వ్యవస్థను సంస్కరించని ఎన్నికల బాండ్లు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
మన దేశంలో ఎన్నికలకయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? ఎన్నికల కోసం 1952 లో ఒక్కో నియోజక వర్గంలో రూ. 0.26 మిలియన్లు ఖర్చయితే 2004 ఎన్నికల నాటికి ఆ ఖర్చు రూ. 71.38 మిలియన్లకు పెరిగిందని ఎన్నికల కమిషన్ చెప్తోంది. అంటే రాజకీయ పార్టీల తరఫున ఈ ఖర్చు భరించేవారు ఎవరో ఉన్నట్టే లెక్క. బిహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో బర్క్లీ లోని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం నిర్వహించిన సర్వేలో పార్లమెంటు సభ్యులుగా, శాసన సభ్యులుగా పోటీ చేసే వారు అపారమైన డబ్బు ఖర్చు పెడ్తున్నారని తేలింది. వారి ఆదాయంలో పార్లమెంటు సభ్యులైతే 44 శాతం, శాసనసభ్యులైతే 47 శాతం ఖర్చు పెడ్తున్నారు. అంటే ఎన్నికలకయ్యే ఖర్చును ఇతరులు రహస్యంగా ఇస్తుండడాన్ని రాజ్యవ్యవస్థ అనుమతిస్తున్నట్టే. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.) ప్రవేశ పెట్టిన ఎన్నికల బాండ్ల పథకం ఇలా రహస్యంగా డబ్బు ఖర్చు పెట్టడాన్ని ఏ మాత్రం నివారించలేకపోయింది. ఎన్నికల ఖర్చులో దాపరికం లేకుండా చేయడానికే ఎన్నికల బాండ్ల విధానం ప్రవేశ పెట్టామని ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించలేదు.
ఎన్నికల సంస్కరణలు భారత్ లో ఎన్నో ఎగుడు దిగుళ్లు ఎదుర్కున్నాయి. విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టే పద్ధతిని కట్టడి చేయడానికి, నిబంధనలను పాటించడానికి రాజకీయ సంకల్ప బలం ఎన్నడూ కనిపించలేదు. ఎన్నికల బాండ్లు నిజానికి రాజకీయ పార్టీలు ఈ నిబంధనలను అతిక్రమించడానికి మంచి అవకాశం కల్పించాయి. నల్ల ధనం వెచ్చించడానికి ఎన్నికల బాండ్ల విధానం బాగా తోడ్పడడమేకాక దాన్ని చట్టబద్ధం చేస్తోంది కూడా. ఇది విరాళాలు ఇచ్చే వారికీ, పుచ్చుకునే వారికి కూడా ఉభయ తారకంగా ఉపకరిస్తోంది. 2016నాటి ఆర్థిక చట్టంలో తీసుకొచ్చిన సవరణ ద్వారా "విదేశీ వనరులు" అన్న నిర్వచనాన్ని నీరుగార్చడంవల్ల ఎన్.డి.ఎ. ప్రభుత్వం రాజకీయ విరాళాలను చట్టబద్ధం చేయడమే కాక బూటకపు కంపెనీలు సైతం ఈ విరాళాలివ్వడానికి అవకాశం కల్పించింది. పైగా 2010నాటి విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టాన్ని సవరించి భారతీయ ఎన్నికలు విదేశాల నుంచి అందే విరాళాల మీద ఆంక్షను కూడా తొలగించినట్టయింది. అన్నింటికన్నా మించి ఈ సవరణను 42 ఏళ్ల కింది నుంచి అమలు చేస్తున్నారు. దీనివల్ల ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తమకు విదేశాలనుంచి అందిన "అక్రమ" విరాళాలకు లెక్క చెప్పవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ రెండు పార్టీలు ఈ అక్రమాలకు పాల్గొన్నాయని దిల్లీ హైకోర్టు 2014లో తప్పు పట్టింది. అంతేగాక 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, 1961 నాటి ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించి రూ. 20,000 కు లోపు ఊరూ పేరు లేని విరాళాలను చట్టబద్ధం చేశారు. విరాళాలు ఇచ్చే వారు ఎన్నిసార్లు ఇంత మొత్తంలో విరాళం ఇవ్వవచ్చు అన్న విషయంలో స్పష్టత లేదు. విచిత్రం ఏమిటంటే నల్ల ధనంపై "మెరుపు దాడి" (అదే పెద్ద నోట్ల రద్దు) చేశామని గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వమే ఈ పని చేసింది.
