ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

డిజిటల్ ప్రచారంపై లోపించిన నిఘా

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

రానున్న లోకసభ ఎన్నికలకు అన్ని పార్టీలు డిజిటల్ ప్రచారాన్ని వినియోగించుకుంటున్నాయి. కొన్ని సార్లు సామాజిక మాధ్యమం, మొబైల్ ఆప్ లను, ఆన్ లైన్ చర్చా వేదికలను, మూకుమ్మడిగా మొబైల్ ద్వారా సందేశాలను పంపే సదుపాయాలను దుర్వినియోగం కూడా చేస్తున్నాయి.

గత వారం సామాజిక మాధ్యమ వేదికలు, భారత అంతర్జాలం, మొబైల్ సంఘం ఎన్నికల సంఘాన్ని సంప్రదించి "స్వచ్ఛంద నైతిక నియమావళి"ని విడుదల చేశాయి. ఈ నియమావళి ఆధారంగా ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్లాంటి మాధ్యమాలు ఎన్నికలకు సంబంధించిన అంశాలను, డబ్బిచ్చి వేయించుకునే ప్రకటనలను ఎన్నికల కమిషన్ మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా ఉంటే నిఘా వేసి ఉంచుతాయి.

గత దశాబ్ద కాలంలో సామాజిక మాధ్యమాలు కేవలం నెట్వర్కింగ్ పరికరంగా కాకుండా పౌరులతో సంభాషించడానికి, వారిని సాధికారుల్ని చేయడానికి, విజ్ఞానవంతులను చేయడానికి, ప్రజాస్వామ్య ప్రక్రియను మార్చడానికి కూడా ఉపకరిస్తున్నాయి. కేంబ్రిడ్జ్ అనలిటికా బయటపెట్టిన అంశాలనుబట్టి చూస్తే కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనానికి వినియోగించుకుంటున్నట్టు తేలింది. మన దేశంలో సమాచారాన్ని వినియోగించుకుంటున్న తీరులో ప్రమాదకరమైన విషయాలు, బూటకపు వార్తలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని వెబ్ సైట్లు "వార్తా విభాగాలుగా" కూడా చెలామణి అవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు సాధికారికతకు ఎంత ఉపకరించినా అవి అసమానమైన వేదికలుగా కూడా ఉంటున్నాయి. డబ్బు, అధికారం ఉపయోగించి వీటిని దుర్వినియోగం కూడా చేస్తున్నారు.

2018 ఆగస్టులో ఎన్నికల కమిషన్ వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం విపరీతంగా ఉండకుండా చూడాలన్న అంశం కూడా చర్చకు వచ్చింది. ఎన్నికలలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోంది కనక జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మధ్య వ్యత్యాసం ఉండకూడదని కూడా అనుకున్నారు. ఈ సమావేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇటీవలి కాలంలో బీజేపీ ఫేస్ బుక్ లాంటి వేదికల ద్వారా అపారంగా ఖర్చు పెడ్తోంది. "భారత్ కె మన్ కీ బాత్", "నేషన్ విత్ నమో" లాంటి ఫేస్ బుక్ పేజీల ద్వారా బోలెడు డబ్బు ఖర్చు పెడ్తోంది. ఈ విషయంలో బీజేపీ మిగగతా పార్టీలకన్నా ఎక్కువ ఖర్చు చేస్తోంది. 2019 ఫిబ్రవరిలో బీజేపీ, దాని అనుబంధ పేజీల ద్వారా రూ. 2.37 కోట్లు ఖర్చు పెట్టినట్టు తేలింది. ఆ నెలలో ఖర్చు పెట్టిన మొత్తంలో బీజేపీ పెట్టిన ఖర్చే 50 శాతం కన్నా ఎక్కువ ఉంది. అదే నెలలో ప్రాంతీయ పార్టీలన్ని కలిసి రూ. 19.8 లక్షలు వెచ్చిస్తే కాంగ్రెస్, దానికి సంబంధించిన ఫేస్ బుక్ పేజీలకోసం రూ. 10.6 లక్షలు ఖర్చు పెట్టారు. సామాజిక మాధ్యమాల ద్వారా పెట్టే ఖర్చులో ఎక్కువ భాగం ప్రభావితం చేసే మార్కెటింగ్ కోసమే ఖర్చు పెడ్తారు. వీటిలో ఎక్కువ ప్రచారం నగదు చెల్లించడం ద్వారా సాగుతుంది కనక ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చడం కష్టం. రాజకీయ పార్టీల తరఫున వ్యక్తులు ఎంత ఖర్చు చేస్తున్నారో అంచనా వేయడమూ కష్టమే. వాట్స్ ఆప్ వంటి వాటి ద్వారా రాజకీయ వ్యాపార ప్రకటనలు చెలామణి కావడంవల్ల ఈ ఖర్చుపై నిఘా వేసి ఉంచడం మరింత కష్ట సాధ్యం అవుతుంది.

