ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

విదేశాల్లో రెట్టింపు కష్టాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయ మహిళలు గృహహింసలో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. వీరు తమ కుటుంబానికి దూరంగా ఉంటారు. అక్కడి సంస్కృతి వాళ్లకు అదృష్టవశాత్తు కొత్తగానో, అధమపక్షం పరాయిదిగానో తోచవచ్చు. అయితే ఈమధ్యకాలంలో ఈ సమస్య కొత్త పోకడలు పోతోంది. భారతదేశంలోని వేర్వేరు సామాజిక- ఆర్థిక స్థాయుల నుంచి వలసబాట పడుతున్న స్త్రీల సంఖ్య పెరగడంతో, గృహహింసని ఎదుర్కొంటున్న స్త్రీల సంఖ్య కూడా పెరుగుతోంది.

గతవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రతి ఎనిమిది గంటలకి ఒక (రోజుకి ముగ్గురుగా భావించవచ్చు) ప్రవాస భారతీయ మహిళ నుంచి, తమను గృహ హింస నుంచి విముక్తులను చేయమంటూ ఫోన్ వస్తోంది. జనవరి 2015 నుంచి నవంబరు 2017 వరకు, ఒక్క విదేశాంగ శాఖే 3,328 అభ్యర్థనలను స్వీకరించింది. సహాయం కోసం ఈ శాఖే కాకుండా కుటుంబం లేదా ఇతర సంస్థలను సంప్రదించినవారు, ఎవరినీ సంప్రదించకుండా ఉన్నవారందరినీ కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా  ఎక్కువగా ఉండవచ్చు.

నిజానికి ‘‘ఎన్‌ఆర్‌ఐ భార్యలు’’గా ముద్రపడిన ఆడవారు విభిన్నమైన నేపథ్యాలని ప్రతిబింబిస్తారు. అధికారిక, అనధికారిక అధ్యయనాల ప్రకారం పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్‌ల నుంచి అధిక సంఖ్యలో ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఈ రాష్ట్రాలలో వేధింపులకు లేదా మోసానికి గురైన స్త్రీలకు సంబంధించిన కేసులు చాలానే పెండింగులో ఉన్నాయి. వీటిలో వివాహం తర్వాత వదిలిపెట్టేయడం (భారతదేశంలోనో విదేశంలోనో), రెండో పెళ్లి చేసుకోవడం (అప్పటికే సదరు వ్యక్తికి విదేశాల్లో ఒక భార్య ఉండి ఉండటం), ఆ వ్యక్తికి సంబంధించిన ఉద్యోగ ఆదాయాలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం, కట్నం కోసం వేధింపులు, గృహ హింస, తప్పుడు పత్రాల ఆధారంగా ఏకపక్షంగా విడాకులు ఇవ్వడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

భారతీయులు అధికంగా నివసించే యునైటెడ్ కింగ్‌డమ్‌, అమెరికా, పశ్చిమాసియాలలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కొద్దిపాటి అక్షరాస్యత నుంచి ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాడ్యుయేట్ల వరకూ… ఈ స్త్రీలు విభిన్నమైన విద్యా నేపథ్యాలకి సంబంధించినవారై ఉంటున్నారు. అమెరికా నుంచి వస్తున్న ఫిర్యాదులలో చాలావరకు హెచ్‌4 వీసాలు ఉన్న ఆడవారి నుంచే వినిపిస్తున్నాయి. వీరు సాధారణంగా హెచ్‌1బి వీసా ఉన్న భర్తల మీద ఆధారపడుతూ ఉంటారు. 2015లో ఒబామా ప్రభుత్వం, హెచ్‌4 వీసా ఉన్నవారు కూడా వర్క్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినైతే ఇచ్చింది. కానీ అమెరికాలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో, ఇదేమంత తేలిక కాకపోవచ్చు.

ఈ సమస్య వెనుక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంక్లిష్టతలను గుర్తుచేసే రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి- కూతుళ్లు ఎంత చదువుకున్నవారైనా, ఆర్థికంగా ఎంత స్వతంత్రంగా ఉన్నా…. వారికి పెళ్లి చేసేయాలనే తొందర. లేకపోతే వారిని సంఘంలో తలవంపులుగాను, భారమైన నిందగాను భావిస్తుంటారు. రెండోది- దూరపు కొండలు నునుపు అనే చందాన, వివాహం లేదా ప్రవాసం ద్వారా తమ పిల్లలను విదేశాలకు పంపాలనుకునే అత్యాశ. చాలామంది భారతీయ స్త్రీలకు వివాహం ద్వారా విదేశాలకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి, వారికోసం ఓ ప్రవాస భారతీయుడైన భర్తను వెతికేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు.

