ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రజల పాత్ర లేని ఎన్నికల ప్రచారం

.

సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటించిన తరవాత అధికార పక్షం, ప్రతిపక్షాల ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తాయి, ప్రజల అసలు సమస్యలు ఈ సందర్భంగా చర్చకు వస్తాయో లేదో చూడాలి. ప్రజలకు ప్రాతినిధ్యం ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పద్ధతిలో సమాజం పురోగమించడానికి అవసరమైన అంశాలు చర్చకు రావాలి. ప్రభుత్వం ఆ అంశాలపై స్పందించాలి.

కానీ ఇటీవలి ఎన్నికల ప్రచారాల్లో అలాంటి సంభాషణకు అవకాశమే ఉండడం లేదు. ఎన్నికల ప్రచారం ఓ అద్భుతంగానో, మహత్తర ఘట్టంగానో ఉంటున్నాయి. ఎన్నికలలో ప్రజలు కేవలం ప్రేక్షకులుగానో మిగిలిపోవడమే కనిపిస్తోంది. ప్రజలతో సంబంధం లేని ప్రచారార్భాటంవల్ల రెండు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకటి అధ్యక్ష తరహా పాలన ధోరణి, మునిసిపల్ ఎన్నికలలోలాగా పూర్తిగా ప్రాంతీయ వ్యవహారం కనిపిస్తోంది. రెండవది ప్రజాస్వామ్య అంతస్సారం క్రమంగా మృగ్యం అవుతోంది.

అధ్యక్ష తరహా ధోరణి ప్రబలడంవల్ల అధికార పక్ష ప్రతినిధిగా కేవలం ప్రధాని ఒక్కరే కనిపిస్తున్నారు. దీనివల్ల ఎన్నికల సందర్భంగా ప్రస్తావనకు రావలసిన అంశాలు కనిపించకుండా వ్యక్తి ఆరాధనా ధోరణి పెరిగిపోతోంది. మునిసిపల్ ఎన్నికల ధోరణివల్ల ఒక అభ్యర్థి పని తీరు, గుణగణాలకు, నియోజకవర్గ వ్యవహారాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాం.

ఇలాంటి వ్యవహార సరళి ప్రజా ప్రాతినిధ్యంతో కూడిన ప్రజాస్వామ్యానికి అనుగుణమైందే కదా అని వాదించే వారు ఉండవచ్చు. వికేంద్రీకరణ అంతరార్థం ఇదే కదా అనీ అనుకోవచ్చు. అంతకు ముందు అంతా కేంద్రీకృతమై ఉండేదిగదా అని వాదించవచ్చు. ఈ రెండు పద్ధతులూ ప్రజల పాత్రను దుర్బలం చేస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర లేకుండా పోతుంది. అధ్యక్ష తరహా ధోరణిలో ప్రజలు ఒక బలమైన నాయకుడి మీద మాత్రమే దృష్టి నిలుపుతారు.

అతని సమర్థత, నైపుణ్యం, పరిమితులు మొదలైన విషయాలే గమనిస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఆ నాయకుడి నిర్ణయాత్మక సరళి, వక్తృత్వ పటిమ లేదా ఈ లక్షణాలు లేకపోవడం మీదే దృష్టి అంతా ఉంటుంది. లేదా ఆ నాయకుడు  మర్యాదగా ఉన్నాడా లేక మర్యదా లేకుండా ప్రవర్తిస్తున్నాడా అని మాత్రమే చూస్తాం.

ఈ స్థితిలో ఓటర్లు ప్రశ్నించడానికి, విధానాలను విమర్శనాత్మక కోణంలో చూడడానికి, లేదా అధికార పక్షం ఆచరణాత్మక దృక్పథం లాంటివి ప్రస్తావనకు రావు. మహా అయితే ప్రతిపక్షాలు ప్రతిపాదించే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తాం. విశాల దృక్పథంతో చూస్తే వ్యక్తి ఆరాధనా తత్వం సమాజంలో ఆధిపత్యం చెలాయించే వర్గాలకే అనువుగా ఉంటుంది. అంటే ఓటర్లకు అధికార సంబంధాలను మార్చే అవకాశం కుంచించుకు పోతుంది. ఈ అవకాశం లేకుండా ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి?

