హిందుత్వకు అంటకాగుతున్న ఎన్.ఐ.ఎ.
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
హర్యానాలోని పానీపత్ దగ్గర 2007లో సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో బాంబు పేలి 68 మంది మృతికి దారి తీసిన కేసులో నిందితులందరినీ విడుదల చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఈ పేలుడులో మరణించిన వారిలో 44 మంది పాకిస్తానీయులే. ఇది "చరిత్రాత్మకమైన" తీర్పు అని భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది న్యాయానికి విఘాతం కలిగించడం అని పాకిస్తాన్ నిందించింది. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) వ్యవహార సరళి ఆందోళన కలిగిస్తోంది. ఆ సంస్థ విశ్వసీనీయత అనుమానాస్పదంగా మారింది. ఎన్.ఐ.ఎ. పై న్యాయస్థానం వ్యాఖ్యలు దర్యాప్తు లోపాన్ని ఎత్తి చూపాయి. ఇంతటి దారుణమైన సంఘటనలో ప్రాసిక్యూషన్ చూపిన సాక్ష్యాధారాలలో "తీవ్రమైన లోపాలు" ఉన్నాయి అని ఎన్.ఐ.ఎ. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అనుమతించదగిన సాక్ష్యాలు లేనందువల్ల నిందితులను విడుదల చేయవలసి వస్తుందని ఆ న్యాయమూర్తి అన్నారు. తీర్పులో ఆ న్యాయమూర్తి తన వ్యఖ్యలనూ చేర్చారు.
సరైన సాక్ష్యాలు లేనందువల్ల న్యాయస్థానం విడుదల చేసిన నలుగురిలో నవ కుమార్ సర్కార్ అనే స్వామీ అసీమానంద్ కూడా ఉన్నారు. ఆయనను 2018లో కూడా 2007 అక్టోబర్ లో అజ్మీర్ పేలుళ్ల కేసులో ఎన్.ఐ.ఎ. ప్రత్యేక కోర్టు ఇదే కారణంగా విడుదల చేసింది. అలాగే 2007 మేలో హైదరాబాద్ లోని మక్కా మసీదు పేలుళ్లలో తొమ్మిది మంది మరణించిన కేసులోనూ ఆయన సాక్ష్యాలు లేనందువల్ల విడుదలయ్యారు. ఈ రెండు కేసులను దర్యాప్తు చేసింది కూడా ఎన్.ఐ.ఎ. నే. మక్కా మసీదు పేలుళ్ల కేసులో హైదరాబాద్ పోలీసులు మొదట కొంత మంది ముస్లింలను అరెస్టు చేశారు. వారిని తరవాత విడుదల చేశారు. అయితే వారు నిర్బంధంలో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారు. 2006నాటి మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో కూడా నిందితులు శిక్ష తప్పించుకున్నారు. కానీ ఆ కేసులో దర్యాప్తు చేసింది ఎన్.ఐ.ఎ. కాదు.
దేశంలో చట్టాలు అమలు చేసే భద్రతా వ్యవస్థలకు ముస్లింల మీద విశ్వాసం లేదు అని మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రగతి శీల మీడియా సంస్థలు ఎప్పటి నుంచో వాదిస్తూనే ఉన్నాయి. 1992 డిసెంబర్ ఆరున బాబరీ మసీదు విధ్వంసం తరవాత 1992-93లో జరిగిన బొంబాయి పేలుళ్లపై దర్యాప్తు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో ముస్లింలను పిశాచాల్లాగా చిత్రిస్తున్నారు. ఏకపక్షంగా వారి మీద నిరాధార ఆరోపణలు మోపుతున్నారు.
దీనివల్ల కలిగే పెద్ద నష్టం ఏమిటంటే ప్రజలకు సత్యం ఏమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది. సంఝౌతా ఎక్స్ ప్రెస్ కేసులోనూ అలాగే జరిగింది. 68 మందిని బలిగొన్న ఆ పేలుడులో రైలులో బాంబు పెట్టింది ఎవరు? భారత పాకిస్తాన్ దేశాల మధ్య సామరస్యం ఉండకూడదని ప్రయత్నించిన వారు ఎవరు? ఈ రెండు దేశాల మధ్య శాశ్వతంగా శత్రుత్వం ఉండాలనుకుంటున్నదెవరు? సంఝౌతా ఎక్స్ ప్రెస్ అని ఆ రైలుకు పేరు పెట్టడంలోనే రెండు దేశాల ప్రజల మధ్య సుహృద్భావం ఉండాలన్న ఆలోచన ఉంది. కానీ ఆ రైలులో పేలుడు ఈ సుహృద్భావ వాతావరణానికి భంగం కలిగించడమే కాక అపారమైన విషాదం మిగిల్చింది. ఈ కేసులో జరిగిన దర్యాప్తు, ఆ దర్యాప్తు ఆధారంగా వెలువడిన తీర్పు బాధితులకు ఏ రకంగానూ ఊరట కలిగించలదు. పైగా "భారత న్యాయస్థానాలపై విశ్వాసం లేదు" అని పాకిస్తాన్ ఆరోపించడానికి అవకాశం కలిగింది. తమ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు అని పాకిస్తాన్ వాదించడానికి అవకాశం కలిగింది.
హిందుత్వ తీవ్ర వాదులకు సంబంధించిన కేసుల్లో ఎన్.ఐ.ఎ. గత కొద్ది సంవత్సరాలుగా చూసి చూడనట్టు ఉంటోంది అన్న అభిప్రాయం మన దేశంలోనూ బలంగానే ఉంది. దర్యాప్తుకు సంబంధించిన లోపాలపై న్యాయమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ అనుమానాలను మరింత బలపరిచేవిగా ఉన్నాయి. ఎన్.ఐ.ఎ. తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరించాలి. 12 ఏళ్ల కింద జరిగిన సంఝౌత ఎక్స్ ప్రెస్ కేసులో మొత్తం 224 మంది సాక్షులు ఉంటే 51 మంది మాట మార్చారు. ఒక ప్రధాన నిందితుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్ కు) నాయకత్వం వహించిన హర్యానా పోలీసు అధికారి హిందూ తీవ్రవాదులకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయి అని చెప్పారు. న్యాయస్థానం నలుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చడంపై కోర్టులో అప్పీలు చేయబోవడం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటించడాన్నీ గమనించాలి.
ప్రభుత్వం ఈ విషయంలో తదుపరి చర్య తీసుకోబోవడం లేదు అంటే గోధ్రా రైలు పెట్టె దగ్ధం కేసులో ముస్లింల విషయంలోనే ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది అనుకోవలసి వస్తుంది. 1992-93 ముంబై పేలుళ్ల కేసులో కూడా పోలీసులు, హిందువులపై కూడా ఇలాంటి మెతక వైఖరే అనుసరించారు. ఆ కేసులో కూడా ప్రధానంగా ముస్లింలనే నిందితులుగా నిలబెట్టారు.
ఎన్.ఐ.ఎ. ఉదాత్తమైన ఆశయాలతో ఏర్పాటైన సంస్థ. "దేశ పౌరుల విశ్వాసం సంపాదించడం కోసం నిస్వార్థంగా, నిర్భయంగా దర్యాప్తు చేయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశాం" అని చెప్పుకున్నారు. ఎన్.ఐ.ఎ. మీద విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి.