ప్రజా వేగులకు రక్షణ కరవు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
నగల వ్యాపారి నీరవ్ మోదీ, అతని అనుచరులు బ్యాంకులను రూ. 11,400 కోట్ల మేర మోసగించిన వ్యవహారంలో ప్రజా వేగుల పాత్రను విస్మరిస్తున్నాం. నిజానికి వారి పాత్ర చాలా ప్రధానమైంది. నీరవ్ మోదీ వ్యాపార భాగస్వామి, గీతాంజలి జెంస్ అధిపతి మెహుల్ చోక్సి వ్యవహార సరళి గురించి బెంగళూరుకు చెందిన హరి ప్రసాద్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని, కంపెనీల రిజిస్ట్రార్ ను 2016లోనే హెచ్చరించారు. అయినా చోక్సీ మీద ఏ చర్యా తీసుకోలేదు. ఈ విషయమై తాను ముందే హెచ్చరించానని హరి ప్రసాద్ మీడియాకు చెప్పేదాకా నీరవ్ మోదీ మోసాల విషయంలో చోక్సీ పేరు బయటకు రానే లేదు.
అధికారులు ఈ హెచ్చరకిను అంతగా పట్టించుకోలేదని ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. స్వర్ణ చతుర్భుజి రహదార్ల నిర్మాణ వ్యవహారంలో అవినీతిని బయటపెట్టినందుకు 2003లో యువ ఇంజినీరు సత్యేంద్ర దుబేను హత్య చేసినప్పటినుంచి ప్రజా వేగుల పరిస్థితి దారుణంగా ఉంది. దుబే హత్యకు గురైతే ఇతరులను బెదిరించారు. వారి మీద దౌర్జన్యం చేశారు. లేదా వారి హెచ్చరికలను చెవిన పెట్టలేదు.
2014లో ప్రజా వేగుల సం రక్షణ చట్టాన్ని లోక సభ ఆమోదించినా అది అమలులోకి రాలేదు. 2015లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించి అందులో ఉన్న కఠినతరమైన అంశాలను నీరుగార్చింది. తాము అవినీతిని తుదముట్టిస్తామని, ప్రజా వేగులకు రక్షణ కల్పిస్తామని విసుగు విరామం లేకుండా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ఈ పని చేయడం ఆశ్చర్యకరం. ప్రజా వేగులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నల్ల ధనం ఉన్న వారి మీద చర్యలు తీసుకుంటామని 2015లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో హామీ ఇచ్చారు.
ఈ హామీలు ఇచ్చినప్పటికీ మోదీ ప్రభుత్వం సవరించిన అధికార రహస్యాల చట్టం ప్రకారం ప్రజా వేగులకు రక్షణ మరింత కరవైంది. దేశ సార్వభౌమాధికారానికి, సమైక్యతకు, భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించే సమాచారంపై దర్యాప్తు జరిపించబోమని, అలాంటి సమాచారాన్ని బయటపెట్టబోమని, సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారాన్ని మాత్రమే బయటపెడ్తామని చెప్తున్నారు. ఇందులో మేధోపరమైన హక్కులు, వాణిజ్య రహస్యాలు కూడా ఉన్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అధికార రహస్యాల చట్టం లాగే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1) కూడా ఇలాంటి సమాచారాన్ని బయటపెట్టడాన్ని అనుమతించదు. కోర్టు కూడదన్న సమాచారాన్ని బయటపెట్టకూడదన్న సూత్రమూ ఇందులోకే వస్తుంది. వ్యక్తుల జీవితానికి ముప్పు ఉన్న సమాచారాన్ని, మంత్రివర్గంలో జరిగే కొన్ని చర్చలను, చట్ట సభల విశిష్ట అధికారాలకు భంగం కలిగించే సమాచారాన్ని కూడా బయట పెట్టరు.
