ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

విడని లంకెల ముడి జి.ఎస్.టి.

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) 2017 జులైలో అమలులోకి వచ్చినప్పటి నుంచి 400 ఆదేశాలు, ఉత్తర్వులు జారీ అయినాయి. ఈ పన్ను అమలు చేయడం ఎంత సంక్లిష్టంగా తయారైందో దీనివల్ల రుజువు అవుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నందువల్ల అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మరిన్ని మార్పులు చేయాలనే కోరుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం 23 వస్తువులపై జి.ఎస్.టి.ని 18 శాతానికి తగ్గించింది. పన్ను విధింపును మరింత సరళతరం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయవచ్చునని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు జారీ చేసిన ఉత్తర్వులు, ఇప్పుడు చేస్తున్న వాగ్దానాలు జి.ఎస్.టి.లోని సంక్లిష్టతను ఏ మేరకు తొలగించగలవన్నది శేష ప్రశ్నే. దేశంలోని ద్రవ్య విధానంలో ఫెడరలిజం, పన్నులు చెల్లించేట్టు చూడడం, అన్నింటికన్నా మించి అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వ్యాపారాలు, చిన్న మొత్తాల్లో పెట్టుబడులు మొదలైన సమస్యలకు ఇంతవరకు పరిష్కారమే లేదు.

ఎన్నికలు ఎదుర్కోవడానికి పన్నుల సంస్కరణల గురించి మాట్లాడడం కొత్త కాదు. జనంలో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి మలేషియాలో పన్నులు తగ్గించడానికి వెనుకాడకపోవడం జనాకర్షక విధానాలకు తాజా ఉదాహరణ. మలేషియా ప్రభుత్వానికి పన్నుల ద్వారా సమకూరే ఆదాయంలో అయిదోవంతు జి.ఎస్.టి. ద్వారానే వస్తోంది. మన దేశంలో ఇలాంటి తగ్గింపులకు ఉపక్రమిస్తే అది ఖరీదైన వ్యవహారంగా మిగిలిపోవచ్చు. కానీ దేశ ఫెడరల్ విధానానికి మాత్రం భంగం కలగక తప్పదు.

జి.ఎస్.టి.లో మార్పులు చేర్పులు చేయడానికి రాజ్యాంగ సవరణలు అవసరం లేదు అని ఆర్థిక వ్యవహారాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఇటీవల చెప్పారు. జి.ఎస్.టి. మండలే ఈ పని చేయవచ్చు. ఇది ఆర్థిక విధానాలలో రాష్ట్రాలకు ఉన్న స్వయంప్రతిపత్తిని కాలరాయడమే. బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వ లక్షణమే ఇది. వివిధ రాష్ట్రాలలో ఆర్థిక సమస్యలు ఒకేలాగా ఉండవు. విద్యుత్తు, స్థిరాస్తి, పెట్రోలియం ఉత్పత్తులను జి.ఎస్.టి. పరిధిలోకి తీసుకురావడం పంజాబ్ లాంటి రాష్ట్రాలకు ఉపకరించవచ్చు. మిగతా రాష్ట్రాలకు ఇదే సూత్రం వర్తించదు.

ఉత్తరాదిలోను మూడు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించినందువల్ల జి.ఎస్.టి. మండలి స్వరూపంలో కొంత మార్పు వచ్చింది. ఈ మార్పు బీజేపీకి వ్యతిరేకమైందే. అయితే దీని ఆధారంగానే జి.ఎస్.టి. స్వరూపాన్ని మార్చగలం అనుకోవడం దురాశే అవుతుంది. 2019లో ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకున్నా జి.ఎస్.టి. మండలిలో మార్పులు చేయడానికి నాల్గింట మూడు వంతుల మెజారిటీ అవసరం. ఎందుకంటే రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రాలు దాదాపు జి.ఎస్.టి.ని అంగీకరించినందువల్ల అదీ తమ రాబడికి ఏదైనా నష్టం కలిగితే ఆ లోటును కేంద్రం పూడుస్తుందని హామీ ఇచ్చినందువల్లే. అంటే ఫెడరలిజం నిర్ణాయక పాత్ర పోషించడం ఇప్పటికే తగ్గు ముఖం పట్టింది.

