ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఎన్నికల ప్రణాళికల రాజకీయాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చాలా జాతీయ పార్టీలు, తమ ప్రాంతంలో పలుకుబడి ఉన్న పార్టీలు ఎన్నికల ప్రణాళికలు విడుదల చేశాయి. ఈ ప్రణాళికల్లో చర్విత చర్వణంగా మునుపటి వాగ్దానాలే ఉన్నందువల్ల వీటిని ప్రజలు కేవలం ఓ తంతుగా భావించి ఊరుకుంటారు. కానీ ఎన్నికల ప్రణాళికలు రాజకీయ పార్టీల మీద ఒక అంచనాకు రావడానికి, వాటి సైద్ధాంతిక ప్రాధాన్యతలేమిటో తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి. మునుపటి ఎన్నికలలో చేసిన వాగ్దానాలను ఏ మేరకు అమలు చేశారో బేరీజు వేయడానికీ ఉపకరిస్తాయి. వాగ్దానాలను నెరవేర్చడం లేదా వమ్ము చేయడం, పార్టీల నిబద్ధత ఏమిటో తెలుసుకోవడానికి ఉపయోగపడ్తాయి. (అయితే మీడియాలో ఒక ప్రధాన వర్గం ప్రతిపక్షాల ఎన్నికల ప్రణాళికలను నిశితంగా విమర్శిస్తున్నాయి తప్ప అయిదేళ్ల నుంచి అధికారంలో ఉన్న పార్టీ ఏ వాగ్దానాలను నెరవేర్చిందో పట్టించుకోవడం లేదన్నది వేరే విషయం.) నిజానికి ఎన్నికల ప్రణాళికలను ఈ దృష్టితో మాత్రమే చూడడం రాజకీయ పార్టీలను రాజకీయ రహిత దృష్టితో చూడడమే అవుతుంది. రాజకీయ పార్టీలు కేవలం వాగ్దానాలు నెరవేర్చడానికే పరిమితమైన యంత్రాంగాలు కావు. ఎన్నికల ప్రణాళికల రాజకీయాలు ఆచరణీయమైన వాగ్దానాలకు అతీతమైనవిగా కూడా ఉంటాయి. లేదా వాగ్దానాలు ఏ మేరకు ఆచరణీయమో అంచనా వేయడానికీ పనికొస్తాయి. ఎందుకంటే ఎన్నికల ప్రణాళికల్లో ప్రచారంతో పాటు ఆ రాజకీయ పార్టీ సైద్ధాంతికత ఏమిటో కూడా తెలుస్తుంది. ఆచరణీయమైన నినాదాల ఆధారంగా మాత్రమే రాజకీయ పార్టీలను అంచనా వేయకూడదు. అవి చేసే ప్రచారం, సిద్ధాంతాలు ఏమిటో కూడా బేరీజు వేయాలి. ఈ విషయంలో ప్రధాన పార్టీలు ఏం చుప్తున్నాయి?

భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికకు అంత ప్రాధాన్యం ఇవ్వదు. ఎందుకంటే 2014 ఎన్నికల సందర్భంగా మొదటి దశ పోలింగ్ ముగిసిన తరవాత బీజేపీ ప్రణాళిక విడుదలైంది. ఈ సారి కూడా కాంగ్రెస్ ప్రణాళిక విడుదల చేసింది కనక తామూ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయాలని బీజేపీ భావించినట్టుగా ఉంది. అయినప్పటికి బీజేపీ ప్రణాళికలో సంఘ్ పరివార్ ఎజెండా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అభివృద్ధి గురించి ఏం చెప్పినా ఎన్నికల ప్రచారంలో బీజేపీ జనాన్ని విడదీసే వైఖరి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ సారి బీజేపీ ఎన్నికల ప్రణాళికలో మొదట ప్రస్తావించిన అంశం జాతీయ భద్రతే తప్ప అభివృద్ధి కాదు. జాతీయ పౌరుల నమోదు (సవరణ) బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, 370వ అధికరణాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన తీరు చూస్తే బీజేపీకి జాతి, జాతీయత మీద ఉన్న అభిప్రాయం ఏమిటో స్పష్టం అవుతోంది. అభివృద్ధి అంశాన్ని చూసినా ఉపాధి కల్పన గురించి అసలు విషయం చెప్పకుండా దాటవేసి వ్యాపార సామర్థ్యం గురించి మాట్లాడడం తక్షణ సమస్య నుంచి తప్పించుకోవడమే. మహిళల సాధికారికత గురించి ఎంత చెప్పినా అందులో సమాన పనికి సమాన వేతనం, స్త్రీ-పురుష సమానత్వం అన్న అంశాలు లేనే లేవు. బీజేపీ చెప్పే స్త్రీ-పురుష సమానత్వం ముస్లిం మహిళలకే పరిమితం. మహిళల సమానత్వం గురించి బీజేపీ ప్రణాళికలో కడివెడు మొసలి కన్నీళ్లు కార్చడం కనిపిస్తుంది కాని "గౌరవప్రదమైన అభివృద్ధి" గురించి ఒక్క పంక్తి మాత్రమే ఉంది. జాతి అంటే బీజేపీ దృష్టి  అదేనన్న మాట. రామ మందిరం, శబరిమల గురించిన ప్రస్తావనలో కూడా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ వైఖరి ఎంత ప్రమాదకరమైందో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. "విశ్వాసాలు, నమ్మకాలకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి కృషి చేస్తాం" అని ఈ ప్రణాళికలో చెప్పారు. ఇది కచ్చితంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలివ్వడమే.