ఎన్నికల బాండ్లు రాజకీయ విరాళాలలో దాపరికం లేని తనాన్ని మరింత పెంచుతాయని భారత ఎన్నికల సంఘం వ్యాఖ్యానించడం సబబే. వివిధ రాజకీయ పక్షాలకు సమానావకాశాలు కల్పించే పేరుతో ఈ సవరణలు చేశారు. అయితే ఇందులో అందరికీ ఓటు హక్కులో ఉండే స్ఫూర్తిని గాలికి వదిలేశారు. ఎన్నికలలోకి దిగే పక్షాల మధ్య పోటీ మితిమీరిపోయింది కనక అందరికీ సమానావకాశాలకు ఏ మాత్రం వీలు లేకుండా పోయింది. ఇంత పోటీ ఉన్న చోట డబ్బు వెదజల్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం లేని అభ్యర్థులు ఎలాగైనా గెలవడం కోసం మరింత డబ్బు వెదజల్లుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు రాజకీయ పార్టీలకు డబ్బు ఇవ్వడం, ఓట్లు రాబట్టడానికి డబ్బివ్వడం ఒక విషవలయంగా తయారైంది. పోటీ చేసే అభ్యర్థులు పెరగడం, ఓటర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడంతో ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రాతినిధ్యం అన్న సూత్రానికి విలువే లేకుండా పోతోంది. ఈ సందర్భంలో ఎన్నికల కమిషన్ లేదా అలాంటి నియంత్రణా వ్యవస్థ దాపరికం లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటే ఆ వ్యవస్థ పని తీరునూ నిశింతంగా పరిశీలించాలి. అలాగే రాజకీయ పార్టీల రాజకీయ సంకల్ప బలం ఎంతో కూడా పరిశీలించాలి.
సమగ్ర ఎన్నికల ప్రక్రియకు డబ్బే విఘాతం కలిగిస్తున్నప్పుడు ఎన్నికల సంఘం లోకసభకు పోటీ చేసే అభ్యర్థి ఖర్చు పెట్టడానికి రూ. 40 లక్షల పరిమితి ఉంటే దాన్ని రూ. 70 లక్షలకు ఎందుకు పెంచినట్టు? పైగా అభ్యర్థులు ఇదివరకున్న రూ. 40 లక్షల పరిమితిలో తాము 15 నుంచి 20 శాతమే ఖర్చు పెడ్తున్నామని అభర్థులు చెప్తున్నప్పుడు వ్యయ పరిమితి పెంచవలసిన అవసరం ఏమిటి? అసలు ఎన్నికలలో పోటీ చేయడానికి ఒక అభ్యర్థికి ఎంత డబ్బైతే సరిపోతుంది అని ఎన్నికల కమిషన్ ఎలా నిర్ధారిస్తోంది? పరిమితికన్నా తక్కువ డబ్బే ఖర్చు పెట్టామన్న అభ్యర్థుల వాదనను అంగీకరిస్తున్న ఎన్నికల కమిషన్ వ్యయ పరిమితిని ఎందుకు పెంచినట్టు? అంటే తక్కువ మాత్రమే ఖర్చైందన్న అభ్యర్థుల, రాజకీయ పార్టీల వాదనను ఎన్నికల కమిషన్ మౌనంగా అంగీకరిస్తోందా?ఇలాంటి దొంగ లెక్కలు చూపకుండా ఉండడంలో తమ విధానాల్లో లోపం ఉందని అంగీకరిస్తోందా?
ఎన్నికల సంస్కరణల కోసం ఎన్ని కమిషన్లను నియమించినా, ఎన్ని సిఫార్సులు చేసినా ఎన్నికల వ్యయాన్ని తగ్గించలేకపోతున్నారంటే, రాజకీయ పార్టీలకు అందే విరాళలను అదుపు చేయలేకపోతున్నారంటే రాజకీయ విరాళాల విషయంలో ఏదో నడవనివ్వండి అన్న ధోరణి ఉందనే అర్థం. ఎన్నికల కమిషన్, ఎన్నికల బాండ్లపై 2019 ఏప్రిల్ 12న తీర్పు చెప్పిన సుప్రీంకోర్టులాంటి వ్యవస్థలు కానీ విరాళాలిచ్చే కొద్ది మంది గురించి ఆలోచిస్తున్నాయి తప్ప 85 కోట్ల మంది ఓటర్ల ప్రయోజనాలు పరిరక్షించాలని అనుకోవడం లేదు అని రుజువు అవుతోంది. రాజకీయ పార్టీలకు విరాళాలిస్తున్న వారికి మధ్య సంబంధం ఏమిటి అని ఆలోచిస్తేనే రాజ్య వ్యవస్థ విధానాలలో ఓటర్లు కేంద్ర స్థానంలో ఉంటారు. ఒకరి మీద మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారే తప్ప ఎన్నికల వ్యయం అంటే ఏమిటో కచ్చితంగా నిర్వచించడం లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లేనప్పుడు రాజకీయ పార్టీల, నాయకుల నడవడికపై ఎలాంటి నిఘా లేదు. ఎన్నికల వ్యవస్థలో ఇలాంటి అవకాశాలు ఉంటేనే ఎన్నికల సంస్కరణలవల్ల ప్రయోజనం ఉంటుంది.