ఐరోపా దేశాల్లో ప్రజా వేగుల రక్షణపై నివేదికలో ప్రజా వేగులను కాపడడానికి తగిన యంత్రాంగం, లోప రహితమైన చట్టం లేకపోతే అది అంతిమంగా పౌరులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తుందని పేర్కొన్నారు. అలాంటి చట్టాలు లేకపోతే యూరప్ దేశాలు, ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడే అవకాశం లేకుండాపోతుందని కూడా తెలియజేశారు. మన దేశంలో ప్రభుత్వ రంగంలోని, ప్రైవేటు కార్పొరేటు రంగంలోని అవినీతిని ఎక్కువగా బయటపెట్టింది ఈ ప్రజా వేగులే. ప్రజా సంక్షేమానికి నిబద్ధులైన ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు తమ ఉద్యోగాలను కడకు ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా అక్రమాలను బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. గుజరాత్ లో పోలీసు అధికారి సంజీవ్ భట్, భారత అటవీశాఖ అధికారి సంజీవ్ చతుర్వేది ఈ పనే చేశారు. వారు హర్యానాలో నియామకాలకు, దిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థలో అవకతవకలను బయట పెట్టారు. కార్పొరేట్ రంగంలో ప్రజా వేగులను కాపడడానికి అనుగుణమైన విధానాలు ఉన్నాయి. అయితే ఈ విధానాలు అమలు అవుతాయా లేదా కాగితాలకే పరిమితం అవుతాయా అన్నది చర్చనీయాంశం కావచ్చు. ఇటీవల ఒక విమానయాన కంపెనీ తన సహోద్యోగులు ఒక ప్రయాణికుడి మీద దాడి చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో బయట పెట్టినందుకు ఆ సంస్థ ఆ ఉద్యోగికి ఉద్వాసన చెప్పింది. దీన్నిబట్టి ఇలాంటి విధానాలు ఉన్నప్పటికీ అన్ని కంపెనీలు తమ విధానాలను అమలు చేయవని అర్థం అవుతోంది.
ఒక వేళ సమాచారం కోసం కేంద్ర సమాచార కమిషనర్ కు పెట్టుకున్న దరఖాస్తు విచారణలో ఉన్న సమయంలో సదరు వ్యక్తి కనక మరణిస్తే అడిగిన ప్రశ్న అంతటితో ముగుస్తుందని 2017 నాటి సమాచార హక్కు ముసాయిదా నిబంధనల్లో ఉంది. ఇది ప్రమాదకరమైన నిబంధన అని సమాచార హక్కు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కనీసం 65 మంది సమాచార హక్కు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. మరెంతో మంది మీద దౌర్జన్యం జరిగింది. వేధింపులకు గురయ్యారు.
దీనికి తోడు దేశంలో న్యాయం కలిగించే వ్యవస్థలో మరో సమస్య ఉంది. సాక్షులకు రక్షణ కల్పించే సదుపాయం లేదు. భారత లా కమిషన్, జాతీయ పోలీసు కమిషన్, నేర న్యాయ నిర్ణయ సంస్కరణలపై న్యాయమూర్తి మలిమత్ కమిటీ మొదలైనవి సాక్షులను రక్షించే విధానం ఉండాలని సిఫార్సు చేశాయి. కేసు విచారణకు వచ్చినప్పుడు సాక్షులు ఎదురు తిరగడం సర్వ సాధారణం. మధ్యప్రదేశ్ లోని వ్యాపం కేసులో, గుజరాత్ లోని బెస్ట్ బేకరీ కేసులో, దిల్లీలోని జస్సికా లాల్ కేసులో ఇలాగే జరిగింది. ఇటీవలి కాలంలో సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో కూడా ఇదే జరిగింది. ఈ కేసును ముంబైలో విచారిస్తున్నారు.
ప్రభుత్వం అవినీతిని నిర్మూలించాలని చిత్తశుద్ధితో అనుకుంటే, అవినీతిపై ఫిర్యాదు చేసే వారిని కాపాడాలనుకుంటే ప్రజావేగులకు, కోర్టులో సాక్ష్యం చెప్పే వారికి, సమాచార హక్కు కార్యకర్తలకు రక్షణ కల్పించడం తప్పని సరి. ప్రైవేటు కార్పొరేటు సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, తమ ఆత్మ ప్రబోధం ద్వారా అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని వ్యతిరేకించాలనే వ్యక్తులు ప్రజావేగులుగానే పని చేస్తారు. ప్రభుత్వం అవినీతిని నిర్మూలించాలనుకుంటే ఈ సాహసికులను కాపాడాల్సిందే.