ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రై‘వేటు’తో బ్యాంకుల క్షాళన?!

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఇటీవలి కాలంలో మొత్తం దేశాన్ని కుదిపేసిన కుంభకోణాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పి.ఎన్.బి.) కుంభకోణం కొత్తగా చేరింది. ఈ కుంభకోణాల్లో కొన్ని వాస్తవమైనవి అయితే మరి కొన్ని ఊహాజనితమైనవి. పి.ఎన్.బి. వ్యవహారంలో రెండు అంశాలు ముందే స్పష్టం చేయాలి. మొదటిది ఈ బ్యాంకులో జరిగిన మోసాన్ని కొనసాగించడం. బ్యాంకును మోసం చేయడం అంటే ఆ బ్యాంకు ఉద్యోగులు కానీ ఇతరులు కాని నిబంధనలను ఉల్లంఘించి ఆ సంస్థకు నష్టం కలిగించడం. పి.ఎన్.బి. వ్యవహారం బ్యాంకు వాటాదార్లకు, నిర్వాహకులకు ప్రయోజనం కలిగించడానికి బ్యాంకే నియమ, నిబంధనలను ఉల్లంఘించడం లాంటిది కాదు.  బ్యాంకు ఉద్యోగులు ఖాతాదార్లతో కుమ్మక్కైతే నిరర్థక ఆస్తులు పెరిగిపోవచ్చు. లేదా వ్యాపారానికి సంబంధించిన ఓ నిర్ణయం తప్పయినా నిరర్థక ఆస్తులు పెరగొచ్చు. రెండవది పి.ఎన్.బి. విషయంలో మోసం అంతా బ్యాంకులో ఉన్న వ్యవస్థలను, ప్రక్రియలను పాటించనందువల్ల జరిగిన నిర్వహణాపరమైన నష్టమే. ఇది రుణాలకు సంబంధించిన ముప్పు మాత్రమే కాదు. కలిగిన నష్టాలవల్ల వెంటనే రాజకీయ ప్రభావం పడింది కనక ఈ అంశానికి ప్రాధాన్యం ఉంది. ప్రతిపక్షం వెంటనే ఎన్.డి.ఎ. ప్రభుత్వ నిర్వాకాన్ని వేలెత్తి చూపింది. ఎన్.డి.ఎ. కు నాయకత్వం వహిస్తున్న బీజేపీ పి.ఎన్.బి. కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలు చేసింది.

బ్యాంకు పరపతికి ముప్పు ఏర్పడితే అందులో తప్పకుండా ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల జోక్యం ఉండి తీరుతుంది. అంటే ఎవరో "చెప్తే" రుణాలు ఇవ్వడం. వాణిజ్యపరంగా గిట్టుబాటు కాని వ్యవహారాల్లో ఇలా ప్రభుత్వ రంగ బ్యాంకులను పురమాయించి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు రుణాలు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇది నిర్వహణ ముప్పు కాదు. నిర్వహణ ముప్పు అయితే ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులకు కూడా ప్రయోజనం కలగవచ్చు. కాని ఇందులో సాధారణంగా రాజకీయ జోక్యం ఉండదు. నీరవ్ మోదీకి రాజకీయ నాయకుల అండ ఎంతైనా ఉండొచ్చు. కాని పి.ఎన్.బి.లో జరిగిన నిర్వహణా లోపంలో పి.ఎన్.బి.కి రాజకీయ నిర్దేశం లేదా మద్దతు ఉందని చెప్పడానికి ఆధారం లేదు.

ఈ మోసానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా బయటపడలేదు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం నీరవ్ మోదీకి చెందిన విదేశాల్లో పని చేసే సంస్థలకు భరోసా పత్రాలు (ఎల్.ఓ.యు.) ఇచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంకులు పరస్పరం సందేశాలు పంపించుకోవడానికి స్విఫ్ట్ అనే ప్రక్రియను అనుసరిస్తాయి. పి.ఎన్.బి. వ్యవహారంలో ఒక ఉద్యోగి పై అధికారుల అనుమతి లేకుండా ఈ ఎల్.ఓ.యు.లు జారీ చేశారు. ఆ ఉద్యోగి జారీ చేసిన అనేక ఎల్.ఓ.యు.ల ఆధారంగానే విదేశీ బ్యాంకులు నీరవ్ మోదీకి రుణాలు మంజూర్ చేశాయి.

సాధారణంగా ఈ భరోసా పత్రాలను స్వల్ప వ్యవధి కోసం అంటే ఉదాహరణకు 90 రోజులు చెల్లుబాటులో ఉండేట్టుగా జారీ చేస్తారు. కాని సదరు ఉద్యోగి పరిమితికి మించి 365 రోజుల కాలానికి భరోసా పత్రాలు జారీ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ వ్యవహారం దాదాపు ఏడేళ్ల పాటు కొనసాగింది. అంటే మోదీ నడిపే సంస్థలు సరైన సమయానికి రుణాలు చెల్లిస్తే తప్ప ఇతర బ్యాంకులు రుణాలు ఇవ్వవు. మరి ఇటీవలి కాలంలో మోదీ తీసుకున్న రుణాలు చెల్లించకపోయినా ఈ నిబంధనలు అమలు కాలేదా? లేదా నిబంధనలకు వ్యతిరేకంగా భరోసా పత్రాలు అందజేసిన ఉద్యోగి స్థానంలో వచ్చిన మరో ఉద్యోగి ఈ ఎల్.ఓ.యు.లను ఇవ్వడానికి నిరాకరించారా? కీలకమైన ఈ అంశం నిగ్గు తేలాల్సి ఉందు.

ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయాలో స్పష్టత అవసరం. అలాగే తొందరపాటుతో ఏమీ చేయకూడదన్న విషయంలో కూడా స్పష్టత ఉండాలి. మొట్ట మొదట తేలాల్సింది ఈ ఎల్.ఓ.యు.ల ఆధారంగా తీసుకున్న రుణాల మొత్తం ఎంతో, ఆ డబ్బు వసూలు చేయడానికి కావాల్సిన ఆస్తులు నీరవ్ మోదీకి ఉన్నాయో లేదో తేల్చుకోవాలి. దీన్ని బట్టి పి.ఎన్.బి.కి జరిగిన నష్టాన్ని అంచనా వేయవచ్చు. జరిగిన నష్టం ఎంతో సత్వరం తేల్చాలి. ఎందుకంటే నష్టాన్ని గురించిన అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి.

అంతర్గత భద్రతా నిబంధనలను ఎలా ఉల్లంఘించగలిగారో తేలవలసిన రెండో అంశం. పి.ఎన్.బి. వాడుతున్న స్విఫ్ట్ వ్యవస్థ ఆ బ్యాంకు సాఫ్ట్ వేర్ కు అనుసంధానం కాలేదంటున్నారు. ఒక వేళ అలా జరిగి ఉంటే అంతర్గత ఆడిట్ లో ఈ విషయం ఎందుకు కనిపెట్టలేదో, ఈ ఆడిట్ పై మళ్లీ చేసే ఆడిట్ లో ఎందుకు బయటపడలేదో తేలాలి. రిజర్వూ బ్యాంకు పర్యవేక్షణలో లోపం ఉన్నందువల్లే ఈ అవకతవకలు జరిగాయని ప్రభుత్వం వాదిస్తోంది. సాధారణంగా బ్యాంకుల్లో జరిగే అవకతవకలను బయటపెట్టడం పర్యవేక్షక వ్యవస్థలకు సంబంధించింది కాదు. సంబంధిత బ్యాంకులు అవకతవకలు జరిగాయని చెప్పిన తర్వాతే పర్యవేక్షకులు ఆ అంశాన్ని పరిశీలిస్తారు. ్

పి.ఎన్.బి. కుంభకోణం బయటపడ్డ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభుత్వ పెత్తనం ఉన్నందువల్లే నియంత్రణ సవ్యంగా ఉండడం లేదని, మోసాలు జరుగుతున్నాయని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. బ్యాంకుల్లో లొసుగులను, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజర్లకు ప్రోత్సహకాలు లేవని కూడా చెప్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రైవేటీకరణ ఒక్కటే మార్గం అన్న రీతిలో మాట్లాడుతున్నారు.

అనేక సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు బ్యాంకుల్లో భారీ మోసాలు జరిగాయన్న వాస్తవాన్ని గమనిస్తే ప్రైవేటు రంగంలో మోసాలు జరగవు అన్న వాదన ఎంత హాస్యాస్పదమైందో గ్రహించవచ్చు. 1995లో నిక్ నెల్సన్ అనే ఒకే ఒక వ్యక్తి మోసానికి పాల్పడినందువల్ల బేరింగ్స్ అనే పెట్టుబడుల బ్యాంకు కుప్ప కూలింది. నియమ నిబంధనలను తుంగలో తొక్కి వ్యక్తులు ఈ ఆర్థిక సంస్థలను సర్వనాశనం చేసిన ఉదంతాలు కొల్లలుగా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రసిద్ధ బ్యాంకులు నియమ, నిబంధనలను ఉల్లంగించి భారీ మోసాలకు అవకాశం ఇచ్చినందుకు కోట్లాది డాలర్ల జరిమానాలు చెల్లించవలసి వచ్చింది. అనేక అంతర్జాతీయ బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థలలో ఇలాంటి మోసాలు లెక్కకు మిక్కిలిగానే జరిగాయి. ప్రైవేటు బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘించి లాభాలు సమకూరిస్తే ఆ బ్యాంకుల మేనేజర్లకు బోలెడు లాభం చేకూరుతుంది. బ్యాంకుల్లో మోసాలు, వైఫల్యాలు వాటి యాజమాన్యం ప్రైవేటుదా, ప్రభుత్వానిదా అన్న దానితో నిమిత్తం లేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో దుష్ప్రవర్తనకు ప్రైవేటీకరణే శరణ్యం అన్న వాదన కేవలం భ్రమే.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top