ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

విద్య - సమష్టి శ్రేయస్సు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

శ్రేయస్సుకు విద్యకు అవిభాజ్యమైన సంబంధం ఉంది. ఈ రెండింటి మధ్య సంబంధం ఉన్నత స్థాయిలో నైతిక అవగాహనకు సంబంధించింది. నైతిక శ్రేయస్సులో రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి సమష్టి శ్రేయస్సు. రెండు వ్యక్తి శ్రేయస్సు. సమష్టి శ్రేయస్సు ఓ ఆదర్శం. వ్యక్తి శ్రేయస్సు అస్తిత్వ సంబంధమైంది. సమష్టి శ్రేయస్సులో శాంతి, సామరస్యం, మానవుడిపట్ల గౌరవం మొదలైన అంశాలు ఉంటాయి. సమష్టి శ్రేయస్సులో కులం, లింగం, జాతి, మతం మొదలైన నిర్దిష్ట విలువలకన్నా ఉన్నతమైన మానవీయ విలువలు ఉంటాయి. ఈ విలువలు రాజ్యాంగంలో అంతర్నిహితమైనవి. ఇవి 2019 నాటి నూతన విద్యా విధాన ముసాయిదా పత్రంలోనూ ఉన్నాయి. అయితే ఈ విలువలను విద్య ద్వారా ప్రోత్సహించాలి. నిజానికి విద్య బోధనా ప్రక్రియ. ఇది నిర్దేశక విలువలను ప్రోది చేయాలి. ఉపాధ్యాయులకు ఉండే జ్ఞాన సామర్థ్యాన్నీ అంచనా వేయాలి. అంటే వారి తిరోగమన భావాలనే కాక సమష్టి శ్రేయస్సు సాధించడంలో విద్యార్థులలో ఉండే ఈ తిరోగమన భావాలనూ బేరీజు వేయాలి.

విద్య సమష్టి శ్రేయస్సును పెంపొందింప చేయడానికి తిరోగమన భావాలను విడనాడడానికీ ఉపయోగపడాలి. మంచి చెడ్డలను పర్యాలోచించడానికి తోడ్పడాలి. పర్యాలోచన ఉంటే ఇతరుల జ్ఞానంపై ఆధారపడవలసిన అగత్యం తప్పుతుంది. స్వప్రయోజనాలు ఆశించే రాజకీయ నాయకులు, యథాతథ వాదులైన తల్లిదండ్రులు, ఛాందస భావాలు గల వారు ఇతరుల జ్ఞానంపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఇలాంటి వారు ఊకదంపుడు సలహాలు ఇస్తుంటారు. లేదా యాంత్రికమైన సిద్ధాంతాలు వల్లిస్తుంటారు. జ్ఞాన సంపదనా సామర్థ్యం ఉన్న విద్యార్థులు స్వతంత్రంగా మంచి చెడ్డలు నిర్ణయించుకోగలుగుతారు. అయితే ప్రాథమిక స్థాయిలో సమష్టి శ్రేయస్సు గురించి తెలియజెప్పడానికి బోధనా ప్రక్రియ అవసరం అవుతుంది. సామాజికంగా, సాంస్కృతికంగా వైవిధ్యం ఉన్న వారు ఒకే తరగతి గదిలో ఉంటే మానవ విలువలలో మౌలికాంశాలను గ్రహించడం వీలవుతుంది. అప్పుడే సమష్టి శ్రేయస్సు సాధ్యమవుతుంది.

అయితే ఇలాంటి భావాల వ్యాప్తికి ఉన్న మార్గం సరైంది కాకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలలో అనేక సమస్యలున్నాయి. ఈ విద్యా సంస్థలు మనగలగాలనుకునే వారు వీటిని అర్థవంతంగా నడపాలని అనుకోకపోవచ్చు. తగినన్ని వనరులు లేకపోయినా పేదలు కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు, కోచింగ్ కేంద్రాలకు పంపడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి తల్లిదండ్రులను నిందించి ప్రయోజనం లేదు. అవకాశాలు అంతగా లేని తల్లిదండ్రులు స్థానిక సంస్థలను తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించే సదుపాయం కల్పించాలని కోరుతుంటారు. కేవలం నాణ్యమైన మధ్యాహ్న భోజన అందజేస్తే సరిపోదు అంటూ ఉంటారు. దీన్నిబట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రైవేటు పాఠశాలలు సమష్టి శ్రేయస్సును ప్రోది చేసే విషయాన్ని ఎలా చూస్తాయి? ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న వారు కేవలం, నైపుణ్యం, జ్ఞానం అందజేసినంత మాత్రాన లేదా అవకాశాలు అంతగా లేని వర్గాల పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుకున్నంత మాత్రాన సరిపోదు. నూతన విద్యా విధాన ముసాయిదాలో విద్యార్థులలోనూ, ఉపాధ్యాయులలోనూ మౌలిక విలువలు ప్రేరేపించడానికి ఉన్న అవకాశం ఏమిటి?

సమాజంలోని మనుషుల మధ్య ఉన్న అంతరాల్ని ముందు రూపుమాపాలి. నూతన విద్యా విధాన ముసాయిదా పత్రంలో కులీనులు చదువుకునే పాఠశాలల్లో, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేర్చుకోవాలి అన్న అంశంవల్ల వ్యవస్థాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సమాజంలో కులాల అంతరాలు, స్త్రీ పురుష భేదాలు ఇప్పటికే అంతరించాయని విధాన నిర్ణయాలు చేసే వారు భావించడమే దీనికి కారణం. సమష్టి శ్రేయస్సు సాధించాలంటే అవకాశాలు తక్కువ ఉన్న, అణగారిన వర్గాల వారి పిల్లలను ఘరానా వ్యక్తులు చదువుకునే పాఠశాలల్లో, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేర్చుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. వ్యవస్థాపరమైన అసమానతలు తొలగేట్టు చేయడం ప్రధానం.

వ్యవస్థా పరమైన అసమానతల కారణంగానే అణగారిన వర్గాల వారు బడి మానేస్తున్నారు. ఎలాగోలాగా కళా శాల స్థాయికి చేరుకోగలిగిన వారూ మానేయ వలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యా విధాన ముసాయిదాలో విద్య అందుబాటులో ఉండే అవకాశాలను విస్తరింప చేస్తామన్న ప్రతిపాదన కూడా ఉంది. కానీ అంతకన్నా ప్రధానమైంది సామాజిక దృక్పథం విస్తరించేట్టు చేయడం. ఈ ముసాయిదాలో నైతిక ప్రవర్తన గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఈ విలువలు సాకారం కావాలంటే విద్యా వ్యవస్థలో పని చేసే వారి దృక్పథం మారేట్టు చేయాలి. విద్యా వ్యవస్థలో వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నందువల్ల ఈ లక్ష్యం నెరవేరడం అంత సులభం కాదు. వ్యక్తికి తనతో ఉండే సంబంధాల మధ్య తేడాను తొలగించినప్పుడే ఇతరులతో నైతిక ప్రవర్తన సవ్యంగా ఉండేట్టు చేయడం సాధ్యం.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top