ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

నాగా ఎన్నికల్లో స్వార్థ ప్రయోజనాల సయ్యాట

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

వచ్చే ఫిబ్రవరి 27వ తేదీన నాగాలాండ్ శాసన సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటీకి పరిమితమైనవి కావు. అవి స్వార్థ ప్రయోజనానికీ, నైతిక సూత్రాలకు మధ్య ఘర్షణ కూడా. నాగాల భవిష్యత్తు వ్యవహారం తేలేదాకా ఎన్నికలను బహిష్కరించాలని 11 రాజకీయ పార్టీలు జనవరి 29న ఒక ఒప్పందానికి వచ్చాయి. కాని ఆ తర్వాత కొద్ది రోజులకే ఎన్నికల బహిష్కరణ ప్రతిపాదన వీగిపోయింది. ఎన్నికలు బహిష్కరించాలన్న ప్రకటనపై భారతీయ జనతా పార్టీ కూడా సంతకం చేసింది. ఆ తర్వాత బహిష్కరణ సూత్రానికి తిలోదకాలిచ్చి బీజేపీతో సహా వివిధ పార్టీలు స్వప్రయోజనాలకు పట్టం కట్టాయి. గతంలో 1998లో ఇతర పార్టీలన్నీ ఎన్నికలు బహిష్కరించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఇప్పుడు అలా ఇతర పార్టీలు విజయం సాధించకుండా ఉండడానికి తామే రూపొందించుకున్న సూత్రాన్ని విడనాడి స్వప్రయోజనానికి ప్రాధాన్యం ఇచ్చాయి.

నాగాలాండ్ లో ఎన్నికల పొత్తులు దేశంలో మిగతా ప్రాంతాల్లోలాగా ఉండవు. అవకాశాన్ని, అవసరాన్నిబట్టి పొత్తులు కుదురుతూ ఉంటాయి. ప్రస్తుతం శాసన సభ్యులుగా ఉన్న మొత్తం 60 మంది నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్.పి.ఎఫ్.) నాయకత్వంలోని డెమొక్రాటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ (డి.ఎ.ఎన్.)లో భాగస్వాములుగా ఉన్నారు. నిజానికి ప్రతిపక్షమే లేదు. దశాబ్దం పైగా బీజేపీ ఎన్.పి.ఎఫ్. తో ఉంది. ఎనిమిది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు 2015లో డి.ఎ.ఎన్.లో చేరిపోయారు. ఆ రకంగా కాంగ్రెస్, బీజేపీ ఒకే కూటమిలో చేరిపోయాయి. అయినా ఎన్నికలకు ముందు బీజేపీ ఎన్.పి.ఫ్. కు ప్రత్యర్థి పక్షమైన నేషనల్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్.డి.పి.పి.) తో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. మాజీ ముఖ్య మంత్రి నీఫీయూ నాయకత్వంలో ఎన్.డి.పి.పి. అవతరించింది. అయినా ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తుకు అవకాశం లేక పోలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ ప్రకటించారు. అంటే రెండు ప్రాంతీయ పార్టీలు ఒకే జాతీయ పార్టీతో కత్తు కలిపితే రెండు జాతీయ పార్టీలు ఒకే ప్రాంతీయ పార్టీతో కుమ్మక్కయ్యాయి.

ఇది విచిత్ర పరిస్థితి. అంటే ఎన్నికలలో గెలిచిన పక్షం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు కలిగి ఉంటుందన్న మాట. దశాబ్దాలుగా నాగాలాండ్ లో ఇదే పరిస్థితి ఉంది. అనేక ఈశాన్య రాష్ట్రాల లాగే నాగా లాండ్ కూడా కేంద్ర నిధుల మీద ఆధారపడిందే. అందువల్ల ఏ పార్టీ గెలిచినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీన విస్మరించలేదు.

