ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

బీజేపీ మార్కు "జాతీయ సమైక్యత"

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీని సమర్థిస్తున్న పార్టీలు తమదైన జాతీయతావాదం గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం ఆశ్చర్యకరం కాదు. పుల్వామా దాడి జరిగే దాకా ఈ జాతీయతావాదం సైనికీకరణ, జగడాలమారితనంగా ఉండేది. బీజేపీ జాతీయతావాద రాజకీయాలు అసమ్మతి వ్యక్తం చేసే వారిని శత్రువులుగా పరిగణిస్తుంది. అసమ్మతిని, "శత్రు దేశాన్ని" అంటే పాకిస్తాన్ ను ఒకే గాట కట్టి చూపడానికి ప్రయత్నిస్తుంది. ఈ జగడాలమాల ధోరణిని కొన్ని టీవీ చానళ్లు, కొన్ని పత్రికలు కూడా అనుసరించి దాడి, ప్రతీకార దాడి అన్న మాటలను ప్రచారంలో పెట్టాయి. పెద్ద దాడి అని దాకా వెళ్లాయి. ఓ ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ఒక క్షిపణిని ప్రయోగించిన విషయాన్ని ప్రధానమంత్రి నాటకీయంగా ప్రకటించడం ఈ సైనికీకరణ భాషలో భాగమే. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ భాష ఉపయోగించడం మరీ మితిమీరింది. ఈది అనైతికం కూడా. అనేకమంది బీజేపీ నాయకులు "మీరు కనక బీజేపీకి ఓటు వేయకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారిని సమర్థించినట్టే" అంటున్నారు. అయితే బీజేపీ అంతర్గతంగా కాంగ్రెస్ ను శత్రువుగా చూపడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోని కొన్ని అంశాలను బీజేపీ అధికార ప్రతినిధి తూర్పారబట్టిన తీరే దీనికి నిదర్శనం. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోని అంశాలు జాతి వ్యతిరేకమైనవి అని ఆ అధికార ప్రతినిధి చెప్పారు. నిజానికి బీజేపీ తాను చెప్తున్న జాతీయతావాదాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో అసమ్మతి వ్యక్తం చేసే వారి నోళ్లు మూయించడానికి వినియోగించుకుంది. ఇంకొన్ని సార్లు బీజేపీ ప్రభుత్వం జాతీయతావాదాన్ని పాకిస్తాన్ తో కయ్యాన్ని రెచ్చగొట్టడానికే ఉపయోగించింది. కానీ ఎన్నికల సమయంలో పాకిస్తాన్ మీద విమర్శగా చిత్రిస్తోంది. బీజేపీ ఎన్నికల ప్రచారంలో మూడు అంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకటి: ఓట్లు సంపాదించడానికి బీజేపీ జాతి సమైక్యతను భావోద్వేగానికి సంబంధించిన అంశంగా మారుస్తోంది. ఓటర్ల మద్దతు పొందడానికి హేతుబద్ధమైన రీతిలో ఎందుకు ప్రయత్నించడం లేదు? రెండు: ఓటర్లు ఉహాత్మకమైన జాతీయతావాదాన్ని ప్రధానాంశంగా పరిగణించాలని, అణగారిన వర్గాల వారు సదరు జాతీయవాదుల దయాదాక్షిణ్యాల మీద కాకుండా మామూలుగా ఇతరులతో సహజీవనం చేయగలరని ఎందుకు భావించడం లేదు? చివరగా ఓటర్లు తమ ప్రయోజనాలను విడనాడతారా? హేతుబద్ధంగా ఆలోచించే వారు జాతి అంటే నైరూప్య అంశం కాదని ఆలోచించరా? ఇప్పుడు తాము ఎదుర్కుంటున్న సమస్యలన్నింటికీ బీజేపీ పాలనే కారణమని ఆలోచించరా?

2019 ఎన్నికలలో బీజేపీ, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.) కయ్యానికి కాలు దువ్వే జాతీయతావాదాన్ని విపరీతంగా వాడేసింది. తమ నాయకులపట్ల సానుభూతి సంపాదించడానికి ఈ పని చేశారు. "హిందువులు గాయపడ్డారు" అని ప్రచారం చేశారు. 2014 ఎన్నికలలో వాగ్దానం చేసిన జనధన్ కింద బ్యాంకు ఖాతాలున్న వారందరి ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని, కోట్లాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తామని మళ్లీ వాగ్దానం చేస్తే జనం నమ్మరు కనక జాతీయతావాద పల్లవి ఎత్తుకుంది. పాత వాగ్దానాలే బీజేపీ విడుదల చేయబోయే ఉన్న ప్రణాళికలో చేరిస్తే జనం నమ్మరు. అవే వాగ్దానాలు చేస్తే అవి హాస్యాస్పదం అవుతాయి. ఏ రాజకీయ పార్టీ చేసే వాగ్దానమైనా అందులో నైతికత ఉండాలి. ఉపాధి కల్పనవంటి కీలకాంశాలలో బీజేపీ వైఫల్యం మరీ పక్షపాత దృష్టి అనుసరించక తప్పని పరిస్థితికి దారి తీసింది. "జాతి సమైక్యత" కాపాడే తమకే ఓటు వేయాలని చెప్తోంది. నిజానికి బీజేపీ చెప్పే జాతీయతావాదంలో విశాల దృక్పథం పూజ్యం. బీజేపీ జాతీయతావాదంలో జాతికి, పౌరులకు మధ్య సంబంధమే లేదు. సమాజాన్ని విడదీసే మూక దాడులు, స్వేచ్ఛ లేకపోవడం, భయం, ఆందోళననే బీజేపీ కొనసాగిస్తోంది. పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.), అమలు చేయని వాగ్దానాలు, ఉపాధి కల్పనలో నెరవేర్చని వాగ్దానాలు, దళితుల మీద కుల విద్వేష దాడులు, మైనారిటీ వర్గాల మీద మూక దాడులు మొదలైన వాటిని ఓటు వేసేటప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారు.

ఇలాంటి ఓటర్లు ఎన్.డి.ఎ. ప్రచారం చేస్తున్న భావోద్వేగాల చట్రంలో ఇమడరు. వారి భావోద్వేగాలు భిన్నంగా ఉండవచ్చు. అయితే వారికీ దేశ వ్యవహారాల్లో పాత్ర ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి తమ జీవితం సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వం ఉపాధి కల్పనకు పూచీ పడాలని, నిర్వాసితులం కాకుండా ఉండాలని, తమ మీద మూక దాడి జరగదన్న భరోసా ఉండాలని, కుల వివక్ష ఆధారంగా జరిగే దాడుల నుంచి రక్షణ ఉండాలని ఆశిస్తారు. సామాజికంగా ఈ వ్యవహారాలను పట్టించుకుని, మానవీయ కోణంతో వ్యవహరించే ప్రభుత్వం బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని ఆధరిస్తుంది.

అధికారంలోకి రావాలనుకునే ఏ పార్టీ అయినా విచ్ఛిన్నకర శక్తులనుంచి రక్షణ కలిగించాలి. ప్రజల్లో ఇలాంటి ధొరణులు ప్రబలకుండా చూడాలి. జాతీయ సమగ్రత అంటె ఇదే. పాక్షికమైంది కాదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top