ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మహిళా రిజర్వేషన్ల పరమార్థం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఎన్నికల రాజకీయాలలో మహిళల పాత్ర పెంచాలని గట్టిగా కోరడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి చట్టసభల్లో వారి సంఖ్య పెంచడం. రెండు అవకాశవాదం, స్త్రీ వివక్షా దృక్పథం, మితిమీరిన పురుషాధిక్యతలాంటి ధోరణిలో మార్పు తీసుకురావడం. ప్రియాంకా చతుర్వేది లాంటి వారు కాంగ్రెస్ ను వీడి శివసేనలో చేరడం విషాదభరితమైన వైపరీత్యం. తాను మహిళను అయినందువల్ల, తనపట్ల పోకిరీగా వ్యవహరిస్తున్న వారి మీద కాంగ్రెస్ చర్య తీసుకోకపోవడం తాను ఆ పార్టీని వీడడానికి కారణం అని ఆమె చెప్తున్నారు. అయితే చేరిన పార్టీ కూడా స్త్రీ-పురుష వివక్షకు అతీతమైంది ఏమీ కాదు. చతుర్వేది పార్టీ మారడంతో పాటు తాను మహిళల హక్కులకోసం పోరాడతానని కూడా చెప్పారు.        

ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. ఇది రాజకీయాలలో "మామూలు" అయిపోయింది. ఇలా పార్టీలు మారడంలో తాము పైకెదగాలన్న వైఖరి తప్ప నైతిక ప్రమాణాలు, నిబద్ధత, అపరాధ భావన లాంటివేమీ లేవు. ఈ "మామూలు" అయిపోవడాన్ని ప్రశ్నించి తీరాలి. రాజకీయ పార్టీలు సభ్యులను తమ జీతగాళ్లనుకుంటున్నాయి. వారి పనల్లా పార్టీ తరఫున ప్రచారం చేయడమే అనుకుంటున్నాయి. ఈ పనులు చేసే వారికి ప్రజలతో ఆట్టే సంబంధం ఉండదు కనక వారిని రాజకీయ నాయకులు అనుకోవడానికీ వీలు లేదు. ఇలాంటి వారికి పార్టీ సిద్ధాంతాలు, కీలకమైన విలువల గురించి కూడా పట్టింపు అంతగా ఉండదు. అందువల్ల పార్టీలు మారడం కార్పొరేట్ సంస్కృతిలో భాగమై పోయింది.

్        ఇలాంటి సందర్భాలలో మరో సమస్య ఏమిటంటే పార్టీలు మారిన వాళ్లు మహిళల హక్కులు, స్త్రీవాదం లాంటి మాటలను యదేచ్ఛగా ఉపయోగించడం. రాజకీయాలలో ఉన్న అవినీతిని ఆమోదించడం, పురుషాధిపత్యాన్ని సహించడం. ఈ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడడం గురించి ఆలోచిస్తే వీరికి స్త్రీవాదం అంటే ఏమిటో తెలుసునా అన్న అభిప్రాయమూ కలుగుతుంది. స్త్రీవాదం అర్థమై ఉంటే భిన్నమైన రాజకీయ పరిభాష ఉపయోగించే వారు. అందుకే చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలని కోరడం మొదలైంది. "తాము మనగలగడానికి, అభివృద్ధి చెందడానికి" అవకాశం ఉండాలని అంటున్నారంటే ఆ మహిళలు పురుషాధిపత్యం ఉన్న రాజకీయాలను మార్చాలనుకుంటున్నారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ పురుషాధిక్య భావనే రాజకీయాలలో మహిళలకు అడ్డంకులు సృష్టిస్తోంది.