ఇదే కాకుండా సామాజిక, సాంస్కృతిక స్వభావం కలిగిన మరికొన్ని అంశాలని కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ‘‘అబ్బాయి తరఫు’’ వారికి కోపం వస్తుందేమో అన్న భయంతో, వరుడి పూర్వాపరాలు సరిగా విచారించకపోవడం వీటిలో ముఖ్యమైనది. భారతీయ సమాజంలో కులాలకు, వర్గాలకు అతీతంగా… ఇంటిని నడిపించడానికీ, భర్త తాలూకు తల్లిదండ్రులను కుటుంబాన్నీ చూసుకోవడానికి ఒక భార్య తప్పనిసరిగా భావించే దృక్పథం మరొకటి. వరుడి నుంచి వినవచ్చే ఈ కారణం సహేతుకమే అని వధువు తల్లిదండ్రులు భావిస్తున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విదేశాల్లో పనిమనుషుల కోసం చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ ఖరీదైన పనిమనుషులకి చవకబారు ప్రత్యామ్నాయంగా తమని వినియోగించుకోవడం చాలామంది ఆడవారికి మింగుడుపడకపోవచ్చు.

భారతీయుల ఊహల్లో, విదేశీ నివాసం చాలా ఈర్ష్య కలిగించే అంశం. విదేశాల్లో నివసించేవారు తమ కుటుంబానికే కాకుండా ఇతరులకు కూడా సాయం చేసే తీరు ఈమధ్యకాలంలో పెరిగిపోతోంది (సుమారు 15.6 మిలియన్ల భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారు). ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం వారి సంపాదననీ, పరపతినీ కూడా మరింత క్రియాశీలంగా వినియోగించే ప్రయత్నంలో ఉంది.

ఈ పరిస్థితులలో… ఎవరో ఫిర్యాదు చేసే దాకా వేచి చూడకుండా, భారత ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన  అవసరం ఉంది (ఇలాంటి పిర్యాదులను పరిష్కరించేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది). విదేశాల్లో ఉన్న నిందితులను మన దేశానికి తీసుకువచ్చి, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం అసాధ్యం కాకపోయినా, ఏమంత తేలికైన విషయం కూడా కాదు. ప్రస్తుతానికి మన న్యాయవ్యవస్థ ముందున్న ముఖ్యమైన సవాలు ఇదే! ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కమిటీ సూచనల ప్రకారం… భార్యలను వదిలేసే లేదా వేధింపులకు గురిచేసే ప్రవాస భారతీయుల పాస్‌పోర్టులను రద్దు చేయడం, నిందితుల పరస్పర అప్పగింతకు సంబంధించిన ఒప్పందాలకు అనుగుణంగా వారి మీద గృహ హింస కేసులను నమోదు చేయడం, విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలకు మరింత ఆర్థిక సాయం అందేలా చూడటం వంటి చర్యలు తీసుకోవాలి.

ఇవే కాకుండా… ఒక కేంద్రీకృత చట్టం అమలులోకి వచ్చేవరకు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పెళ్లిళ్లను తప్పనిసరిగా రిజిస్టరు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో వధువుకి సంబంధించిన చట్టపరమైన వివరాలన్నీ కూడా నమోదు చేయాలి. దీంతో పాటు, ఇలాంటి ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించేందుకు ఒక జాతీయస్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

ఈ సమస్యని పైన పేర్కొన్న విషయాల నుంచి వేరుగా చూడలేం. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పాటుగా, అన్ని శాఖలు కూడా బహుముఖ వ్యూహాలను అనుసరించాల్సి ఉంది. ఎందుకంటే భారతీయ స్త్రీలు ఎదుర్కొనే తీవ్రమైన సమస్యలలో ఇది ఒకటి. దీంతో వారు తమ జీవితాలను గౌరవంగా గడపలేకపోవడమే కాకుండా, సమాజంలో తమ వంతు పాత్రని కూడా పోషించలేకపోతున్నారు. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top