అన్నింటికంటే ముఖ్యమైంది ఈ రాజీలు మరో ప్రత్యామ్నా వాస్తవికతకు నిదర్శనం. జి.ఎస్.టి. ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయంలో విధాన నిర్ణయాలు తీసుకునే వారికే అంటే ఎన్.డి.ఎ. కే స్పష్టత లేదు. ఈ అస్పష్టత ఆధారంగానే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు సాగుతాయి. ఎన్నికలు లేనప్పుడు ప్రజలనుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తారు. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్లకు కుటుంబాలు 2017 జులై నుంచి రూ. 32 అధికంగా చెల్లించవలసి వస్తోంది. దీనికి తోడు సబ్సిడీ తగ్గించారు. ఎన్నికలు దగ్గరపడితే పన్నులను "హేతుబద్ధం" చేసే పేర పన్నులు తగ్గిస్తుంటారు. గ్యాస్ విషయంలో సబ్సిడీ లేని వినియోగ దార్లకు సిలిండర్ కు రూ. 120.50 తగ్గిస్తే సబ్సిడీ ఉన్నవారికి రూ. 5.90 తగ్గించారు. ఏడాదిన్నరపాటు ముక్కు పిండి పన్ను వసూలు చేసిన తర్వాత ఇప్పుడు పన్నులను "హేతుబద్ధం" చేస్తామంటున్నారు. ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో అపారమైన తేడాలున్న భారత్ లాంటి దేశంలో జి.ఎస్.టి. అమలు చేయడం సులభం కాదు. అందువల్ల తప్పులు చేయడం, దిద్దుకోవడం సహజమే. ఈ పరిస్థితిలో బీజేపీ సాహసాన్ని, స్ఫూర్తిని అభినందించవలసిందే. కానీ ఇలాంటి ప్రయోగాలలో ఉన్న రాజకీయ ఉద్దేశాలు ఏమిటి?

గత నాలుగు దశాబ్దాల నుంచి వివిధ ప్రభుత్వాలు దేశ ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించకూడదన్న ఉద్దేశంతో జి.ఎస్.టి. లాంటి పన్నుల సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సంకోచించారయి. అయితే బీజేపీ తొందరపాటుతో జి.ఎస్.టి.ని అమలు చేయడమే కాకుండా పరోక్ష పన్నుల సంస్కరణలలో ఇది బ్రహ్మాండమైందని విపరీతంగా ప్రచారం చేసింది. కానీ ఇందులో ఆర్థికాంశాల ఇంగిత జ్ఞానం లేదు. జి.ఎస్.టి. వల్ల పన్ను వసూళ్లు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం తగ్గుతుందని, ఆర్థికాభివృద్ధి రేటు దూసుకెళ్తుందని చేసిన ఆర్భాటాలు ఫలించలేదు. పైగా అందరికీ ఒకే సైజు సరిపోతుందన్న బీజేపీ వాదన వెనక ఆర్థిక, రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయించాలన్న దురుద్దేశం ఉంది. ఉదాహరణకు చిన్న సంస్థలు పెద్ద సంస్థలలాగే పని చేసి వాటి కార్యకలాపాలు పెరుగుతాయని చేప్పారు. కాని అవ్యవస్థీకృత రంగంలోని సంస్థలపై పరిపాలనా సంబంధ భారం పెరిగింది. వ్యవస్థీకృత రంగం మరింతగా ఖర్చులు పెంచాల్సి వచ్చినందువల్ల ఆదాయ, ఉద్యోగాలలో అభద్రతా భావం పెరిగింది.

ఒక రాజకీయ పార్టీ సంకల్పం దాని కృత నిశ్చయం, అనూహ్యమైన పరిణామాల ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం మాటల వల్ల కాదు. జి.ఎస్.టి. ఇప్పుడు వెనక్కు తీసుకోవడం దాదాపుగా కుదరదు. రాజకీయ పార్టీలు అంటే ఎన్.డి.ఎ. లాంటి సంకీర్ణాలు తమ రాజకీయ అనుయాయులను పెంచుకోవచ్చు. అవి నిలబడతాయా లేదా అన్నది వేరే విషయం. దీర్ఘకాలికంగా ప్రజల పాత్ర పెంచాలంటే విధాన నిర్ణయాలు తీసుకునే వారికి సమ్యక్ దృక్పథం, నిర్మాణాతమక లోపాలను సరి దిద్దే శక్తి, ఏయే పన్నులను మినహాయించవచ్చునన్న దృష్టి, పన్ను రేట్లను సులభతరం చేసే లక్షణం మొదలైనవి అవసరం. అయితే ఇవన్నీ దేశ ప్రజాస్వామ్యానికి తగ్గట్టుగా ఉండాలి.

Updated On : 1st Feb, 2019
Back to Top