ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

రాజకీయాలకు అతీతంగా కార్మికోద్యమం అసాధ్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

దేశంలో కార్మిక సంఘాలు రెండు ప్రధాన సవాళ్లు ఎదుర్కుంటున్నాయి. సమకాలీన చరిత్రలో ఈ పరిస్థితి మునుపెన్నడూ లేదు. ఉద్యోగావకాశాలు సన్నగిల్లడం, పని చేసే పరిస్థితులు దిగజారడంతో పాటు కార్మిక సంఘాలు ప్రభుత్వం అమలు చేస్తున్న "కార్మిక సంస్కరణలను" కూడా ఎదుర్కోవలసి వస్తోంది. ఈ సంస్కరణలు ఏమైనా కావచ్చు కానీ కార్మికులకు ఎంతమాత్రం అనుకూలమైనవి కావు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐ.ఎన్.టి.యు.సి.) నుంచి విడిపోయిన నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ తో కలిసి ఆర్.ఎస్.ఎస్. అనుబంధ కార్మికసంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ (బి.ఎం.ఎస్.) కేంద్ర కార్మిక సంఘాల మహా సమాఖ్య ఏర్పాటు చేసింది. విచిత్రం ఏమిటంటే ఈ మహా సమాఖ్య రాజకీయాలతో సంబంధం లేనిది అని బి.ఎం.ఎస్. మీడియా సమావేశంలో చెప్పింది. ఈ కొత్త మహా సమాఖ్యవల్ల కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది ఇలాంటి మహా సమాఖ్య ప్రస్తుత దశలో అవసరమా? రెండవది కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలను, సందిగ్ధతలను ఇప్పుడున్న రాజకీయ పరిస్థితితో సంబంధం లేకుండా పరిష్కరించడం సాధ్యమేనా? బి.ఎం.ఎస్. ఏర్పాటు చేసిన మహా సమాఖ్యలో భాగం కాని మరో 10 కేంద్ర కార్మిక సంఘాలు 1926నాటి కార్మిక సంఘాల చట్టాన్ని సవరించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసన తెలియజేశాయి. ఈ సవరణలు చేస్తే కార్మిక సంఘాలను గుర్తించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది దురుద్దేశంతో కూడిన సవరణ అని మిగతా కార్మిక సంఘాలు అంటున్నాయి. ఈ సవరణ ప్రతిపాదనను బి.ఎం.ఎస్. వ్యక్తిరేకించడం లేదు. బి.ఎం.ఎస్. కార్మిక సంఘాల మహా సమాఖ్యను ఏర్పాటు చేయడం, కార్మిక సంఘాల చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం  ప్రయత్నించడం వాస్తవ స్థితి ఎంత అద్వానంగా ఉందో తెలియజేస్తోంది.

దేశంలోని శ్రామిక శక్తిలో ఎనిమిది శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పని చేస్తోంది. అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్న మిగతా 92 శాతం కార్మికుల జీవన పరిస్థితులను, పని చేసే పరిస్థితులను కార్మిక సంఘాలు, ప్రభుత్వం కూడా పట్టించుకోవలసి ఉంది. అవ్యవస్థీకృత రంగంలో పని చేసే కార్మికులను సంఘటితం చేయడం పెద్ద సవాలు. అనేక ఇబ్బందులతో కూడింది. ఇలాంటి స్థితిలో బి.ఎం.ఎస్. ఏర్పాటు చేసిన మహా సమాఖ్యతో ప్రయోజనం ఏమిటి? అంతకంతకూ విస్తరిస్తున్న అవ్యవస్థీకృత రంగంలో యువత, మహిళలు ఎక్కువ. సమాచార సాంకేతిక రంగం ప్రత్యేకమైన ఉద్యోగ సమస్యలను తెచ్చి పెట్టింది. రవాణా రంగంలో రాత్రికి రాత్రి మారిపోయింది. ఓలా, ఊబర్ లాంటి ప్రైవేటు టాక్సీలు నడిపే డ్రైవర్లు ఎదుర్కుంటున్న సమస్యలు గతంలో ఎప్పుడూ లేనివి. వివిధ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కోక తప్పలేదు. కార్మికులకు సంబంధించిన అంశాలపై కార్మిక సంఘాలను సంప్రదించే వారే కాదు. "నిర్ణీత కాలం పాటు ఉద్యోగం" వంటి కాంట్రాక్టు ఉద్యోగాలు అన్ని రంగాలకూ విస్తరించాయి. దుస్తుల తయారీ రంగంలో కాంట్రాక్టు విధానాన్ని 2016లో ప్రవేశ పెట్టారు. ఇది వ్యాపారం సులభంగా చేసుకోవడానికి, యజమానులకు వెసులుబాటు కలిగించడానికి ఉద్దేశించింది. "నిర్ణీత కాలం పాటు ఉద్యోగం" విధానం కింద ఎవరినైనా కాంట్రాక్టు మీద వారం రోజులకోసమైనా నియమించుకోవచ్చు లేదా ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేదాకానైనా నియమించుకోవచ్చు. ఈ లోగా వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తే కార్మికులకు కనీసం నోటీసు అయినా జారీ చేయవలసిన అవసరం లేదు. కార్మిక సంఘాలు 1970ల నుంచి ఈ కాంట్రాక్టు ఉద్యోగాల సమస్యను ఎలా ఎదుర్కోవాలా అని సతమతమవుతున్నాయి. బహుళజాతి గుత్త కంపెనీలు కాంట్రాక్టు కార్మికులను నియమించడమే కాదు, తమ విభాగాల్లోని కొన్నింటిని మొత్తంగా కాంట్రాక్టుకు ఇచ్చేస్తున్నాయి.

