ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

నైతిక సత్యాలు-న్యాయ వ్యవస్థ నైతికత

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయడం ప్రజా వ్యవస్థలకు, వాటిలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి లేదా ఉండాలనుకునే వారికి మధ్య సంబంధాన్ని సమస్యాత్మకంగా మారింది. ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తి తన వ్యక్తిగత స్థాయిని ప్రజా వ్యవస్థల స్థాయికి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరో సందర్భంలో కావచ్చు కాని ప్రధానమంత్రి నరేద్ర మోదీ చేసే వాదనలాగానే గొగోయ్ వాదనా ఉంది. ఈ ఇద్దరు వ్యక్తులు భిన్న సందర్భాలలో తమ గురించి అలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తనకు తాను ఈ దేశాన్ని కాపాడే మహపురుషుడిని అనుకుంటున్నట్టు మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. తానొక్కడికే ఈ జాతిని కాపాడగలిగిన నైతిక (పురుషోచిత) శక్తి ఉందని, తన చేతిలోనే ఈ దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరో వేపున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే ఈ ఆరోపణ న్యాయవ్యవస్థలో ఎదురవుతున్న సంక్షోభానికి అంటగడ్తున్నారు. మరి ప్రజా జీవనంలో ప్రజా వ్యవస్థలు ప్రధానమా? వ్యక్తులు ప్రధానమా?

ప్రధాన న్యాయమూర్తి చెప్పే మాటలు వింటే న్యాయవ్యవస్థ నిజాయితీని, నైతికతను కాపాడడానికి ఆయన మీద ఉన్న బాధ్యతకు మాజీ ఉద్యోగిని చేసిన "తప్పుడు ఆరోపణలు" విఘాతం కలిగిస్తున్నాయన్న రీతిలో ఉంది. తన మీద దాడి మొత్తం న్యాయవ్యవస్థ మీదే దాడి అని ఆయన పదే పదే చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి పదవి రాజ్యాంగ విలువలకు, సుప్రీంకోర్టు లాంటి ప్రజా వ్యవస్థలకు ప్రతీక అన్న విషయం వాస్తవమే. కానీ సమర్థులైన న్యాయమూర్తులని నియమించడం నైతికతపై వారి దృక్కోణం లేదా నిష్ఠ, త్యాగాల మీద ఆధారపడి ఉండదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి "నేను ఈ ఆరోపణలను ఖండించే స్థాయికి దిగజారకూడదు, నా దగ్గర పని చేసే బంట్రోతుకు నాకన్నా ఎక్కువ డబ్బు వచ్చింది" తన నైతిక గొప్పతనాన్ని వెల్లడించే మాటలు చెప్పారు.

ఇక్కడే అడగవలసిన ప్రశ్నలున్నాయి.

ప్రధాన న్యాయమూర్తి పదవి న్యాయవ్యవస్థ నిజాయితీకి, సాక్ష్యాల ఆధారంగా ఆ వ్యవస్థ అనుసరించే ప్రక్రియకు సంబంధించింది అయితే తన వాదన చెప్పడానికి నైతిక పదజాలం ఎందుకు వినియోగిస్తున్నట్టు? సాక్ష్యాధారాల ఆధారంగా, వాదనల ఆధారంగా తీర్పు చెప్పడం ఆధునిక న్యాయ వ్యవస్థలకు కీలకం. దాపరికం లేకుండా పకడ్బందీ అయిన ప్రక్రియ అనుసరించి వెలువరించే న్యాయాన్ని సత్యం గెలిచినట్టుగా భావిస్తాం. ఆధునిక న్యాయవ్యవస్థ శాస్త్రీయంగా సత్యాన్ని వెలికి తీయాలి కనక ఆత్మ రక్షణ కోసం నైతిక పదజాలాన్ని ఉపయోగించవలసిన అగత్యం లేదు. నైతిక సత్యం వ్యక్తికి సంబంధించింది. అందులో నైతిక వర్తన, నిరాడంబరత అన్న మాటలు ఉంటాయి. లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు ఇలాంటి నైతికత మీద ఆధారపడిన వాదనలే లేవనెత్తుతుంటారు.

ఇలాంటి భాష ఉపయోగించడంవల్ల ఇందులో నిజానిజాలు తెలుసుకోక ముందే తాము నిర్దోషులమని ప్రకటించుకోవడానికే వినియోగిస్తారు. ఇది ఫిర్యాదు చేసిన వారి విశ్వసనీయతను నిరాకరించేదే. ఇది న్యాయబద్ధమైన విచారణకు వీలు లేకుండా చేయడమే. ప్రధాన న్యాయమూర్తి మీద వచ్చిన ఆరోపణ పని చేసే చోట లైంగిక వేధింపులకు సంబంధించింది. అధికార దొంతరలకు సంబంధించింది. న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఏమైనప్పటికీ ఈ కేసులో వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగించేదిగా లేదు. న్యాయ వ్యవస్థల్లో దాపరికం లేని, పటిష్ఠమైన విచారణా ప్రక్రియ అనుసరించినప్పుడే ఆ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ కేసును ఎలా విచారిస్తుంది, వాస్తవాన్ని ఎలా వెలికి తీస్తుంది, న్యాయ ప్రక్రియ ద్వారా వాస్తవం ఏ మేరకు బయటకు వస్తుంది అన్న దాన్నిబట్టే న్యాయ వ్యవస్థ నైతికత, నిష్కాపట్యం ఎంతో తేలుతుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top