ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846
Reader Mode

నీటి ఎద్దడిపై ఎనలేని నిర్లక్ష్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఒక్క చుక్క నీరు దొరకని రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లోనూ, భారత్‌లోని బెంగళూరులోనూ నీటి కొరత అనివార్యంగా కనిపిస్తోంది. కేప్ టౌన్‌లో రోజుకు ఒక మనిషికి 50 లీటర్లే లాంటి జల సంరక్షణ విధానాలు అమలు చేసి చుక్కనీరు లేని రోజులను ఏప్రిల్ నుంచి జులైకి వాయిదా వేయగలిగారు. అక్కడ మేలో వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నారు. ఒక వేళ తగినంత వర్షం కురవకపోతే ప్రజలు బారులు తీరి నీటికోసం ఎదురు చూడవలసి వస్తుంది. కానీ బెంగళూరులోనూ, మన దేశంలోని ఇతర నగరాల్లోనూ నీటి కటకట నివారించడానికి ప్రయత్నాలేవీ లేవు. వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించడానికి, మన గొయ్యి మనమే తవ్వుకుని సంక్షోభంలో కూరుకు పోవడానికి ఉన్న తేడా అంటే ఇదే. నీటి కొరత ఏర్పడడానికి నీటి దొంగతనంతో పాటు, విచ్చల విడిగా నీరు వాడకం వరకు అనేక కారణాలున్నాయి. కేప్‌టౌన్‌లో నీటి సంక్షోభం భారత్‌కు మేలుకొలుపు కావాలి. ఎందుకంటే సమీప భవిష్యత్తులో అనేకచోట్ల నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. మన దేశంలో అందరికీ అందవలసిన వనరులను కొంతమంది ఎలా విపరీతంగా వాడతారో, తద్వారా సమాజంలో అసమానతలు ఎలా చోటు చేసుకుంటాయో గుర్తించాలి. కేప్ టౌన్ లో లాగే మన దేశంలో పేదలే తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారు. వారు నీటి కోసం గంటల తరబడి చూడవలసి వస్తోంది. కొన్నిసార్లు నీళ్లు కూడా కొనుక్కోవలసిన పరిస్థితి. అత్యవసరమైన నీటి కోసం అన్వేషణా తప్పడం లేదు.