బీజేపీ ప్రణాళికలో జాతి భద్రతకు ప్రథమ తాంబూలం ఇస్తే కాంగ్రెస్ ప్రణాళికలో ఉపాధికి పెద్ద పీట వేశారు. అంటే కాంగ్రెస్ జీవితాలకు, జీవనోపాధికి ప్రాధాన్యత ఇచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక నయా ఉదారవాద విధానాల పరిధి దాటకపోయినా కనీస ఆదాయ హామీ, వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ అన్న అంశాలు ప్రజాస్వామ్యంలో ప్రస్తావనకు వచ్చే అంశాలను పట్టించుకున్నట్టుగా కనిపిస్తోంది. మూక దాడుల గురించి, నైతిక పోలీసు పాత్ర గురించి ప్రస్తావించడం అంటే అంతర్గత భద్రతను పరిగణించినట్టే. అంత మాత్రం చేత దీన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడకూడదు, బహుళత్వానికి ఎదురయ్యే తీవ్ర ప్రమాద దృష్టితో చూడాలి. ఈ విషయంలో నిబద్ధత కాకపోయినా అలాంటి వ్యక్తీకరణలోనే పౌర హక్కుల విషయంలో బీజేపీకి, కాంగ్రెస్ కు మధ్య ఉన్న అంతరం ఏమిటో అర్థం అవుతుంది. దేశద్రోహ చట్టాన్ని, నేరపూరిత పరువు నష్టం చట్టాన్ని రద్దు చేస్తామని, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పునః పరిశీలిస్తామని కాంగ్రెస్ చెప్పడం అంటే భారత్ ను సైనిక శిబిరంగా ఉండే దేశంగా మార్చబోమన్న సంకల్పం కాంగ్రెస్ ప్రదర్శించింది. ఎన్నికల ప్రచార క్రమంలో కాంగ్రెస్ కనక జాతి అన్న మాటను ఏదో నైరూప్య వ్యక్తీకరణగా కాకుండా సజీవ ప్రజానీకంగా పరిగణిస్తే ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఒక రాజకీయ ఉపకరణంగా పని చేస్తుంది.

ప్రత్యామ్నాయ సామాజిక-ఆర్థిక పథం అనుసరిస్తామని చెప్పినందువల్ల కమ్యూనిస్టు పార్టీల ఎన్నికల ప్రణాళికలు విశిష్టంగా కనిపిస్తున్నాయి. పైగా ఈ ప్రణాళికలు నేరుగా సంఘ్ పరివార్ ను సవాలు చేస్తున్నాయి. ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీల విజయాలు తగ్గి ఉండవచ్చు. కానీ ఆ పార్టీల ప్రణాళికల్లో చెప్పిన అంశాలు ఎంత ఆచరణీయమైనవి అని కాకుండా ప్రజోద్యమాలకు ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలి. కమ్యూనిస్టు పార్టీలు నిర్మించిన ప్రజోద్యమాల ఒత్తిడివల్లే కాంగ్రెస్ పార్టీలాంటివి ఈ డిమాండ్లను అంగీకరించవలసి వచ్చిందన్నది చారిత్రక వాస్తవం. జాతీయ పట్టణ ఉపాధికి హామీ అని సి.పి.ఐ.(ఎం) ప్రణాళికలో, అత్యంత ధనికులైన వారి మీద అదనపు పన్ను విధిస్తామని సమాజ్ వాదీ పార్టీ ప్రణాళికలో ప్రతిపాదించడం గమనించదగింది.

రాజకీయ పార్టీలే కాకుండా సఫాయి కర్మచారి ఆందోళన్ సంస్థ కూడా ఓ ప్రణాళిక విడుదల చేసింది. ఈ ప్రణాళికలో జీవించే హక్కు రాజకీయ వ్యవస్థకు చేసిన నైతిక విజ్ఞప్తిలా ఉంది. కుహనా జాతీయతా వాదంలాంటివి కాకుండా మనవ గౌరవనానికి ప్రాధాన్యత ఉంటేనే ఎన్నికల ప్రణాళికలు అర్థవంతంగా ఉంటాయి.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top