ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రభుత్వమే చట్టాన్ని తుంగలో తొక్కితే!

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

నేరాలను అరికట్టడానికి ఉత్తమ మార్గం “నేరస్థులను” అంతం చేయడం అన్నట్టుంది వ్యవహారం. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదే ఉత్తమ మార్గం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ భావిస్తున్నట్టున్నారు. ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడుల కోసం శిఖరాగ్ర సమావేశానికి ముందు పది రోజుల కాలంలో పోలీసులకు, ‘నేరగాళ్ల’కు మధ్య నాలుగు “ఎదురుకాల్పులు” జరిగాయి. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. 18 మంది కేద్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2017 మార్చి నుంచి 2018 జనవరి వరకు 921 “ఎదురుకాల్పులు” జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 33 మంది మరణించారు. ఇంత భారీ స్థాయిలో “ఎదురుకాల్పులు” జరగడం గమనించి జాతీయ మానవ హక్కుల కమీషన్ గత నవంబర్ లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. కాని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మానవహక్కుల సంఘానికి సమాధానం కూడా ఇవ్వలేదు.

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు మునుపెన్నడూ జరగనివి కావు. ఇలాంటి “ఎదురుకాల్పుల” ఉదంతాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. 1982 నుంచి 2003 మధ్య అక్కడ నేరస్థులనుకునే 1200 మందిని “ఎదురుకాల్పుల” పేర కాల్చి పారేశారు. నేరగాళ్ల ముఠాలను అంతమొందించే పేర ఈ “ఎదురుకాల్పులు” జరిగాయి. ఇలా ఎదురుకాల్పులు జరిపే పోలీసులను ఎన్ కౌంటర్ నిపుణులు అని కొనియాడారు. వారి గురించి సినిమాలు కూడా తీశారు. మానవ హక్కుల సంఘాలు విచ్చలవిడిగా జరుగుతున్న ఎన్ కౌంటర్లకు తీవ్ర నిరసన తెలియజేసినప్పుడు, నేరస్థులకు కూడా న్యాయ బద్ధమైన రీతిలో విచారణను ఎదుర్కునే హక్కు ఉందని, నేరస్థులని ఆరోపణలున్న వారిని ఏకపక్షంగా ఎన్ కౌంటర్ల పేరుతో అంతమొందించడానికి వీలులేదని వాదించినప్పుడు కొందరు పోలీసులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొద్ది మంది పోలీసులకు శిక్షలు పడ్డా చాలామంది శిక్ష పడకుండా తప్పించుకున్నారు. ఎన్ కౌంటర్ల నిపుణుడిగా పేరుమోసిన వారిలో ఒకరైన ప్రదీప్ శర్మను 2009లో సస్పెండ్ చేసినా… 2013 లో సాదరంగా నిర్దోషిగా తేల్చారు. నేరస్థులు రోత పుట్టించే వారనీ అందుకే వారిని అంతమొందించి శుద్ధి చేసేవాడినని ప్రదీప్ శర్మ గర్వంగా చెప్పుకున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా 104 ఎన్ కౌంటర్లతో సంబంధం ఉంది.

అక్రమ, చట్టవిరుద్ధమైన పద్ధతులను అనుసరిస్తున్న వారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మద్దతు ఉంది. “పోలీసులు ఇక నుంచి తూటాకు తూటాతోనే సమాధానం చెప్తారు” అని యోగి ఆదిత్యనాథ్ బాహాటంగానే చెప్పారు. “మునుపటి ప్రభుత్వాల లాగా కాకుండా నేరస్థులను ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కోవాలని నేను పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాను” అని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. మైనారిటీలు, ఇతర ఉపాంతర‌ వర్గాలు అంటే ఆట్టే పట్టింపు లేని అధికారులకు ఇలా చట్టంతో, న్యాయ ప్రక్రియతో సంబంధం లేకుండా సంపూర్ణమైన అధికారాలు కట్టబెట్టడం చాలా ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ కౌంటర్ లో అంతమొందించిన తర్వాత ఆ వ్యక్తి తప్పు చేశాడో లేదో ఎలా నిర్ణయిస్తారు? న్యాయస్థానాలు ఆరోపణల్లో నిజానిజాలు తేల్చక ముందే ఎన్కౌంటర్ పేరుతో అంతమొందించడం చట్టం, న్యాయ ప్రక్రియ అందరికీ అందకుండా అపహాస్యం చేయడమే.

