ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మానవ హక్కులు సైన్యానికేనా!

Gautam Navlakha (gnavlakha@gmail.com) is a member of the People’s Union for Democratic Rights, Delhi.

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

కశ్మీర్ ప్రజలకు న్యాయం చేయడం కన్నా యుద్ధోన్మాదం ప్రదర్శించే అరిష్టకరమైన సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. షోపియాన్ జిల్లా గవన్పొరా గ్రామంలో జనవరి 27వ తేదీన జరిగిన కాల్పుల ఘటన సందర్భంగా ఒక సైనికాధికారిపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్.ఐ.ఆర్.) దాఖలు చేసే ప్రయత్నం జరిగింది. "సైనికుల ఆత్మస్థైర్యాన్ని కాపాడడం" అన్న అంశంపై దాఖలైన ఒక అర్జీని ఫిబ్రవరి 12న భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచి విచారించింది. ఆ కాల్పులకు బాధ్యుడైన 10 గడ్వాల్ రైఫల్స్ కు చెందిన మేజర్ ఆదిత్య కుమార్ పై జమ్మూ-కశ్మీర్ పోలీసులు "ఎలాంటి నిర్బంధ చర్యకు" పాల్పడకూడదని ఆ బెంచి ఏకపక్షంగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. అంతకు ముందు ఉద్యోగంలో ఉన్న సైనికుల పిల్లలు దాఖలు చేసిన "సైనికులపై అల్లరి మూకలు రాళ్లు విసరడం, దాడి చేయడం" అన్న పిటిషన్ ను విచారించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ "సైనికుల భద్రత గమనించదగిన అంశమే" అని భావించింది. కల్లోలిత ప్రాంతాలలో కేవలం అనుమానం ఆధారంగా భద్రతాదళాలకు కాల్పులు జరిపే అధికారం ఉన్న చోట సైనికుల మానవ హక్కుల విషయాన్ని పరిశీలిస్తున్న సందర్భంలో పౌరుల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై దర్యాప్తును నిషేధించారు కనక ఫిర్యాదు చేయడం కూడా కుదరదు.

జనవరి 27నాటి కాల్పులపై సైన్యం 28వ తేదీన ఒక ప్రకటనలో "ప్రామాణికమైన ప్రమాణాలనే పాటించాం" అని తెలియజేసింది. ఈ కాల్పుల్లో జావేద్ అహమద్ భట్, సుహైల్ జావేద్ లోన్, రయీస్ అహమద్ ఘని మరణించారు. ఒక జూనియర్ కమిషన్ అధికారిని జనం అంతమొందించకుండా చూడడానికి, తమ వాహనాన్ని దగ్ధం చేయకుండా కాపాడేందుకు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవలసి వచ్చింది అని సైన్యం చెప్తోంది. కాని సైన్యం ఇంతకన్నా ఏ వివరాలూ వెల్లడించలేదు.

వాస్తవాలు సైన్యం వాదనకు విరుద్ధంగా ఉన్నాయి. చాయి గుండ్ లో ఇద్దరు హిజ్బుల్ ముజహిదీన్ మిలిటెంట్లను హతమార్చిన నేపథ్యంలో గవన్పొరా మార్గంలో వెళ్ల కూడదని పోలీసులు సైన్యానికి సలహా ఇచ్చారని కశ్మీర్ ముఖ్యమంత్రి జనవరి 29న శాసన సభలో చెప్పారు. కాల్పుల్లో మరణించిన ఇద్దరు మిలిటెంట్లలో ఒకర్ గవన్పొరా ప్రాంతానికి చెందిన వారు. చాయ్ గుండ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతం కావడంతో పాటు మరో ముగ్గురు పౌరులు కూడా గాయపడ్డారు. ఈ కారణంగా జనంలో ఆగ్రహం ఎక్కువగా ఉంది. స్థానిక మిలిటెంట్లు మరణించడంతో పాటు పౌరులు కూడా గాయపడినందువల్ల జనంలో ఆగ్రహం పెల్లుబికింది.

