ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఓటర్ల భావోద్వేగాలతో చెలగాటం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఈ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపి ఓటర్ల మద్దతు సంపాదించాలనుకుంటున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు నైతిక విలువ ఉండవచ్చు కానీ అధికారంలో ఉన్న పార్టీ వైఫల్యాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు. అవి అందరికీ స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో పస ఉన్నందువల్ల అవి భావోద్వేగాలను ఆశ్రయించవలసిన అగత్యం లేదు. బీజేపీ, దాని మిత్రపక్షాల ప్రచారం ఎక్కువగా భావోద్వేగాలను రెచ్చగొట్టడం మీదే సాగుతోంది. 2014 ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చి ఉంటే బీజపీ భావోద్వేగాల మీద ఆధారపడవలసిన అగత్యం ఉండేది కాదు. వైఫల్యాల కారణంగా ఎదురైన ఇబ్బందుల్ని నివారించడానికి బీజేపీ భావోద్వేగాలనే ఆశ్రయించక తప్పని పరిస్థితిలో ఉంది. ఓటర్లు హేతు బద్ధంగా ఆలోచించకుండా భావోద్వేగాలను రెచ్చగొడ్తోంది. బీజేపీ ఎన్నికల ప్రచారం అంతా జగడాలు పెట్టుకునే జాతీయతావాదం చుట్టే తిరుగుతోంది. తాము మాత్రమే జాతీయతావాదులం అని చెప్పుకుంటోంది. ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలలో బీజేపీ పరిస్థితి బాగుందని చెప్పడంతో బీజేపీలో మితిమీరిన ఆత్మవిశ్వాసం కనిపించింది. వాస్తవం అలా లేదని ఆ పార్టీ గ్రహించినందువల్ల విధి లేక ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కూడా లెక్క చేయకుండా భావోద్వేగాలను రెచ్చగొడ్తోంది. ఎలెక్ట్రానిక్ మీడియాను, సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ఓటర్లను తమ వేపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. ముద్రణా మాధ్యమంలో ఎన్నికల ప్రచార వ్యాపార ప్రకటనలను గుప్పిస్తోంది.

అయితే ప్రచార వనరులను ఎంతగా వినియోగించుకున్నా, ఆ పార్టీ నాయకుడు ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఎంత గట్టిగా మాట్లాడుతున్నా ప్రజలు పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఏది సుగుణమో, ఏది దుర్గుణమో, ఏది చిత్తశుద్ధో ఏది కుటిల ప్రచారమో తెలుసుకోగలిగిన హేతువాద వైఖరి ఓటర్లకు ఉంటుంది. అందుకని ఈ ప్రచారం కేవలం ఆర్భాటమేనని హేతుబద్ధత లేదని జనం గ్రహిస్తున్నారని ఇటీవలే రుజువైంది. అధికార పక్ష విద్వేష పూరిత ప్రచారంవల్ల ప్రభుత్వ ప్రజాస్వామ్య లక్షణం అసలు రంగు ఏమిటో బయట పడ్తోంది. మళ్లీ ఆ పార్టీకే అధికారం అప్పగిస్తే ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. ప్రతిపక్షాల మీద వ్యతిరేకత పెంచడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. దీని వెనక కుటిలత్వమే ఉంది. హేతుబద్ధత శూన్యం. ఓటు వేయవలసిన సమయం దగ్గర పడ్తున్న కొద్దీ ఈ ప్రచారం మరింత పెరుగుతుందని గతాన్ని చూసినా అర్థం అవుతుంది. బీజేపీ భావోద్వేగాలను రెచ్చగొడ్తున్న వైనం చూస్తే అసలు ఓటర్లంటే ఆ పార్టీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఓటర్ల అభిప్రాయం ఏమిటీ అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఓటర్లు ఈ పరిస్థితిని ఆమోదించవలసిన అవసరం ఏమిటి?

