సముద్ర తీరం ఎవరి సొత్తు?
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
కోస్తా రోడ్డు నిర్మాణ పథకంవల్ల సాంప్రదాయికంగా వస్తున్న తమ జీవన విధానానికీ జీవనోపాధికీ విఘాతం కలుగుతుందని ముంబై లోని స్థానిక మత్స్యకారులు అయిదేళ్లుగా నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. ఆధునిక నగరాల విస్తరణకూ అణగారిన వర్గాల ప్రయోజనాలకూ ఘర్షణ కొత్తేమీ కాదు. 1980లలో ఓల్గా టెల్లిస్ కు బాంబే మునిసిపల్ కార్పొరేషన్ కు మధ్య కేసులో ఫుట్ పాత్ ల మీద నివసించే వారు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బి.ఎం.సి.)కు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు. అప్పుడు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు చెప్తూ భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం జీవించే హక్కు జీవనోపాధికి కూడా వర్తింపచేయాలని, "ఎందుకంటే జీవనోపాధి లేకుండా జీవించే హక్కు సాధ్యం కాదు" అని చెప్పింది. ఈ తీర్పు వెలువడి మూడు దశాబ్దాలు గడిచినా మత్స్యకారుల పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఉద్రిక్తతలు తగ్గించడానికి చేసింది ఏమీ లేదు. న్యాయస్థానం సైతం ఈ విషయంలో ప్రతికూలంగానే వ్యవహరిస్తోంది.
కోస్తా రోడ్డు నిర్మాణంవల్ల తమ జీవనోపాధి ప్రమాదంలో పడ్తుందని వోర్లీ కోలివాడా నఖ్వా, వోర్లీ మచిమ్మర్ సర్వోదయ సహకారీ సంఘం కోర్టుకెక్కినప్పుడు బాంబే హైకోర్టు మత్స్యకారుల పునరావాస పథకం ఏమిటో చెప్పాలని కోరింది కానీ ఇలాంటి పథకం చేపట్టడాన్ని ప్రశ్నించలేదు. అసలు పునరావాస అవసరం ఎందుకు తలెత్తిందో అడగనే లేదు. పెట్టుబడిదారీ విధానం ప్రజల జీవితాలకు, వారి జీవనోపాధికి భంగం కలిగిస్తున్నప్పుడు దీన్ని నిరోధించడం మౌలికమైన అంశం. హైకోర్టు పునరావాసం గురించి ప్రశ్నించడం అంటే ప్రజల జీవితాలపై దురక్రమణను గుర్తించినట్టే లెక్క. జీవనోపాధికి భంగం కలిగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైంది. "పునరావాసం" ప్రజల రాజ్యాంగ హక్కులను ప్రభుత్వం ఆక్రమించడాన్ని నిరోధించేదిగా ఉండాలి కానీ బాధితులకు ఉపశమనం కలిగించేదిగా మాత్రమే ఉండకూడదు.
ఈ కోస్తా రోడ్డు నిర్మాణ పథకం చాలా ఖరీదైన వ్యవహారం. దీనికి ప్రతి కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి రూ. 12,000 కోట్లు ఖర్చవుతాయి. పునరావాసం గురించి మాట్లాడడం కేవలం ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతోంది. ఈ రోడ్డు నిర్మించడంవల్ల నగర రోడ్లలో "రద్దీ" తగ్గుతుందన్న హామీ లేదు. ఎందుకంటే రవాణా సమస్య గురించి విస్తృతమైన సర్వే ఏదీ నిర్వహించకుండానే ఈ రోడ్డు నిర్మాణ పథకం చేపట్టారు. ఒక వేళ రోడ్ల మీద రద్దీ తగ్గించడమే అసలు ఉద్దేశం అయితే ముందు నగరమంతటా మెట్రో రైలు మార్గ నిర్మాణం ఎందుకు పూర్తి చేయరు? నగరంలోని మౌలిక సదుపాయాల సమస్యకు కోస్తా రోడ్డు నిర్మాణం నివారణోపాయం ఏమీ కాదు. ఈ రెండింటికీ సంబంధమే లేదు. కోస్తా రోడ్డువల్ల పౌరులకు మేలు కలిగేటట్టయితే నగరంలో జీవావరణ మార్పులకూ పరిష్కారం చూపించాలి.
కేవలం అభివృద్ధి పేరిట ఈ సమస్యలన్నింటినీ చాపకిందకు తోసేయడానికి వీలు లేదు. గత రెండు దశాబ్దాల నుంచి, ముఖ్యంగా గత అయిదేళ్ల నుంచి కార్పొరేట్ సంస్థలకు సకలమూ కట్టబెట్టే రీతిలోనె అభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్నాయి. గుజరాత్ నుంచి కేరళ దాకా కోస్తా భూములు చాలా వరకు కార్పొరేట్ సంస్థల అధీనంలోకి వెళ్లాయి. నిబంధనలను పక్కదారి పట్టించి రాజ్యవ్యవస్థ ఈ పరిస్థితికి కారణమైంది. ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్), కోస్తా నియంత్రణ మండలాలు (సి.ఆర్.జడ్.), కోస్తా నిర్వహణ మండలి (సి.ఎం.జడ్.) పథకాల పేరుతో ఈ పని జరిగిపోయింది. దీనివల్ల సాంప్రదాయికంగా సముద్ర తీరంలో ఉంటున్న మత్స్యకారులు నిర్వాసితులై పోయరు. మరో వేపు ఈ ప్రాంతాలలో అపారమైన పారిశ్రామిక నిర్మాణాలు జరిగిపోయాయి. ఇది సాంప్రదాయిక జీవనోపాధిని దెబ్బ తీసింది.
అదే సమయంలో "నీలి ఆర్థిక వ్యవస్థ" పేర ప్రభుత్వ విధానాలు స్థానిక వ్యవస్థలను, మత్స్య పరిశ్రమ నిర్వహణా వ్యవస్థలను నామ రూపాలు లేకుండా చేస్తున్నాయి. నూతన ఆర్థిక అవకాశాలు, అభివృద్ధి, ప్రైవేటీకరణ పేరుతో సముద్ర వనరలును కొల్లగొడ్తున్నారు. మత్స్యకారులు తమ వృత్తి కొనసాగించడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు.
అయినప్పటికీ అది సి.ఎం.జడ్. అయినా సాగర్ మాల అయినా ప్రస్తుత ప్రభుత్వ పథకాలన్నీ "నీలి ఆర్థిక వ్యవస్థ" పేర చెలామణి అయిపోతున్నాయి. అయితే ఈ పథకాలు కానీ, విధాన పత్రాలు కానీ కలుగుతుందంటున్న మేలుకు ఉపకరించడం లేదు. "అభివృద్ధి" పేరుతో ప్రభుత్వం అక్కడ నివాసం ఉంటున్నవారిని నిర్వాసితులను చేస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడలేకపోయినందుకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే.