ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సహాయక చర్యల్లోనూ కుల వివక్ష

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడూ సహాయక చర్యల్లో వివక్ష చూపడం కొత్త కాదు. 2004లో సునామీ, 2001లో గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడూ వివక్ష స్పష్టంగా కనిపించింది. అయితే ఇటీవల ఒరిస్సాలో ఫణి తుపాను సందర్భంలో వివక్ష మరో రూపంలో వ్యక్తమైంది. ఇది తుపాను తీవ్రత గురించింది కాదు మానవ సంబంధాలను ధ్వంసం చేసేది. దళితులకు తుపాను ఎదుర్కోవడానికి ఆసరా అవసరం అన్న అంశాన్ని అగ్రవర్ణాలవారు ఏ మాత్రం మానవత లేకుండా విస్మరించారు. తుపాను ఒరిస్సా తీరం తాకినప్పుడు ఈ వివక్ష బాహాటంగా వ్యక్తమైంది. పూరీ జిల్లాలోని ఒక గ్రామంలో తుపాను బాధితులైన దళితులను శరణార్థుల శిబిరంలో ప్రవేశించనివ్వలేదు. ఎలాగో ఆ శిబిరాల్లో చేరిన దళితులను అక్కడి నుంచి తరిమేశారని మీడియాలో వార్తలొచ్చాయి. దళితులు మర్రి చెట్టు కింద తల దాచుకోవలసి వచ్చింది. తుపాను తాకిడికి ఆ వట వృక్షమూ కూలిపోయింది. దళితుల బతుకులతో పాటు అంతటి మహా వృక్షమూ కుప్ప కూలింది. దళితులు 200 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో హోరు వానలో ఏ ఆచ్ఛాదన లేకుండా గడపవలసి వచ్చింది.

ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు సహాయం అందించడంలో ఏదో ఒక రకమైన వివక్ష మామూలే కానీ ఫణి తుపాను వచ్చినప్పుడు కుల వివక్ష వికృత రూపంలో కోరలు చాచింది. తమిళనాడులో సునామీ వచ్చినప్పుడు, గుజరాత్ లోని కచ్ లో, మహారాష్ట్రలోని లాతూర్ లో భూకంపం వచ్చినప్పుడు కుల వివక్ష కొట్టొచ్చినట్టు కనిపించింది. బిహార్ లో వరదలు వచ్చినప్పుడూ పేదలకు, దళితులకు అందవలసిన సహాయం అందలేదు. అన్నపు పొట్లాలు, మందులు హెలీకాప్టర్ల ద్వారా సంపన్నులు ఉండే మేడల ఇంటి పై కప్పుల మీదే జార విడిచారు. సహజంగానే ఆ మేడలు, మిద్దెలు దళితులకు అందుబాటులో ఉండవు. సహాయం అందజేసిన సైనికులు వరద నీటిలో చిక్కుకున్న ప్రాంతాలలో కాకుండా మేడల మీద అన్నం పొట్లాలు, మందులు జార విడిస్తే మంచిదనుకున్నట్టున్నారు. అందువల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వివక్షలోనూ ఓ వ్యవస్థ ఉన్నట్టుంది. ఎందుకంటే సహాయం అందజేసినందువల్ల ఫలితం ఎంత ఉంటుందని అంచనా వేస్తున్నారు కనక అది వ్యవస్థాపరమైన వివక్షే. వరదలు, తుపానులు వచ్చినప్పుడు సరఫరా చేసే ఆహారా పదార్థాలు వృధా   కాకూడదనుకుంటారు. అయితే ఒరిస్సాలో అగ్రవర్ణాలవారికి శరణార్థుల శిబిరాల నుంచి దళితులను తరిమేసే హక్కుందా? మొదట శరణార్థుల శిబిరాల్లో చేరిన అగ్రవర్ణాల వారు దళితులను అక్కడికి రానివ్వలేదు. ఆ శిబిరాలు అప్పటికే కిక్కిరిసి ఉన్నాయి కనక మరింతమందికి ఆశ్రయం ఇచ్చే అవకాశం లేదని చెప్పారు.

ఒక వేళ చోటు లేకపోవడమే కారణం అయితే దళితులను మాత్రమే కాకుండా ఎవరినైనా రానివ్వకూడదు. ఇందులో కుల వివక్ష లేదు అని వాదించడానికీ వీలుంది. ఇది పైకి చూడడానికి హేతుబద్ధంగా కనిపించవచ్చు. కానీ సంపన్నులు శరణార్థి శిబిరాలకు చేరుకున్నంత వేగంగా దళితులు చేరుకోలేరు. "ముందొచ్చిన వారికే అవకాశం" అనీ వాదించవచ్చు. సామర్థ్యం రీత్యా ఇది అభ్యంతరకరంగా కనిపించకపోవచ్చు. కానీ మిగతా శిబిరాల్లో ఇదే ధోరణి కనిపించలేదు. ఎందుకంటే ఎలాగో శిబిరాల్లోకి చేరిన దళితులను వెళ్లగొట్టారు. కుల వివక్ష చూపడం అంటే "ముందొచ్చిన వారికే అవకాశం" అన్న సూత్రాన్ని ఉల్లంఘించినట్టే. సహాయం అందజేసే సామర్థ్యం లేదు అన్నది వాదనకు నిలబడేదీ కాదు.

శరణార్థుల శిబిరాలు ప్రైవేటువో, సంపన్నులు ఏర్పాటు చేసుకున్నవో అయితే దళితులను తరిమేయడాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కాని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలను సంపన్నులు సొంతం చేసుకున్నారు.

ఇది సంపన్నులు దళితులకు ఆశ్రయం కల్పించడంలో నైతికత పాటించకపోవడమూ కాదు. ఎందుకంటే ఆ శరణార్థుల శిబిరం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటైంది. అందులోకి వెళ్లడానికి దళితులకూ హక్కు ఉంటుంది. అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణికి భయపడి దళితులు దూరంగా ఉండిపోయారు.

సంపన్నుల కుల చైతన్యం నైతిక చైతన్యాన్ని అధిగమించింది. మొదటిది దళితులకూ శరణార్థుల శిబిరంలో ఉండడానికి హక్కు ఉందని అగ్రవర్ణాల వారు అనుకోలేదు. వాటిలో ఉండే హక్కు తమకు మాత్రమే ఉందనుకున్నారు. దళితులు కూడా బతకడం మానవ హక్కు అని భావించలేదు. ఈ హక్కు మానవుల జీవించే హక్కుకు సంబంధించింది. తాము సురక్షితంగా ఉండడం కోసం అగ్రవర్ణాల వారు కారణాలు వెతుక్కున్నారు. తమ సామాజిక ఆధిపత్యాన్ని వినియోగించి దళితులకు ఆశ్రయం దక్కకుండా చేశారు.

ప్రకృతి వైపరీత్యాలు సృష్టించే విధ్వంసం అందరి మీదా సమానంగానే ఉంటుంది. ఆ వైపరీత్య తీవ్రత అందరి విషయంలో ఒకేలా ఉంటుంది. మనుషులే ఎవరి సహాయం అందాలి లేదా అందకూడదు అన్న అంశంలో వివక్ష చూపుతారు.

Back to Top