కార్మిక సంఘాల అస్తిత్వానికే ముప్పు ఉన్నప్పుడు కొత్త సంక్షోభాలను ఎదుర్కునే శక్తి సహజంగానే ఉండదు. దేశంలోని రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ సమస్యలను ఎలా పరిష్కరించగలం? నిజానికి కాంట్రాక్టు ఉద్యోగాల పద్ధతిని, 2017నాటి వేతనాల బిల్లు కోడ్ ను బి.ఎం.ఎస్. కూడా వ్యతిరేకించింది. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం ఆధారపడడం మీద శ్వేత పత్రం జారీ చేయాలని కూడా కోరింది. దీనికింద ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పలని అడిగింది.

ఇంతకు ముందు నరేంద్ర మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను బి.ఎం.ఎస్. తూర్పారపట్టింది. అయితే ఇదే అంశంపై పోరాడుతున్న ఇతర కార్మిక సంఘాలతో కలిసి పని చేయడానికి బి.ఎం.ఎస్. ఎన్నడూ సిద్ధపడలేదు. 2015 సెప్టెంబర్ నుంచి కార్మిక సంఘాలు కొనసాగించిన ఏ పోరాటంలోనూ బి.ఎం.ఎస్. భాగస్వామి కాలేదు. "మేం రాజకీయం చేయడానికి వ్యతిరేకం" కనక సార్వత్రిక సమ్మెల్లో పాల్గొనబోం, కార్మికుల సంక్షేమానికి మాత్రమే కృషి చేస్తాం అని బి.ఎం.ఎస్. వాదించింది.

ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్మిక సంఘాలు ఉమ్మడి వేదికలను ఏర్పాటు చేసుకుని పోరాడవలసిన అగత్యం ఉంది. అర్థవంతమైన త్రైపాక్షిక చర్చలకోసం పాటు పడాలి. కార్మిక సంఘాలతో చర్చించడానికి ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఏ మాత్రం సానుకూలంగా లేదని అనేక మంది కార్మిక నాయకులు చెప్పారు.

కార్మిక సంఘాల సమస్యలను ప్రజా సమస్యలుగా మలచడానికి కార్మిక సంఘాలు నానా యాతన పడ్తున్నాయి. ఈ ప్రభుత్వం చేపట్టిన కార్మిక సంస్కరణలు ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించడంతో పాటు పరిశ్రమల మూసివేతకు, ఉద్యోగులను తొలగించడానికి దారి తీసుతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవాలంటే కార్మిక సంఘాలు ప్రగతి శీల రాజకీయ పక్షాలతో, సామాజిక ఉద్యమాలతో మమేకం కావాలి. అది పార్లమెంటులోనైనా కావచ్చు. వెలుపల అయినా కావచ్చు. తమ సమస్యలను ప్రజలకు తెలియజెప్పాలన్నా, ఉమ్మడిగా బేరసారాలకు దిగాలన్నా ఇది అవసరం. ఈ పని చేయాలంటే కార్మిక సంఘాలు పరిపాలనలోనూ రాజకీయ సమస్యలలోనూ జోక్యం చేసుకోక తప్పదు. ఈ పనిలో బి.ఎం.ఎస్. ఏర్పాటు చేసిన మహా సమాఖ్య ఎక్కడ ఉన్నట్టు?

Updated On : 1st Feb, 2019
Back to Top