించుకుంటే ఆర్థిక సంస్కరణలను కొనసాగించవచ్చు.

అయితే బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక విధానాల్లో వ్యత్యాసాలు ఉండడం సమస్య కావచ్చు. ఈ దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉండడం కూడా పేచీలకు తావివ్వవచ్చు. ఉదాహరణకు చైనా దగ్గర నగదుకు కొరత లేదు కనక న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు 100 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే తద్వారా ఆ బ్యాంకు మీద పెత్తనం చేయడానికి ప్రయత్నించవచ్చు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం తమ కరెన్సీ ఆధారంగానే జరగాలని కోరవచ్చు.

Updated On : 4th Oct, 2019

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top