ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

జీవన్మరణాల వారధులు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

వంతెనలు రెండు కొసలను కలుపుతాయి. నదులు, రోడ్లు, ఇతర అడ్డంకులను అధిగమించడానికి ఉపకరిస్తాయి. కానీ ముంబైలోని వంతెనలు ఇటీవలి కాలంలో దీనికి విరుద్ధంగా పని చేస్తున్నట్టున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న కాలినడకన వెళ్లడానికి ఉపకరించే వంతెన 2019 మార్చి 15న కూలిపోయి ఆరుగురు మరణించారు. 32 మంది గాయపడ్డారు. వంతెన అన్న మాట ఈ మధ్యకాలంలో మీడియాలో "విషాదం", "మృత్యువు" అన్న మాటలకు సమానార్థకాలుగా వాడుతున్నారు. పట్టణ ప్రాంతాలలోని వంతెనలు, ఫ్లై ఓవర్లు కేవలం పట్టణ ప్రణాళిక, పరిపాలన అన్న సందర్భంలోనే కాక రాజకీయ లక్ష్యాల సాధనకు, పౌరుల భాగస్వామ్యానికి కూడా వినియోగిస్తున్నారు.

ఛత్రపతి శివాజీ రైలు స్టేషన్ వద్ద ప్రజలు రోడ్డు దాటేప్పుడు ప్రమాదాలకు గురి కాకుండా నివారించడం కోసం కాలినడక వంతెన నిర్మించారు. కాని భద్రతకోసం నిర్మించిన ఆ వంతెనే అనేకమంది ప్రాణాలు కాజేసింది. వంతెన కూలిపోయిన తరవాత మీడియాలో వచ్చిన వార్తలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కొద్ది రోజుల కింద ఈ వంతెన నాణ్యతను పరీక్షించే బాధ్యతను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తే ఆ కంపెనీ వంతెన పటిష్ఠంగా ఉంది అని నివేదిక ఇచ్చింది. ఇందులో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్, లేదా రైల్వే కార్మికుల హస్తం ఉద్దా అనే ఇషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వంతెన మనుషుల ప్రాణాలు కాపాడగలుగుతుందా లేదా అనే అంశం ఒక ఇంజనీరు నివేదిక మీద మాత్రమే ఆధారపడి ఉండడం దారుణమే కాదు అనూహ్యం. ఒక వేళ ఎవరైనా అశ్రద్ధతో నివేదిక ఇస్తే దానికి బాధ్యులను చేసే విధానం ఏమీ ఉండదా?

మన దేశంలో పట్టణ ప్రణాళికకు సంబంధించిన మరో అంశం కూడా ఉంది. ఈ ప్రణాళిక పౌరుల, ప్రయాణికుల అవసరాల మీద ఆధారపడి ఉంటుందా లేక రాజకీయ స్వార్థ ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుందా లేదా గుత్తేదార్ల దురాశ మీద ఆధారపడి ఉంటుందా అన్న విషయం కూడా అనుమానాలకు తావిస్తోంది. ప్రయాణికులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ముంబైలోని అనేక పై వంతెనలు, మోనో రైలు లాంటివి ఈ అనుమానాలను ఇనుమడింప చేస్తున్నాయి. ఇది సర్వసాధారణం అయింది. నిషేధించిన కాట్రాక్టర్లకు అక్రమంగా పనులు ఎలా అప్పగిస్తున్నారో మీడియా అనేక సార్లు బయట పెట్టింది. మన దేశంలో ఉన్న నిపుణులైన ఇంజనీర్లు, భవన నిర్మాణ నిపుణులు రాజకీయ నాయకులకు వంతపాడడం సిగ్గుచేటైన వ్యవహారం. వారికి పౌరుల ప్రయోజనాలు పట్టవా? వీరి నైపుణ్యం ప్రజలకు ఉపయోగపడాలి కాని స్వార్థపరులకు ఊడిగం చేయకూడదు. పట్టణాల్లో విధానాలు రూపొందించే వారు వృత్తి నైపుణ్యం ఉన్న వారికి కాకుండా తక్కువ ఖర్చుతో పని పూర్తి చేస్తాం అని చెప్పవారికే కాంట్రాక్టులు కట్టబెడ్తున్నారు. అనేక మౌలిక సదుపాయాల పథకాలలో ఇదే పద్ధతి కొనసాగుతోంది.

వాహనాలకు అనుకూలమైన, ప్రజా రవాణాకు విరుద్ధమైన, ప్రైవేటు గుత్తేదార్లకు ప్రయోజనం కలిగించే విధానాలపైన పట్టణ ప్రణాళిక కోసం కృషి చేసే కార్యకర్తలు అనేక సార్లు ఈ అపసవ్య ధోరణికి వ్యతిరేకంగా గొంతెత్తారు. మన దేశంలో పట్టణాల పెరుగుదల అడ్డదిడ్డంగా ఉంది కనక పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కూడా గందరగోళంగా, అరకొరగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో అవినీతి రాజ్యమేలుతుందని, ఎవరూ బాధ్యత వహిచరని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ముంబైలో మెట్రో రైలు పథకాన్ని, కోస్తా రోడ్డు పథకాన్ని పర్యావరణ నిపుణులు వ్యతిరేకించారు. అయినా ఆ పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని అనేక చోట్ల ఇదే పద్ధతి.

2018 జులై 3న అంధేరీ రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలపై వంతెన కూలడంవల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ తరవాత నెపం ఒకరి మీద మరొకరు మోపడం మొదలైంది. ఈ వంతెనను రైల్వే శాఖ 2014లో, 2017లో తనిఖీ చేసింది. కానీ దానికి సంబంధించిన రికార్డులు ఏమీ లేవు. అంతకు ముందు 2017లో ఎల్ఫిన్స్టోన్ రైలు వంతెనపై తొక్కిసలాట జరిగి 23 మంది ప్రాణాలు బలైనాయి. అనేక మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాట అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణ.

ఇటీవల వంతెన కూలడానికి మరో రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి. జనాభా పెరగడమే ప్రమాదానికి కారణం అని ప్రమాదం జరిగిన తరవాత శివసేన వాదిస్తోంది. ఇది కుత్సితమైన, నెపం మరెవరిమీదకో తోసే ప్రయత్నం. ముంబైలో ఉద్యోగావకాశాలు ఉంటాయి కనక తరతరాలుగా అనేక మంది వలస వస్తూనే ఉంటారు. భవిష్యత్తులో కూడా వస్తారు. నగర తాజా అభివృద్ధి ప్రణాళికలో 8 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. దీనివల్ల ప్రయాణికుల రద్దీ పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో పట్టణ ప్రణాళికలు రూపొందించేవారు గమనించాలి. "అభివృద్ధి" క్రమంలో ప్రమాదాలు, మరణాలు, గాయాలు మామూలేనని ప్రజలు నిర్వేదంలో పడిపోతున్నారు. పౌరుల నిరసనలను ప్రభుత్వాలు ఖాతరు చేయదు. వివాదాస్పదమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే ఉన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన ప్రజోపయోగమై ఉండాలి. అది కాంట్రాక్టర్లకు, ఇతరులకు పందేరాలు ఇవ్వడానికి కాకూడదు. ప్రజలు ప్రశ్నలు అడిగి తీరుతారు. జవాబులు అడిగి తీరతారు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top