స్వేచ్ఛ, అధికారం, సత్యం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
దేశం మరోసారి నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉంది. ఒక వేపున ఇటీవలి ఎన్నికలలో గెలిచినవారు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మరో వేపున సభ్య సమాజానికి ఆలోచించే స్వేచ్ఛ, ఉదాత్తమైన లేదా విషాదకరమైన సత్యం చెప్పడానికి అవకాశం లేకుండా పోతోంది. ప్రజాస్వామ్యం ఉంది అనుకున్న సమయంలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. సత్యం చెప్పడానికి ఉన్న స్వేచ్ఛ హరించుకుపోతోంది. అధికారానికి, స్వేచ్ఛకు మధ్య ఉన్న పరిణామాత్మక సంబంధం, సత్యం చెప్పే అవకాశం ప్రతికూలంగా మారుతోంది. ఒక్కో సారి వైరుధ్యంగా కూడా మారుతోంది. అధికారానికి స్వేచ్ఛకు మధ్య ఉన్న నిరపాయకరమైన సంబంధం, అభ్యున్నతి కోసం బడుగువర్గాల పోరాటం స్థానంలో ఈ రెండింటిని కలగలిపే పరిస్థితి తీసుకొస్తున్నాయి. బహుళత్వ స్థానంలో ఏకీకృత విధానాన్ని అమలు చేసే పరిస్థితి కొనసాగుతోంది. బహుళత్వం ఉన్న విలువల వ్యవస్థలస్థానంలో అధికారాన్ని ఉపయోగించి భయం, విద్వేషం, అణచివేత ధోరణులను వ్యాపింప చేస్తున్నారు.
అధికారం, స్వేచ్ఛ తిరోగమన దారి పడితే అది భయంకరంగా మారుతుంది. అంటే వినాశనానికి దారి తీస్తుంది. దుర్బల జాతుల మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది. సమాజంలోని వేదనకు గురయ్యే వారి మీద దాడులు చేయడానికి అలవాటుపడ్డ వారు వారిని సామాజికంగా మరింత తీవ్రంగా వేదనకు గురి చేస్తారు. 2016లో గుజరాత్ లోని ఊనాలో నలుగురు దళిత యువకులను బహిరంగంగా చితకబాదారు. దేశంలో మైనారిటీల మీద మూకలు దాడి చేసి చంపడం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. ముంబైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రకాలుగా అననుకూల స్థితిలో ఉన్న మహిళా డాక్టర్ ఆర్మహత్య చేసుకోవలసి వచ్చింది. ఇది ఉన్నత విద్యా సంస్థలలో, ముఖ్యంగా వైద్య కళాశాలల్లో నిస్సహాయ స్థితిలో కొనసాగుతున్న ఆత్మహత్యలకు కొనసాగింపే. బలవన్సత్యానికి రాజకీయాంధికారం ఎప్పుడూ అవకాశం ఇస్తుంది. ఈ రాజకీయాధికారం విమర్శకుల నోళ్లు మూయించడమే కాక దుర్బలుల దుస్థితిని చూసి విలయ నర్తనం చేస్తుంది. బలవన్సత్యానికి ఇవన్నీ ఉదాహరణలే. బలవన్సత్యంలో ప్రజాస్వామ్య వ్యక్తీకరణకు చోటు ఉండదు. పైగా ఇది సంప్రదింపులకు, సంవాదాలకు చోటివ్వదు. వాదోపవాదాలకు అవకాశమే ఇవ్వదు. అది తన అంతరాత్మ చెప్పే విషయాన్ని కూడా వినదు.
అఘాయిత్యాలకు, దౌర్జన్యానికి పాల్పడేటప్పుడు ఆత్మ ఘోషను వినిపించుకోరు. అందువల్ల మహాత్మా గాంధీ లాంటి వారికి ఎలాంటి చోటూ ఉండదు. గాంధీ దృష్టిలో సత్యం అంటే నైతికంగా నిర్మలమైంది. అది ఆత్మ విమర్శకు వీలు కల్పిస్తుంది. తన ఆత్మనే కఠినమైన ప్రశ్నలు అడుగుతుంది. బలవన్సత్యానికి ప్రస్తుత రాజకీయ వాతావరణం చాలా అనువుగా ఉంటుంది. అయితే అందులో జీవితానికి, ఆలోచనకు ఇసుమంత చోటు కూడా ఉండదు. అందువల్ల డా. బి.ఆర్. అంబేద్కర్ కు కూడా స్థానం ఉండదు. అంబేద్కర్ దృష్టిలో సత్యం అంటే దాపరికం లేని చర్చల మీద ఆధారపడింది. గాంధీ దృష్టిలో స్వేచ్ఛ ఆత్మ శక్తితో కూడింది. అంబేద్కర్ దృష్టిలో ఇది ఆలోచనకు సంబంధించింది. గాంధీ సత్యాగ్రహం, అంబేద్కర్ బోధనల సారాంశం ఇదే. ఇలాంటి ఆలోచనాపరుల దృష్టిలో సంప్రదింపులు, సంవాదాలు చాలా ప్రధానమైనవి. అవి విషయ ప్రసారానికి సంబంధించినవి కూడా. అందుకే కులం అన్న సత్యం అందరూ గ్రహించగలిగిన రీతిలో ఉంటుంది.
ఇలాంటి సనాతన సత్యాలను ఏకపక్షంగా నిరాకరించడం కాకుండా దాపరికం లేని చర్చల ద్వారా నేరుగా ఎదుర్కోవాలి. ఈ చర్చలు కేవలం పండిత చర్చలు కావు. సామాన్య పౌరులకు కూడా ఇవి అవగతం కావాలి. ఇందులోనే వివిధ రకాల సత్యాలు ఇమిడి ఉంటాయి. కులం/లింగం మొదలైన అంశాలకు సంబంధించిన కీలక ప్రశ్నలు ఇందులో భాగం కావాలి. మేధోపరంగా ఈ సత్యాన్ని అధికారంలో ఉన్న వారికి చెప్పగలగాలి. సత్యం చెప్పడం కేవలం పై మెరుగులకు పరిమితం కాని, సమానత్వం లాంటి విషయాలు ప్రస్తావించే మేధావుల విషయంలో హేతుబద్ధంగా వ్యవహరించాలి. అప్పుదే వారు స్వేచ్ఛ, అధికారం లాంటివాటిని ప్రస్తావించగలుగుతారు. ఆలోచనాపరులు ఆలోచించే వారి వాణి వినిపిస్తారు కనక వారు ప్రధానమైన వారవుతారు. వారు వివిధ రకాల చైతన్య స్థాయి ఉన్న వారి మధ్య వారధిగా పని చేయగలుగుతారు. అందుకే మేధావులకు సత్యం మాట్లాడే స్వేచ్ఛ కావాలి. నాయకులు మాట్లాడే దాంట్లో మేలేమిటో తాలేమిటో తెలుసుకోవడానికి కొలమానాలు ఏమీ లేవు. ప్రజల మధ్య తరచుగా సంవాదం, చర్చ, సంప్రదింపులు జరగాలి. మెరుగైన జీవితం కోసం జనాన్ని సంఘటితం చేసే అవకాశం ఉండాలి.