రాజకీయాలలో మహిళల పాత్ర పెరగాలి అంటే చట్టసభల్లో వారికి రిజర్వేషన్లు ఉండాలి. గత పార్లమెంటులో మహిళలు కేవలం 11 శాతమే. అంటే ప్రతి 90 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఒక్క మహిళ మాత్రమే. రాజకీయ పార్టీలు మహిళా అభ్యర్థులకు అంతగా ప్రాతినిధ్యం కల్పించనందువల్ల కూడా వారికి రిజర్వేషన్ల అవసరం ఉంది. పార్టీలు ప్రముఖుల మీద, పేరు ప్రతిష్ఠలు ఉన్న వారి మీదే మొగ్గు చూపుతున్నాయి. లేదా వారికి ఆనువంశిక మద్దతైనా ఉండాలి. చాలా పార్టీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న మహిళలను విస్మరించి పేరు ప్రఖ్యాతులున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒక వేళ మహిళలకు టికెట్లు ఇచ్చినా వారు అనేక అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుంది. వారిపట్ల వ్యతిరేకత ఉంటుంది. పోకిరీల పెత్తనం ఉంటుంది. పురుష కార్యకర్తలే ఆధిపత్యం చెలాయిస్తుంటారు. మహిళల అభ్యర్థిత్వాన్ని శల్య పరీక్షకు గురి చేస్తారు. లేదా వారి స్త్రీత్వం గురించి మాట్లాడతారు. వారి ప్రఖ్యాతి గురించి ప్రస్తావిస్తారు. అందువల్ల ఇలాంటి వ్యక్తిత్వం నుంచి బయట పడవలసిన అవసరం ఉంది.

ఒక వేళ మహిళలు ఎన్నికై రాజకీయ అధికారం సంపాదించినా ఇది వారు సంపూర్ణంగా రాజకీయాలలో భాగస్వాములు కావడానికి ఉపకరించక పోవచ్చు. మహిళలు నాయకత్వం వహించే పార్టీలు కూడా పురుషాధిక్యత నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అయితే అట్టడుగు స్థాయిలో మహిళల పాతినిధ్యంవల్ల పరిస్థితిలో మార్పులు వస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. మహిళలు ఎన్నికైతే వారు భిన్నంగా ఆలోచిస్తారా, సమగ్రమైన మార్పు రావడం కోసం వారు భిన్నమైన రీతిలో పని చేస్తారా? రిజర్వేషన్లవల్ల మహిళలు చట్టసభల్లోకి ప్రవేశించినా వారు మరో అడుగు వేయడం అవసరం. వారు రాజకీయాల దిశ మార్చగలగాలి.

మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. మహిళల కోర్కెలను లేవనెత్తగలిగిన ప్రతినిధులు కావాలి. కొత్త రాజకీయ సంస్కృతికి తెర తీసేవారు కావాలి. ఉదాహరణకు కార్మికులలో మహిళల భాగస్వామ్యం తగ్గడం గురించి, ఓటర్ల జాబితాలో రెండు కోట్ల మంది మహిళల పేర్లు గల్లంతు కావడం గురించి మహిళా ప్రతినిధులు ప్రశ్నించాలి. ఎందుకంటే దీని ప్రభావం రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం మీద ప్రభావం చూపుతుంది. మహిళల సమస్యలను విస్తృతం చేయగలగాలి. జన సమీకరణలో జరుగుతున్న కుట్రలనూ మహిళలు పట్టించుకోవాలి. వాళ్ల సమస్యలు గ్యాస్ సిలిండర్లకు పరిమితమై పోకూడదు.

మహిళల ప్రాతినిధ్య పెరగడం వివిధ వర్గాలకు, నేపథ్యాలకు సంబంధించిందై ఉండాలి. అప్పుడే మహిళలు కొత్త రకం రాజకీయాలకు, కొత్త అంశాలకు ప్రాధాన్యం ఇవ్వగలుగుతారు. మహిళలు తమ జీవితానుభవంతో పాటు ప్రజాస్వామ్యం, స్త్రీవాదం గురించి, పురుషాధిక్యత గురించీ ఆలోచించగలగాలి. కేవలం స్త్రీవాదం గురించి మాటలు చెప్పడం, తమ ప్రతిష్ఠ పెంచుకోవడానికి ప్రయత్నించడంవల్ల వైఖరుల్లో మార్పు ఏమీ రాదు. మహిళల ప్రాతినిధ్యం పెరిగితే వైఖరిలో కూడా మార్పు రావడానికి వీలుంటుంది. పురుషుడి ఆధిపత్యం ఉన్న కోటలో తమకు స్థానం దక్కితే చాలుననుకోకూడదు.

Back to Top