ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రజలపాత్ర లేని ప్రజాస్వామ్యం వ్యర్థం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

గౌరవప్రదంగా, సురక్షితంగా తమ జీవితాలు గడపాలనుకునే అణగారిన వర్గాల వారే దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అణగారిన వర్గాల వారు తమ బతుకు వెళ్లబుచ్చడానికి నిరసన ప్రదర్శనలు చేస్తారు. అసమ్మతి వ్యక్తం చేస్తారు. నిరసనలు నిజానికి ప్రజాస్వామ్యానికి సంకేతాలు. నిరసనల ద్వారా ప్రజలు పేదరికం, నిరుద్యోగం, గ్రామీణ సంక్షోభం, ఆందోళన, భయం, దిక్కుతోచనితనం నుంచి విముక్తం కావాలని కోరుకుంటారు. ఈ నిరసనలు ఎదుటివారికి నచ్చచెప్పడానికి, తమ వాదన వినిపించడానికి ఉపకరిస్తాయి. సామాన్య ప్రజల నిరసన పాఠ్య పుస్తాకాలలోంచో, ఇతర గ్రంథాల నుంచి రాకపోవచ్చు. కాని నిరసన సత్యం చెప్పడానికి ఉపకరిస్తుంది. అత్యవసరం కూడా. ఆ అవసరం ఎంతప్రమాదకరమైందైనా, ఎంత పనికి మాలిందైనా ఉపాధి సంపాదించడానికి, జీవితాన్నుంచి దూరం చేసేదైనా కావచ్చు. వాల్మీకి సమాజిక వర్గానికి చెందిన వారు మురికి కాలవల్లోకి దిగుతారు. ఆ పని చేయడం వారి నిస్సహాయతకు నిదర్శనం. వారు అలాంటి పని చేస్తున్నారంటే గౌరవప్రదమైన ఉపాధి దొరకనందువల్లే. కనీసం ఆ మాత్రం ఉపాధి అయినా లేకుండా పోతోందని వారి భయం. చాలా మంది ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని వలస పోతుంటారు.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పౌరులకు స్వేచ్ఛ ఉండేట్టు చూడడం ఆ ప్రభుత్వ విధి. ఆ స్వేచ్ఛ సంపూర్ణమైంది, వ్యధ లేనిది కాకపోవచ్చు. పౌరులకు స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పే ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్య నియమాలకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ వాదనల్లోనూ, పని చేసే తీరులోనూ ప్రజాస్వామ్య లక్షణం ఉండాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి హేతుబద్ధత ఉండాలి. వాదనలు వినిపించుకోవాలి. జనం వాదనలు వినిపించుకునే ప్రభుత్వానికి ప్రజల మద్దతు మరింతగా పొందే అవకాశం ఉంటుంది. ఓటర్ల దగ్గరకు వెళ్లేటప్పుడు వారి వాదన వినడం అత్యవసరం. కానీ ప్రభుత్వం తాను బ్రహ్మాండమైన "విజయం" సాధించామని, రక్షణ దళాలు సాధించిన విజయాలను తాము సాధించిన విజయాలుగా చెప్పుకోవడం తమ తప్పిదాలను, వాగ్దాన భంగాలను కప్పి పుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంగానే మిగిలిపోతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వాదనలనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. గత అయిదేళ్ల కాలంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం వాదనలను వినిపించుకోకుండా ఎలా తప్పించుకుంది అని ప్రశ్నించవలసిందే. ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం కట్టుబడి ఉంది అని నిలదీయాల్సిందే. అంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య బాధ్యత నుంచి తప్పించుకుంటున్నట్టేగదా?

ప్రజలతో సంప్రదించడం అంటే పరస్పరం సంభాషించడం. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు చిహ్నం. అయితే ప్రధానమంత్రి రేడియోలో "మన్ కి బాత్" పేరిట చెప్తున్న మాటలకు ప్రజాస్వామ్య లక్షణం ఉందని చెప్పలేం. కానీ ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని చెప్పే మాటలు వినే అవకాశం ప్రజలకు ఉంది కానీ జనం మాట ప్రధాని వినిపించుకునే అవకాశం లేదు. ఎందుకంటే "కోట్లాది" మంది మనసులో ఏముందో కనిపెట్టగలిగే అద్వితీయ శక్తి ప్రధానికి ఉందన్న భావనతో ఈ కార్యక్రమం రూపొందించారు. ప్రధానమంత్రి కనీసం పత్రికా విలేకరుల సమావేశాల్లో కూడా మాట్లాడడం లేదు. అలా జరిగితే విలేకరులు ప్రజల తరఫున ప్రధానిని ప్రశ్నించే వీలుండేది. ప్రధాని ప్రజలతో మాట్లాడుతున్నారు అన్న అభిప్రాయం కలుగుతూ ఉండవచ్చు. కాని ఆయన తన మాట చెప్తున్నారే తప్ప ప్రజల గోడు పట్టించుకోవడం లేదు. ఇందులో "సంభాషణ"కు అవకాశం లేదు. పైగా ప్రధానమంత్రి "నేను చౌకీదారుని" అని చెప్పుకుంటున్నారు.

ప్రజలతో సంవాదానికి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉండాలి. నిజానికి ప్రతిపక్షాలతో సంవాదానికి వీలు కల్పించాలి. గత అయిదేళ్ల కాలంలో వాదాలకు, సంవాదాలకు వీలేకుండా చేశారు. పైగా సామాజిక మాధ్యమాలలో విమర్శించే వారిని తూర్పారబడుతున్నారు. అనరాని మాటలు అంటున్నారు. వాదించే వారిని అంతమొందిస్తున్నారు. "నేను చెప్పిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు", "నా మాటలను అసందర్భంగా ఉటంకించారు" అంటున్నారు. అయితే ఇలాంటి మాటలు అనైతికమైనవే తప్ప చట్ట రీత్యా శిక్షించడానికి ఉపకరించవు. పదే పదే ఇలాంటి పొరపాట్లు చేయడంవల్ల ఇతరుల నైతికతను దెబ్బ తీస్తున్నారు. వాదవివాదాలకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే ముఖ్యమైన సమాచారాన్ని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తోంది.

వాళ్లు అలా నైతికంగా వాడకూడని భాష ఎందుకు వాడతారు అన్నది ప్రశ్న. ఆ నాయకులకు వాదోపవాదాలంటే భయం. వాదోపవాదాలకు సంబంధించిన రాజకీయాలకు బదులు ప్రతీకాత్మక రాజకీయాలు చేస్తారు. ఉదాహరణకు ప్రతీకాత్మక రాజకీయాలను అడ్డూ ఆపూ లేకుండా వినియోగించినందువల్ల జాతీయతావాదాన్ని ముందుకు తోశారు. దానితో జాతికి, పౌరులకు మధ్య బంధం కుంచించుకు పోయింది. ప్రజలు ఎంత బలంగా ఉంటే దేశం అంత పటిష్ఠంగా ఉంటుంది. ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు, విద్య, ఉపాధి, గృహవసతి అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశం మీద జాతి జనాన్ని పట్టించుకుంటోందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. వాదోపవాదాలకు తావు లేకుండా చేసినందువల్ల ఫలితం ఏమీ ఉండదు. అయితే ఈ సంప్రదాయాలను ఏ రకంగానూ పరిపుష్ఠం చేయని పార్టీ ఎన్నికల సమయం వచ్చే సరికి రెండో సారి అధికారం ఇవ్వాలని అడుగుతుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top