సంపన్నులకు కుళాయిల్లో నీళ్లు వస్తాయి. దాన్ని మేడ మీద ఉన్న నీటి తొట్టెలోకి చేరుస్తారు. వాడుకోవడానికి, దుర్వినియో గం చేయడానికి కూడా ఆ నీరే ఉపయోగపడుతోంది. నీటి కోసం సంపన్నులు చెల్లిస్తున్నది నామమాత్రం కనక పొదుపుగా నీళ్లు వాడుకోవాలనుకోరు. సమాజంలో అంతరాలు అత్యంత సహజంగా కొనసాగుతున్నాయి కనక తాము నీటి వృథా చేస్తున్నామో లేదా విలువైన జల వనరును మితిమీరి వాడుతున్నామేమో అనే అపరాధ భావన కూడా సంపన్నులకు ఉండదు. మన నగరాల్లో నీటి కొరత, వినియోగం, పంపిణీలో అసమానతలతో పాటు నీటిని ఎలా వినియోగిస్తాం, సంరక్షిస్తాం అన్న విషయం కూడా సంక్షోభ పూరితమైందే. విలువైన ఈ వనరు గురించి మన వైఖరి ఉష్ట్రపక్షి ధోరణిలో ఉంటుంది. మన తలలు సతతం నిర్హేతుకమైన రీతిలో ఇసుకలో కూరుకు పోయి ఉంటాయి. అధికారులు, పౌరులు కూడా ప్రతి ఏటా ఎలాగోలా వర్షాలు కురుస్తాయి లెమ్మన్న భ్రమల్లో గడుపుతుంటారు. వర్షం కురిసి మన నదులు, జలాశయా లు నిండి భూగర్భ జలమట్టం పెరుగుతుందని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ వర్షం కురవకపోతే శీతోష్ణస్థితిలో మార్పులు, భూతాపంవంటి వాటి మీద నెపం మోపుతాం. పరిరక్షించవలసిన బాధ్యత గురించి మాత్రం ఆలోచించం. ఇవాళ పొదుపు చేసే నీరే రేపటికి ఉపకరిస్తుంది అన్న అలోచనే ఉండదు. ఈ ఆలోచనా ధోరణి కారణంగానే మన నగరాలు అడ్డదిడ్డంగా పెరిగిపోయాయి. నీరులాంటి వనరులు ఎలా సమకూరతాయోనన్న ధ్యాసే లేదు. ఆ నీటిని ఎలా పంపిణీ చేయాలో గమనించం. 1991 లో బెంగళూరు జనాభా 45 లక్షలు ఉండేది. ఇప్పుడు కోటీ 35 లక్షలకు చేరింది. నగర విస్తీర్ణం గతంలో 226 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 800 చదరపు మీటర్లకు చేరింది. జల సంక్షోభం నిరంతరంగా ఉంటుంది. అయినా ఉన్న వనరులను పరిరక్షించం. ఒకప్పుడు నిండా నీళ్లతో తొణికిసలాడే చెరువులు, కుంటలు మాయమై పోయాయి. వాటిని పరిరక్షించలేదు. బెంగళూరు కావేరీ నదీజలాల మీద ఆధారపడుతుంది. ఆ నగర దాహార్తి తీర్చడం కోసమే కర్నాటక ప్రభుత్వం కావేరీ జలాల్లో ఎక్కువ వాటా కావాలంటుంది. ఇటీవలి కోర్టు కేసులో వాటా పెంచుకోగలిగింది. అయినా బెంగళూరు నీటి అవసరాలు తీరవు. ఆ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో నీటి అవసరాలూ తీరవు. నీటి వాడకంలో గృహావసరాలకు నీటి వినియోగం అంత ప్రధానమైంది కాదు. వ్యవసాయానికి నీరు ముఖ్యమైంది. ఇక్కడా సమస్య ఏమిటో తెలుసు.1960ల తర్వాత హరిత విప్లవం కారణంగా సేద్యపు నీటి వినియోగమూ పెరిగింది. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటాయి. భూగర్భంలో ఉన్న నీటి చెలమల్లో తడి ఆరకుండా చేసిందేమీ లేదు. వర్షాలు కురవనప్పుడల్లా సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఉపరితల జలాన్ని సేద్యానికి మళ్లించినా అదీ చాలడం లేదు. దీనికి నర్మదా నదే పెద్ద ఉదాహరణ. ఆ నది మీద సర్దార్ సరోవర్ ఆనకట్టతో సహా అనేక ఆనకట్టలు కట్టారు. అయినా నర్మదా నదిలో నీటిమట్టం ఆందోళనకరంగా తగ్గుతోంది. ఆ నదిపై ఆధారపడ్డ పట్టణాలకు తగినంత నీరు సరఫరా చేయలేకపోతున్నారు. ఇక సేద్యానికి ఉన్న అవసరాల సంగతి చెప్పక్కర్లేదు. నర్మదా జలాన్ని అహ్మదాబాద్ ద్వారా వెళ్లే సబర్మతి నదికి తరలిస్తున్నారు. సబర్మతిలో నీరింకి పోయింది.

మార్చి 22న భారత్‌లో కూడా అంతర్జాతీయ జల దినోత్సవం జరపబోతున్నాం. ఇది ఓ తంతుగా మారింది. ఆ రోజున ప్రతి ఏటా ప్రభుత్వాలు జల సంరక్షణ ఎలా చేయాలో ప్రవచిస్తాయి. వృధాగా పోయే నీటిని మళ్లీ ఎలా వాడుకోవచ్చో వివరిస్తుంటాయి. ఆ తర్వాత పట్టణ ప్రణాళికల రూపకల్పన, నగరాల అడ్డగోలుగా విస్తరించడం, వ్యవసాయం, ఇంధన ప్రణాళికల గురించి ఎవరూ పట్టించుకోరు. మరో ఏడాది కూడా నీటి కటకట ఎలాగోలా గట్టుక్కెతాం లెమ్మన్న ధీమాతోనే విధానాలు రూపొందిస్తారు. నీటిని ఎలా వాడుతున్నాం, ఎలా దుర్వినియోగం చేస్తున్నాం అనేదే ఒక సమాజం సామాజిక న్యాయాన్ని పరిరక్షిస్తోందా, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా వ్యవహరిస్తోందా అనడానికి కొలమానం. ఈ విషయంలో దేశంలో ఉన్న పరిస్థితి చూస్తే మనకు సున్నా మార్కులే వస్తాయి.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top