ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

తగ్గుతున్న మహిళా కార్మికుల పాత్ర

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు (ఎఫ్.ఎ.పి.ఆర్.)గణనీయంగా తగ్గుతోంది. ఇది కాలక్రమంగా కనిపించే పరిణామం. పని చేసే వయసులో ఉన్న మహిళల్లో పని చేసే వారి సంఖ్య క్షీణిస్తోంది. 2011-12లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు 32.2 శాతం ఉంటే 2017-18లో ఇది 23.3 శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా కార్మికుల భాగస్వామ్యం 2017-18లో 11 శాతం తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో పురుష కార్మికుల భాగస్వామ్యం కూడా తగ్గినా మహిళల భాగస్వామ్యం అంతకన్నా ఎక్కువగా తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా కార్మిక భాగస్వామ్యం తగ్గేడమే కాక వారి స్థానంలో పురుషులను నియమించుకోవడం ఎక్కువైంది. మహిళా కార్మికుల భాగస్వామ్యం ఎందుకు తగ్గుతోందో లోతుగా పరిశీంచవలసిన అగత్యం ఉంది.  

ఉద్యోగావకాశాలు లేకపోవడం, విద్యావకాశాలు పెరగడం, కుటుంబాల ఆదాయం పెరగడం, మహిళా కార్మికులు చేసే పని గురించి సరైన సమాచారం లేకపోవడం దీనికి కారణం అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో సంక్షోభం ప్రభావం మహిళల మీదే ఎక్కువ ఉంటుంది. మహిళలకు ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు తగిన ఉపాధి దొరకడం లేదు. వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోతోంది. వ్యవసాయేతర రంగంలో ఆర్థిక అవకాశాలు ఉండడం లేదు. యాంత్రీకరణవల్ల కూడా మహిళలకు అవకాశాలు తగ్గిపోయాయి.   

మహిళలు పని చేయాలంటే వారికి అనువైన సమయంలో పని చేసే అవకాశం ఉండాలి. పని ఇంటికి దగ్గరలో ఉండాలి. ప్రభుత్వ పథకాలలో ఏడాదికి వంద రోజుల పాటు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి అవకాశం ఉంటుంది. మహిళలు ఆదాయం సమకూరని ఇంటి చాకిరీ చేయడంవల్ల కార్మిక శక్తిలో వారి పాత్ర తగ్గుతోంది. ఆదాయం రాని ఇంటి పనికి ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తున్నందువల్ల మహిళలు ఇతర పనులు చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో మరింత ఎక్కువగా ఉంది. పితృస్వామిక నియమాలవల్ల, మతపరమైన నిషేధాలు, సాంస్కృతిక పక్షపాతంవల్ల మహిళలు పని చేసే అవకాశం తగ్గుతోంది. ఇటీవలి కుటుంబాలు చిన్నవై పోతున్నందువల్ల, మగవారు పని కోసం అన్వేషిస్తూ వలస వెళ్లడంవల్ల మహిళలు ఆదాయం రాని పనులకే ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తోంది. 

సమయాన్ని వినియోగించుకునే విషయంలో ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ అందించిన సమాచారం ప్రకారం భారతీయ మహిళలు రోజూ 352 నిమిషాలు ఇంటి పనిలోనే మునిగిపోతారు. ఇది ఆదాయం రాని పని చేయడంకన్నా 577 శాతం ఎక్కువ. ఇది సరఫరాలో ఉన్న లోపం. దీన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. "సమయం దక్కకపోవడం" వల్ల పేదల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంటి పనివల్ల మెరుగైన నైపుణ్యం సంపాదించడం సాధ్యం కావడం లేదు. అందువల్ల మహిళలు కార్మిక శక్తిలో భాగస్వాములు కాలేకపోతున్నారు. ఇంట్లో ఉండే వారిని చూసుకోవడం కోసం, పిల్లలను చూసుకోవడానికి మౌలిక సదుపాయాలు కల్పించడం సాధ్యమైతే కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది.

ఇటీవల రాజ్యవ్యవస్థ నిర్ణయించిన విధానాలు వ్యవస్థీకృత రంగంలోని మహిళా కార్మికులకే ఉద్దేశించినవి. 2016నాటి ప్రసూతి ప్రయోజన (సవరణ) బిల్లులో మహిళలకు 26 వారాలు ప్రసూతి సెలవు ఇచ్చే అవకాశం కల్పించారు. ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు ప్రకారం శిశువుల రక్షణకు పని చేసే మహిళలు 50 మందికన్నా ఎక్కువ ఉంటే శిశు సం రక్షణాలాయాలు ఏర్పాటు చేయాలని ఉంది. అవ్యవస్థీకృత రంగంలో ఇలాంటి సదుపాయాలు తక్కువ. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేసే మహిళల కోసం శిశు సంరక్షణాలయాలు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉన్నా వాస్తవంలో ఇది సాధ్యం కావడం లేదు. శిశు సంరక్షణాలయాలకు కేటాయించే నిధులలో కేంద్ర ప్రభుత్వం కోత పెట్టినందువల్ల దేశ వ్యాప్తంగా అనేక శిశు సం రక్షణాలయాలు మూత పడ్తున్నాయి.   

ఇప్పుడు అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకంతో పాటు మారుతున్న ఉత్పత్తి ప్రక్రియకు అనుగుణంగా వృత్తి శిక్షణా సదుపాయాలు కల్పిస్తే కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. ఉద్యోగాల్లో కోటాలు, మహిళలకు రుణాలవంటి నిర్దిష్ట వర్గాల వారికోసం అనుసరించే విధానంవల్ల శ్రామిక మార్కెట్ లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది.

కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యానికి అడ్డంకులను తొలగించాలంటే కార్మికల డిమాండ్ కు సంబంధించిన అవరోధాలను తొలగించి స్త్రీ-పురుష వివక్ష లేని విధానాలు విధానాలు రూపించించాలి. అప్పుడే మహిళలు ఆదాయం రాని పనుల మీద ఆధారపడడం తగ్గిపోతుంది. కార్మికుల డిమాండ్ పెంచడానికి దానికి ఆటంకాలు తొలగించడానికి ప్రభుత్వాలు అనుసరించే విధానాలు సవ్యంగా లేనందువల్ల మహిళలు ఆదాయం రాని పనులు చేయవలసి వస్తోంది. మహిళలు ఆదాయం రాని పనులలో మునిగిపోవడానికి సామాజిక, సాంస్కృతిక అంశాలు కూడా కారణం.  

Back to Top