ఇది అక్కడి రాజకీయాలకు చిహ్నం అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించే రాజకీయ పక్షాలు కూడా ఆ పార్టీని సమర్థించక తప్పని పరిస్థి ఉంది. నాగాలాండ్ లో నిజమైన ప్రతిపక్షం పౌర సమాజం, చర్చీ మాత్రమే. అక్కడ శక్తిమంతమైన నాగా లాండ్ బాప్టిస్ట్ చర్చి మాత్రం నాగాలు బీజేపీ నాయకత్వంలోని హిందుత్వ శక్తులకు దూరంగా ఉండాలని సూచించింది. "అభివృద్ధి, రాజకీయ ప్రయోజనాల కోసం మనం మత విషయాలలో రాజీ పడకూడదని ఇటీవల చర్చీ పేర్కొంది. ఎన్నికల కోసం మతాన్ని వినియోగించుకోవడంలో ఆరి తేరిన బీజేపీ ఏ జంకూ గొంకూ లేకుండా, వైపరీత్యం అనుకోకుండా “ఎన్నికల సమయంలో మతాల వారీగా జన సమీకరణ నాగా లాండ్ లో కొందరి వ్యూహం కావొచ్చు” అని వ్యాఖ్యానించింది. బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 20 మంది అభ్యర్థులు క్రైస్తవులే, నాగాలే. నాగా లాండ్ బాప్టిస్ట్ చర్చి పిలుపు ప్రభావం వీరి ఎన్నికపై ఉంటుందో లేదో వేచి చూడవలసిందే.

నాగా లాండ్ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం నాగా లాండ్ రాజకీయ భవిష్యత్తు ఏమిటో దీర్ఘ కాలంగా తేలకపోవడమే. 1963 లో నాగా లాండ్ ను పూర్తి స్థాయి రాష్ట్రంగా ప్రకటించినప్పటికీ అది ప్రత్యేక నాగా జాతి రాజ్యంగా అవతరించాలన్న కోరిక కనుమరుగు కానే లేదు. నాగా తిరుగుబాటు వర్గాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అడపా దడపా కాల్పుల ఒప్పందాలు కుదిరినందువల్ల తాత్కాలికంగా శాంతి నెలకొన్న మాట వాస్తవం. కాని ఘర్షణ ఆగనే లేదు. తిరుబాటుదారు వర్గాల్లో అతి పెద్దదైన నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ (ఐజాక్-ముయివా) 2015లో కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఏదో పరిష్కారం సాధ్యం అవుతుంది అన్న ఆశ రేకిత్తింది. అయితే ఈ ఒప్పందం స్వరూపం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అప్పుడప్పుడు ఏవో ప్రకటనలు మాత్రం వెలువడుతుంటాయి. ప్రశాంతత నెలకొంటుదన్న ఆశతోనే పౌర సమాజ బృందాలు, తిరుగుబాటు వర్గాలు, రాజకీయ పార్టీలు ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి.

ప్రస్తుత ఎన్నికల తర్వాత శాంతి నెలకొంటుందన్న ఆశ మాత్రం లేదు. నిధుల కొరత లేకపోయినా నాగా లాండ్ అభివృద్ధిలో తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. రోడ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. విద్యాధికులైన వారికి కూడా ఉద్యోగాలు లేవు. సామాన్య ప్రజలు తిరుగుబాటుదార్లకు "కప్పం" చెల్లించుకోవాల్సి వస్తోంది. దానివల్లా ఊరట లేదు. కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధుల వల్ల ఫలితం లేదు. ఈ డబ్బులో ఎక్కువ భాగం రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తోంది. అందుకే వారు అధికారం సంపాదించాలని వెంపర్లాడుతుంటారు. రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా అన్ని పక్షాల వైఖరి ఇదే.

రాజకీయాలు నేలబారుగా ఉన్నా పౌర సమాజం మీద ఇంకా ఆశ ఉంది. పౌర సమాజానికి చెందిన వారు శాంతి ప్రయత్నాలు చేశారు. రాజకీయాల్లో అవినీతి గురించి మాట్లాడారు. నిష్కళంక రాజకీయాలు కావాలని నినదించారు. గత సంవత్సరం నాగా మహిళా బృందాలు పరిపాలనలో స్త్రీల భాగస్వామ్య అంశం లేవనెత్తాయి. మునిసిపల్ సంస్థల్లో 33 % రిజర్వేషన్లు ఉండాలన్న తమ కోర్కెను మాత్రం నెరవేర్చుకోలేక పోయారు. కాని లింగ సమానత్వంపై చర్చ లేవనెత్తడంలో మాత్రం సఫలమయ్యారు. ఈ ఎన్నికల్లో కేవలం అయిదుగురు మహిళలు మాత్రమే పోటీ చేస్తున్నారు. 1963 నుంచి ఒక్క మహిళ కూడా శాసన సభకు ఎన్నిక కాలేదు. ఒక మహిళ మాత్రం పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పౌర సమాజం ఈ అంశాలనే ప్రస్తావిస్తోంది. అప్పుడు ఎన్నికల పేర జరుగుతున్న నాటకాన్ని పౌర సమాజం ఈసడిస్తోంది. నాగా లాండ్ లో పౌర సమాజం మీదే అంతో ఇంతో ఆశ ఉంది.

Back to Top