సైన్యం పోలీసుల సలహా ఖాతరు చేయలేదు. మొదటి సైనిక వాహన శ్రేణి ఆ ప్రాంతం ద్వారా వెళ్లినప్పుడు స్థానిక మిలిటెంట్ల మృతికి జోహార్లు అర్పించిన ఒక పోస్టర్ విషయంలో సైనికులకు, స్థానిక ప్రజలకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. అదే రోజు మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో మేజర్ ఆదిత్య కుమార్ నాయకత్వంలో మరో సైనిక శ్రేణి గవన్పొరా ప్రాంతం గుండా వెళ్లాలని నిర్ణయించింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సమయంలో రెండు సార్లు ఆ ప్రాంతం గుండా వెళ్లాలని సైన్యం భావించడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. జూనియర్ కమిషన్ సైనికాధికారిని హతమార్చడానికి ప్రయత్నించారన్న వాదనను కూడా స్థానికులు నిరాకరిస్తున్నారు. సాయుధ శకటంలో ఉన్న సైనికాధికారిని వాహనంలోంచి లాగి చంపాలని ప్రయత్నించడం ఎలా సాధ్యం అన్నది వారి ప్రశ్న. 2017 మేలో ప్రారంభించిన "ఆపరేషన్ ఆల్ ఔట్" లో 217 మంది మిలిటెంట్ల ప్రాణాలు పోయాయి. 108 మంది పౌరులు, 125 మంది భద్రతా దళాల వారు కూడా ఇందులో హతమయ్యారు. మరణించిన 108 మంది పౌరుల్లో 19 మంది ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. చాయ్ గుండ్, గవన్పొరాలోఅయిదుగురు పౌరులు కాల్పుల్లో మృతి చెందారు.

ఏమైనప్పటికీ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడం కేవలం తొలి అడుగు మాత్రమే. సాధారణంగా సైనిక దళాలపై విచారణ పూర్తి కాదు. ఒక వేళ దర్యాప్తు జరిగి చార్జి షీట్ దాఖలైనా సైనికాధికారుల మీద క్రిమినల్ కేసులు దాఖలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంటుంది. సాయుధ దళాల వారిని చట్ట రీత్యా శిక్షించడం కోసం 50 మహజర్లు అందాయని, అందులో 47 దరఖాస్తులను తిరస్కరించామని, మిగతా మూడింటి విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉందని 2018 జనవరి ఒకటిన రక్షణ శాఖ మంత్రి రాజ్య సభలో లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఇందులో 17 ఉదంతాలు పౌరులను హతమార్చడానికి సంబంధించినవి అయితే 16 నిర్బంధంలో మరణాలకు, ఎనిమిది ఉదంతాలు నిర్బంధంలో ఉండగా మాయం కావడానికి, నాలుగు అత్యాచారం ఆరోపణలకు సంబంధించినవి.

28 ఏళ్లుగా జమ్మూ-కశ్మీర్ "కల్లోలిత ప్రాంతంగా"నే ఉంది. సైన్యం, భద్రతాదళాల వారి ఆగడాలకు జవాబుదారీ తనమే లేదు. 28 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితి ఇలాగే కొనసాగడం బీజేపీ ప్రభుత్వ ఆలోచనా రాహిత్యానికి నిదర్శనం. కశ్మీర్ లో ఈ పరిస్థితిని, సృష్టించి, సాగదీసి, కొనసాగించడానికే అన్ని ప్రభుత్వాలు ప్రయత్నించాయి తప్ప పరిష్కారం కోసం చేసింది ఏమీ లేదు. "మాకు ప్రభుత్వం నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు పరిహారం అవసరం లేదు. ఉద్యోగాలూ ఒద్దు. విచారణా కోరడం లేదు. కోర్టులు, సైన్యం, పోలీసులు, పరిపాలన మొదలైనవన్నీ ప్రభుత్వాలవే." అని సుహైల్ లోన్ తండ్రి జావేద్ అహమద్ లోన్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికతో మాట్లాడుతూ అన్నారు. ప్రజల అభిప్రాయం ఇలా ఉన్న స్థితిలో అఘాయిత్యాలకు పాల్పడే సైనికులకు రక్షణ కావాలనడం పరిహాసమే. షోపియాన్ లో సైనిక అణచివేతకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వైపరీత్యం ఏమిటంటే ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ పరిష్కారానికి సమీప భవిష్యత్తులో అవకాశం కనిపించనప్పుడు కశ్మీరీలు "ఆజాదీ" కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top