ఈ సందర్భంలో ఎన్నికల కమిషన్ పాత్రను ప్రశ్నించక తప్పదు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నట్టు 2013 అక్టోబర్ లోనే ఎన్నికల కమిషన్ గుర్తించింది. అంటే 2014 లోకసభ ఎన్నికలలు ముందే గుర్తించింది. "ఎలక్ట్రానిక్ పద్ధతిలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారానికి ఎన్నికల కమిషన్ సూచనలు" జారీ చేసింది. అయితే ఈ సూచనలు కేవలం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, మీడియా, ఎన్నికల పరిశీలకులకు మాత్రమే పరిమితం చేసింది. ఆ తరవాత అనేక రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. ఈ సూచనలను ఆ తరవాత మార్చిన దాఖలాలు లేవు. సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి ఎలా వినియోగించాలన్న విషయంలో అదనపు సూచనలు ఏమీ లేవు. అభ్యర్థులు, పార్టీలు ఇతరులు ఎలా వినియోగించాలో భారీ మొత్తం ఖర్చు పెట్టకుండా ఎలా నిరోధిస్తారో ఎలాంటి సూచనలూ లేవు.

ఇటీవల విడుదల చేసిన స్వచ్ఛంద నైతిక నియమావళివల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఉన్నా అది చాలా స్వల్పమే. అది డబ్బిచ్చి వ్యాపార ప్రకటనలు పంపించడానికి సామాజిక మాధ్యమాలు, ఎన్నికల కమిషన్ మధ్య సంబంధం ఏమిటి, ఎలా పర్యవేక్షిస్తారు అన్న దానికే పరిమితం అయింది తప్ప వ్యాపార ప్రకటనలను ఎలా నియంత్రిస్తారో తెలియదు. వ్యాపార ప్రకటనలను ఈ మాధ్యమాలను నడిపే కంపెనీలు అంగీకరిస్తాయి కనక సామాజిక మాధ్యమాలను నడిపే కంపెనీలు కూడా ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాల్సిందే. ఇది అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, వారి మద్దతుదార్లు పెట్టే ఖర్చుకూ వర్తించాలి. 2013లో జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం రాజకీయ వ్యాపార ప్రకటనలు జారీ చేయడానికి ముందు ఎన్నికల కమిషన్ అనుమతి ఉండాలి అని పేర్కొన్నారు. అవి దాపరికం లేకుండా ఉండాలని, డబ్బు చెల్లించే పద్ధతికి ఓ విధానం ఉండాలని సూచించారు. ఈ సూత్రాలకు కట్టుబడి ఉండేట్టు చూడడానికి ఇప్పుడే చర్య తీసుకుంటున్నారు. అదీ స్వచ్ఛందంగానే. అంటే డిజిటల్ వేదికల గురించి ఎన్నికల కమిషన్ అలసత్వం ప్రదర్శిస్తోందని, కాలదోషం పట్టిన పద్దతులు అనుసరిస్తోందని రుజువు అవుతోంది. ఎన్నికల ప్రక్రియలో వీటి ప్రభావాన్ని పట్టించుకోవడం లేదు. అంటే ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతిలో ఎన్నికల ప్రచారానికి అందరికీ సమాన అవకాశాలు ఉండేట్టు చూడడంలో ఎన్నికల కమిషన్ విఫలమైంది.

డిజిటల్ రంగం భౌతిక రంగానికి, సామాజిక, రాజకీయ రంగాలకు భిన్నమైంది కాదు. ఇది విడిగా ఉంటుందని భావించడం వివేకవంతమైంది కాదు. డిజిటల్ వేదికలు, సాంకేతికత ప్రజాస్వామ్య ప్రక్రియను ఎలా ప్రభావితం చేస్తాయో గమనించడంలో విఫలమైనాం. ఎన్నికలు జరగడానికి ఒక నెల రోజుల ముందు స్వచ్ఛంద నియమావళిని ఆమోదించడంవల్ల ఒరిగేదేమీ ఉండదు. ఎన్నికల కమిషన్ ఇన్నేళ్లుగా సామాజిక మాధ్యమాలకు సంబంధించి విజ్ఞానంపై ఆధారపడి ఒక ఆదర్శప్రాయమైన విధానాన్ని రూపొందించి ఉండవలసింది. అప్పుడే త్వరితగతిన పెంపొందుతున్న ఈ విధానాన్ని పర్యవేక్షించడానికి అవకాశం ఉండేది. 2014లో సామాజిక మాధ్యమాలు, ఎన్నికల ప్రకరియ ఎలా ఉంటాయో గమనించి ఇప్పటి నుంచె చర్య తీసుకోవలసిన అవసరం ఉంది.

Back to Top