అది ఒక వ్యక్తి నేరం చేశాడో లేదో తేల్చకుండానే వ్యక్తుల హక్కులను బాహాటంగా ఉల్లంఘించడమే. నాగరిక సమాజంలో ఈ ధోరణిని అంగీకరించలేం. నేరస్థులను ఎన్ కౌంటర్ల నెపంతో అంతమొందించడంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర అనుభవం నుంచి మరో పద్ధతిని కూడా అనుకరిస్తోంది. 2017 డిసెంబర్ లో ఉత్తరప్రదేశ్ శాసన సభలో చెప్పుకోదగ్గ చర్చ ఏమీ జరగకుండానే ఉత్తరప్రదేశ్ వ్యవస్థీకృత నేరాల చట్టం (యు.పి.చి.ఒ.సి.ఎ. – ఉప్కోకా) ఆమోదించేసింది.  1999లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే పద్ధతిలో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల అదుపు చట్టం (ఎంకోక) ఆమోదించింది. బహుజన్ సమాజ్ పార్టీ (బి.ఎస్.పి.) నాయకురాలు మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో ఇలాంటి చట్టాన్ని ఆమోదింప చేయడానికే ప్రయత్నించారు. కాని అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ చట్టానికి ఆమోద‌ముద్ర వేయలేదు. కాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గనక ఇలాంటి చట్టం శాసనసభలో ఆమోదించి పంపితే ప్రస్తుత రాష్ట్రపతి దానికి సమ్మతించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఉప్కోకా, ఎంకోక లాంటి చట్టాలతో సమస్య ఏమిటంటే అవి అత్యంత కిరాతకమైనవి కనక వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువ.

నేరస్థులను అదుపు చేయడానికి ఈ కిరాతక చట్టాలు అవసరం లేదని ఇదివరకు ఉన్న చట్టాలే చాలునని అనేక మంది సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. 1967లో కేంద్రప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం స్ఫూర్తితోనే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కిరాతకమైన చట్టాలను రూపిందిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టాలను వినియోగించకుండా రాష్ట్రాల ప్రభుత్వాలు కర్కోటకమైన కొత్త చట్టాలు రూపొందించడం పరిపాటి అయి పోయింది. నేరాలు, తీవ్రవాదం మొదలైన వాటిని అణచడానికి పోలీసులు మరింత కఠినతరమైన చట్టాలు కావాలని కోరుతున్నారు. వారు కోరుకునే కిరాతక చట్టాలవల్ల జరిగేది ఏమిటంటే ఎవరినైనా పోలీసులు నిర్బంధిస్తే వారు తమ తరపున వాదించే అవకాశమే ఉండదు.

ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్లకు సంబంధించి మీడియా… నేరస్థులన్న ఆరోపణలున్న వారిని ఎలా అంతమొందించారన్న విషయాన్ని నిలదీసింది. తమ వారిని పోలీసులు పట్టుకెళ్లి తర్వాత ఎదురుకాల్పుల్లో మరణించారని చెప్పారని బాధితుల బంధువులు న్యాయస్థానాల్లోనే తెలియజేశారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను పట్టించుకోనే లేదు. అంతటితో ఆగకుండా ఇలా ఎన్ కౌంటర్లలో అంతమొందించడం వల్ల ఇది తమ ప్రభుత్వ విజయానికి నిదర్శనం అని వాదిస్తోంది. ఆ రాష్ట్ర పోలీసుల్లోనే నేరస్థుల అదృశ్య హస్తం ఉన్నప్పటికి ప్రభుత్వం ఇలా గొప్పలు చెప్పుకుంటోంది.

జాతీయ మానవ హక్కుల సంఘం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసు గతి ఏమైందో పట్టించుకోవడం అత్యవసరం. ఒక వేళ పోలీసులు ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపి ఉంటే వారు ఈ విషయాన్ని అనుమాన రహితంగా రుజువు చేసుకోవాలి. అలా కాకుండా అనేక శవ పరిక్షల నివేదికల్లో దగ్గర నుంచి కాల్చి చంపారు అని తేలింది. ఆ ఆరోపణే నిజమైతే అది చట్టబద్ధ పాలనకు, న్యాయమార్గ పాలనకు విరుద్ధమైందని స్పష్టం అవుతుంది. చట్టాన్ని పరిరక్షించి, అమలు చేయవలసిన వారే చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నారని రూఢి అవుతుంది. ప్రభుత్వమే నేరస్థులను అంతమొందించడానికి ధూర్తంగా వ్యవహరించి, వంచనకు పాల్పడితే ఏ నేరమూ చేయని వారి ప్రాణాలకు ముప్పు తప్పదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top