ఓటర్లకు ప్రధానమైన అంశాలేమిటో బీజేపీయే నిర్ణయిస్తోంది. బీజేపీకి ప్రాధాన్యం ఉన్న అంశాలు ఓటర్లకు ప్రాధానమైనవి కానక్కర్లేదు. ఇది ఓటర్ల విజ్ఞతను కించపరచడమే. బీజేపీ ఇలాంటి ప్రచారం కొనసాగించడంవల్ల విజ్ఞులైన ఓటర్ల విజ్ఞతా తగ్గుతుంది. తమకు మంచేదో, చెడేదో నిర్ణయించుకోలేని స్థితికి చేరుకుంటారు. బీజేపీ ఏలుబడిలో అనుసరించిన విధానాలే తాము అనుభవించిన కష్టాలకు, తమ జీవితం దుర్భరం కావడానికి కారణం అన్న వాస్తవ పరిస్థితిని ఓటర్లు గ్రహించలేరనుకోవడం పొరపాటు.

ఓటర్లకు హేతుబద్ధత ఉండదు అనుకునే పార్టీ మాత్రమే తమ వైఫల్యాలను గమనించకుండా తమకు మద్దతిస్తారని అనుకోగలుగుతుంది. ఈ స్థితిలో ఓటర్లు హేతుబద్ధంగా ఆలోచించాలి. నైతిక దృక్పథం ప్రదర్శించాలి. చేసిన వాగ్దానాలను నెరవేర్చని పార్టీకి మరో సారి అవకాశం ఇవ్వడం దండగ అనుకోగలగాలి. గతంలో ఓటర్లు ఈ పని చేశారు. ఇప్పుడూ అదే విజ్ఞత చూపాలి. వాగ్దానాలను నెరవేర్చే పక్షానికే మద్దతిస్తామని, వైఫల్యాలకు క్షమాపణ చెప్పాలని కూడా ఓటర్లు నిలదీయాలి.

ప్రతి పార్టీని నిశితంగా పరిశీలించడం ఓటర్ల ఉమ్మడి బాధ్యత. అధికారంలో ఉన్న పార్టీ నడవడికను నిరంతరం పరిశీలించాలి తప్ప అయిదేళ్లకు ఒక సారి మాత్రమే కాదు.

విఫలమైన పార్టీకి మరో అవకాశం ఇవ్వడానికి పేదల అవసరాలు అవకాశం ఇవ్వవు. వైఫల్యాలకు సంజాయిషీ ఇచ్చుకోని పార్టీ విషయంలో ఇది అసలే కుదరదు. మరో సారి అవకాశం ఇచ్చి చూద్దాం అని ఓటర్లు అనుకుంటే ఓటర్లు హేతుబద్ధంగా ఆలోచించనట్టు అవుతుంది. అంతే కాక అది ఆత్మ వంచన కూడా.

మార్కెట్ తమ పరిస్థితిని ఏ మాత్రం మెరుగుపరచలేదు కనక అణగారిన వర్గాల వారు తమ ప్రయోజనం ఏమిటో అంచనా వేయాలి. కులం, మతం, భాష ఆధారంగా నిర్ణయం తీసుకుని ఓటు వేస్తే తమ బతుకు మరింత దుర్భరం అవుతుందని ఈ వర్గాల వారు గ్రహించడంలోనే విజ్ఞత ఉంది. సంకుచిత రాజకీయాలకు పాల్పడే పక్షాలు చిత్త శుద్ధిగల, తమ గోడు పట్టించుకునే ప్రభుత్వాన్ని అందించలేవని ఓటర్లు తెలుసుకోవలసిన తరుణం ఇది. చిత్త శుద్ధితో ఆలోచించి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటేనే ప్రజల బాధలు పట్టించుకునే ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం వస్తుంది. వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనం ఉమ్మడి శ్రేయస్సుకూ దారి తీస్తుంది. ఇదే ప్రజాస్వామ్యానికి వెన్నెముక.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top