ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

నిప్పుతో మోదీ చెలగాటం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మీడియాలో వచ్చిన వార్తలనుబట్టి చూస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన అణ్వస్త్రాల గురించి నిర్లక్ష్యంగా, యథాలాపంగా వ్యాఖ్యానించినట్టు అనిపిస్తోంది. "మన అణ్వస్త్రాలను దీపావళి కోసం దాచుకున్నామా?" అని ఆయన ఎన్నికల ప్రచార సభలో అన్నారు. అణ్వస్త్రాల విషయంలో ఆయనకన్నా ముందున్న ప్రధానమంత్రులు ఎవరూ ఇంతటి నిర్లక్ష్య పూరితమైన వ్యాఖ్యలు చేయలేదు. మోదీ వేసిన ఈ ప్రశ్న ఆయన వ్యక్తిత్వానికి, విధానపరమైన దుస్సాహస ధోరణికి ప్రతీక అయితే కావచ్చు. కాని అణ్వస్త్రాలున్న భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఇంతకాలంగా ఉన్న ప్రతిష్ఠను మోదీ వ్యాఖ్య దెబ్బ తీస్తుంది.

1974లోనే భారత్ కనీస అణ్వస్త్ర నిరోధక సామర్థ్యం సంతరించుకుంది. కానీ కొన్ని చట్టపరమైన, సాంకేతిక ప్రరమైన, భూభౌగోళిక కారణాలవల్ల ఆ విషయం బహిరంగంగా అంగీకరించలేదు. 1998లో మన దేశం అణ్వస్త్రాలున్న దేశంగా ప్రకటించుకుంది. "కనీస అణ్వస్త్ర నిరోధక" సామర్థ్యం సంపాదించినట్టు తెలియజేసింది. కానీ ఈ అణ్వస్త్రాలు నిరోధకంగా ఉంటాయే తప్ప శత్రువులపై తామే మొదట ఎట్టి పరిస్థితిలోనూ అణ్వస్త్రాలు ప్రయోగించబోమని అంతర్జాతీయ సమాజానికి భరోసా ఇచ్చింది. ఓట్లు రాబట్టడానికి మోదీ అణ్వస్త్రాల ప్రస్తావన తీసుకురావడం యుద్ధోన్మాదమే. ఆయన ప్రకటన వల్ల ఈ ప్రాంతంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ ప్రాంతం ఇప్పటికే అణ్వస్త్ర కుంపటిలా ఉంది.

పాకిస్తాన్ రాజకీయ నాయకులు, సైనికాధికారులు ఇదివరకే ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. అవసరమైతే అణ్వస్త్రాల మీట నొక్కుతామని పాకిస్తాన్ పదే పదే హెచ్చరిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అణుబాంబుల గుట్టలున్న అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధ ప్రమాదం నిరంతరం పొంచి ఉండేది. కానీ ఆ రెండు దేశాలు ఈ విషయంలో యుద్ధోన్మాదం ప్రదర్శించకుండా నిగ్రహం పాటించాయి. కనీసం బహిరంగంగా ఈ యుద్ధోన్మాదం ప్రదర్శించేవి కావు. చైనా ఎప్పుడూ ఆచి తూచే మాట్లాడుతుంది. అణ్వస్త్ర దేశాలుగా గుర్తింపు పొందిన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దగ్గరే కాకుండా ఇజ్రాయిల్ దగ్గర కూడా అణ్వాయుధ రాశులు ఉన్నాయి. 1960 నుంచే ఆ దేశం దగ్గర అణ్వస్త్రాలున్నప్పటికీ ఎన్నడూ ఆ విషయం ఇజ్రాయిల్ అంగీకరించనే లేదు. ఈ దాపరికం ఇజ్రాయిల్ కు వ్యూహాత్మకంగా, ప్రాంతీయ భద్రతకు బాగానే ఉపయోగపడ్తోంది. కానీ మోదీ అణ్వస్త్రాల విషయంలో చూపుతున్న దూకుడు ధోరణి మనం చాలా కాలంగా పాటిస్తున్న సంయమానికి విరుద్ధమైంది. ఇది మన దేశాన్ని బాధ్యతా రహిత దేశాల సరసన చేరుస్తుంది.