సార్వత్రిక ఎన్నికలను మునిసిపల్ ఎన్నికల స్థాయికి దిగజార్చడంవల్ల ఓటర్ల కార్యకలాపాలను, వారి జోక్యాన్ని నియోజకవర్గ స్థాయికి దిగజార్చినట్టవుతుంది. మునిసిపల్ ఎన్నికల ధోరణి విధాన సంబంధ అంశాలను స్థూల దృష్టితో చూడడానికి అవకాశం ఇవ్వదు.

నిర్దిష్ట కార్యక్రమాలను పట్టించుకునే వీలుండదు. చట్టాలు, ప్రభుత్వ స్వభావాన్ని గమనించే పరిస్థితి ఉండదు. సర్వజనీనమైన అంశాలను, వ్యవస్థాపరమైన విషయాలను పట్టించుకునే ఆస్కారమే ఉండదు. ప్రజలు గల్లీ స్థాయికే పరిమితమైపోతారు తప్ప కేంద్ర (దిల్లీ) స్థాయిలో అధికారం చెలాయించే వారి గురించి ఆలోచించరు. కేంద్ర స్థాయిలోని వారు అసలు ప్రజలకు అందుబాటులోనే ఉండరు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో దిల్లిలో అధికారానికి మూలం గల్లీ స్థాయి నుంచే వస్తుందనేది వాస్తవమే. అయితే ప్రజలు గలీ స్థాయి నుంచి దిల్లీ స్థాయి దాకా వివేచించే అవకాశం ఉండాలి.

ఎందుకంటే దిల్లీలో తీసుకునే నిర్ణయాల ప్రభావం గల్లీ స్థాయి మీద కూడా ఉంటుంది. ప్రజల అవగాహనను నియోజకవర్గ స్థాయికి పరిమితం చేసినందువల్ల తమ జీవితాలను ప్రభావితం చేసే కేంద్ర నాయకత్వ నిర్ణయాలపై ప్రజల దృష్టి లోపిస్తుంది. ఈ అవకాశం ఉండాలంటే రాజకీయ పార్టీల, వాటి ప్రచారం ప్రమేయం ఉండాలి.

ఎన్నికలను మునిసిపల్ స్థాయికి దిగజార్చడం, అధ్యక్ష తరహా విధానాన్ని ప్రోత్సహించడంవల్ల రాజకీయ పార్టీల పాత్ర లేకుండా పోతుంది. రాజకీయ పార్టీల పాత్ర తగ్గడం, వాటి సైద్ధాంతిక అంశాలు కనుమరుగు కావడంవల్లే ఈ వికృత ధోరణులు ప్రబలిపోతున్నాయి. ప్రచారం తీరు మారడంవల్ల ప్రజలకు రాజకీయ పార్టీలతో సంబంధమే లేకుండా పోతోంది.

ఎన్నికల క్రమంలో ఎన్నికల ప్రణాళికలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలు ఏం చెప్తున్నాయో ప్రజలు పట్టించుకోవడమే మానేశారు. రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచారంలో ఈ ప్రణాళికలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనికి కొన్ని మినహాయింపులు ఉండవచ్చు.

2014 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పోలింగ్ జరగనున్న మొదటి రోజు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం చూస్తే ప్రణాళికల ప్రాధాన్యత ఎంతగా తగ్గిపోతోందో తేలిపోతోంది. ప్రణాళికలను ఎటూ అమలు చేయరు లెమ్మన్న నైరాశ్యం ప్రజలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయినా ఈ ప్రణాళికలు పార్టీల దృక్కోణానికి నిదర్శనంగా ఉంటాయి. ఉండాలి. ఎన్నికల ప్రణాళికలపై ఒక క్రమ పద్ధతిలో చర్చే జరగడం లేదు.

రాజకీయ పార్టీలకు, ఓటర్లకు మధ్య సంబంధమే లేకుండా పోతోంది. ఈ చర్చే జరగడానికి అవకాశం ఉంటే భావ సంఘర్షణకు, ప్రస్తుత స్థితికి, భవిష్యత్ దృక్పథానికి, ఇక ముందు ప్రభుత్వం ఏం చేయబోతోంది, ప్రభుత్వం, సమాజం ఏ దిశగా వెళ్తోంది అని తెలుసుకునే వీలుంటుంది. ఇది కొరవడడం రాజ్యాంగ దృక్పథానికి పూర్తిగా విరుద్ధమైందే. 2019 ఎన్నికలు చాలా ముఖ్యమైనవి అనుకుంటున్నప్పుడు ఈ అంశాలను పౌరులు నిశితంగా పట్టించుకోవలసిన అగత్యం ఉంది.

Back to Top