ఈ అంశంలో మోదీని తప్పు పట్టడం అంటే మన అణ్వస్త్ర కార్యక్రమాలను వ్యతిరేకించడం కానక్కర్లేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయాలని కోరడమూ కాదు. మన చుట్టూ అణ్వస్త్రాలున్న దేశాలున్నాయి. ఈ పరిస్థితిలో మనకు నిరోధకంగా అణ్వస్త్రాలు అవసరమే. అయితే అణ్వస్త్రాలున్న దేశాలు అత్యంత జాగ్రత్తగా, వివేకంతో వ్యవహరించాలి. నాయకత్వం కనక దుందుడుకుగా వ్యవహరిస్తే ఘోర విపత్తుకు దారి తీస్తుంది.

భారీ స్థాయిలో అణు యుద్ధమే జరిగితే ప్రాంతీయంగానే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. అణ్వస్త్ర దాడి జరిగితే ఆరోగ్య పరిరక్షణా వ్యవస్థ కుప్ప కూలుతుందని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్రాలను నిరసిస్తున్నారు. ఇంతటికి "పనికిమాలిన ఆయుధం" ఎన్నడూ లేదు అంటున్నారు.

ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితి భారత పాకిస్తాన్ దేశాలకు వర్తించకపోవచ్చు. కానీ అణుయుద్ధం పరిమితంగా జరిగినా పరిణామాలు దారుణంగా ఉంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడే జన జీవనాన్ని పునరుద్ధరించడంలో ఈ రెండు దేశాలు ఎంత ఘోరంగా విఫలమయ్యాయో చూస్తూనే ఉన్నాం. అమెరికా, సోవియట్ యూనియన్ లో అణు యుద్ధ ప్రమాదాన్ని గురించి జనానికి తెలియజెప్పారు. భారత్, పాకిస్తాన్ దేశాలలో ఈ ప్రమాదం గురించి ఇప్పటికీ పెద్దగా తెలియదు. సరిహద్దులో నిరంతరం కొనసాగుతున్న ఘర్షణలను చూస్తే అణ్వస్త్రాలు ఉన్నంత మాత్రాన జగడాలు ఆగిపోవని రుజువైంది. ఇతర దేశాలు జోక్యం చేసుకున్నందువల్ల ఈ ప్రమాదం తప్పింది. కాని అన్ని రోజులూ ఒకేలా ఉండకపోవచ్చు.

పాకిస్తాన్ దగ్గర 45 కిలో టన్నుల భారీ అణ్వస్త్రం ఉంది. దాన్ని మన పెద్ద నగరాల్లో దేని మీద ప్రయోగించినా తక్షణం అయిదు లక్షలమంది మృత్యువాత పడతారు. 12 లక్షల మంది క్షతగాత్రులవుతారు. చైనా దగ్గర ఒక మెగా టన్ను అణ్వస్త్రాలు చాలా ఉన్నాయి. అదులో ఒకటి ప్రయోగించినా 25 లక్షల మంది మరణిస్తారు. 60 లక్షల మంది క్షతగాత్రులవుతారు. అణుధార్మిక శక్తి ప్రభావం వల్ల ప్రాణ నష్టం దీర్ఘకాలికంగా ఉంటుంది.

అణుయుద్ధం భారత, పాకిస్తాన్ దేశాలను అనూహ్యమైన కష్టాల పాలు చేస్తుంది. అందువల్ల దీని గురించి మాటవరసకు కూడా మాట్లాడకూడదు. అలాంటి యుద్ధం జరగనే కూడదు. అణుయుద్ధంలో తాము గెలుస్తామన్న భ్రమ రెండు దేశాలకూ ఉండక్కర్లేదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top