ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

అనుమానాలు తీర్చని రాఫేల్ తీర్పు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయాన్న ఆరోపణలపై దర్యాప్తు సంఘం ఏర్పాటు చేయడానికి నిరాకరించడంద్వారా సుప్రీంకోర్టు తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్టు, అసంపూర్ణంగా నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ తీర్పులోని వాస్తవాల లోపంపై అనేకమంది ఇదివరకే వ్యాఖ్యానించారు. ఇందులో ప్రధానమమైంది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇదివరకే నివేదిక తయారు చేసి పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిందన్నది. సుప్రీంకోర్టు అవగాహనలో ఈ లోపం ప్రజలు గమనించారు. సుప్రీంకోర్టు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని, న్యాయపరమైన విశ్లేషణ చేయలేదన్న అభిప్రాయం ప్రజలలో బలంగా ఉంది.

ఈ పొరపాట్ల కారణంగా అత్యున్నత న్యాయస్థానం హడావుడిగా విచారణ తంతు ముంగించినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో మొదట దాఖలైన పిటీషన్లు అరకొరగా, అసమగ్రంగా ఉన్నందువల్ల వాటిని తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదు. కాని ఆ తర్వాత సవివరమైన పిటిషన్లు దాఖలు చేసిన విషయం వాస్తవం. అయినప్పటికీ విచారణ ప్రక్రియ జరుగినన్నాళ్లు అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో లోతుగా విచారించవలసిన అవసరం ఉందని ఏ నాడూ భావించలేదు.

విచారణ సమయంలో జరిగిన సంఘటనలు కూడా సర్వోన్నత న్యాయస్థానానికి వన్నె తెచ్చేవి కావు. రాఫేల్ యుద్ధ విమానాల ధరకు సంబంధించిన అంశం పట్టించుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకుని ధరకు సంబంధించిన వివరాలన్నీ "సీల్డ్ కవర్" లో తమకు అందజేయాలని ఆదేశించింది. తీరా ప్రభుత్వం ఆ పని చేసిన తర్వాత యుద్ధ విమానాల కొనుగోలులోని అవకతవకలను ఎత్తి చూపుతూ పిటిషన్లు దాఖలు చేసిన వారు ప్రభుత్వ వాదనను నిశితంగా ప్రశ్నించడానికి వీలు లేకుండా ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. కాగ్ నివేదిక, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ఇది పొరపాటే. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా న్యాయస్థానాన్ని పెడదోవ పట్టించిందా లేక జరుగుతున్న ప్రచారాన్ని న్యాయస్థానం తప్పుగా వ్యాఖ్యానించిందా అన్న విషయం స్పష్టంగా తెలియదు. ధరకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం "సీల్డ్ కవర్" లో అందజేసింది కనక దాని మీద పిటిషనర్లు ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వకపోవడం న్యాయస్థానం చేయవలసిన పని కాదు.

ఆయుధ సేకరణ అవసరమా కాదా అనే విషయాన్ని తేల్చడానికి సాంకేతికంగా తాము సమర్థులం కాము అని చెప్పిన న్యాయస్థానమే భారత వైమానిక దళానికి ఈ యుద్ధ విమానాలు అవసరమని వ్యాఖ్యానించడం విచిత్రమే. విచారణ సమయంలో వైమానిక దళాధికారులతో అసమగ్రమైన సంప్రదింపులు జరిపిన తర్వాత న్యాయస్థానం ఈ నిర్ధారణకు వచ్చినట్టుంది. వైమానిక దళ అధికారులు నివేదించిన అంశాలు ప్రమాణం చేసి చెప్పినవో లేదా లిఖిత రూపంలో అందజేసినవో కావు. వారు కింది కోర్టులో చెప్పిన విషయాలలో తేడా ఉండవచ్చు. అయినా సుప్రీంకోర్టు ఈ అంశంపై లోతైన దర్యాప్తు అవసరమని భావించలేదు.

ఈ మొత్తం వ్యవహారంలో జరిగింది ఏమిటంటే ఈ వివాదం సమసి పోనూ లేదు. సత్యం వెలికి రానూ లేదు. ప్రజల అనుమానాలు తీరనూ లేదు. అనేక ప్రశ్నలను నివృతి చేయకుండానే లోతైన విచారణకు ఆదేశించకుండానే సుప్రీంకోర్టు తీర్పు ముగిసింది. ఇలాంటి వివాదాలను పరిష్కరించడంలో న్యాయవ్యవస్థ సామర్థ్యం అనుమానాస్పదంగా మిగిలిపోయింది.

కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఎ. రెండవ విడత పాలనలో జరిగాయంటున్న అనేక కుంభకోణాలు బయటపెట్టడంలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వాన్ని నిలదీయడానికి మాత్రం సంసిద్ధత కనబరచలేదు. పెద్ద నోట్ల రద్దు, న్యాయమూర్తి బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయా మృతి వ్యవహారంపై కూడా సుప్రీంకోర్టు అంత శ్రద్ధ కనబరిచినట్టు లేదు. దీన్నిబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం అనుమతించిన మేరకే అత్యున్నత న్యాయస్థానం క్రియాశీలంగా ఉంటుందని అనుకోవలసి వస్తుంది. ఇది దారుణమైన విమర్శ అయితే కావచ్చు.

కానీ ఇలాంటి నిర్ధారణవల్ల కొన్ని సత్యాలు మరుగునపడి పోతాయి. గతంలో కాగ్ రూపొందించిన కొన్ని ముసాయిదా నివేదికలలోని అంశాలను సుప్రీంకోర్టు తీవ్రమైనవిగా పరిగణించిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ పని చేస్తున్నట్టు కనిపించడం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ.) విచారణల మీద సుప్రీంకోర్టు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది. కానీ సి.బి.ఐ.లో ఇటీవల ప్రభుత్వ జోక్యం విపరీతంగా ఉన్న వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు. అంతర్గత కలహాలవల్ల సి.బి.ఐ. పరిస్థితి గందరగోళంగా ఉంది. సి.బి.ఐ. పని తీరు మీద నిఘా వేసి ఉంచవలసిన బాధ్యత ఉన్న కేంద్ర నిఘా వ్యవస్థ (సి.వి.సి.) పరిస్థితి చేయి దాటిపోయేదాకా కలగజేసుకోనే లేదు. చట్టం ప్రకారం వివిధ సంస్థలు సవ్యంగా పని చేయని స్థితిలో రాఫేల్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం చీకట్లో కత్తి యుద్ధం చేసినట్టుగానే ఉంటుంది.

యుద్ధ విమానాల కొనుగోలులో ఏ లోపమూ లేనట్టు సుప్రీంకోర్టు భావించడమే తీర్పులో స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ప్రభుత్వం అందజేసిన సమాచారం మీద మాత్రమే ఆధారపడి హడావుడిగా తీర్పు చెప్పడానికి సుప్రీంకోర్టు ప్రయత్నించింది. సమగ్రమైన తీర్పు వెలువరించడానికి అవసరమైన సమాచారం అంతటినీ ఉన్నత న్యాయస్థానానికి అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నా అలా జరగలేదు. ఇలాంటి స్థితిలో కోర్టు పూర్తి సమాచారం అందించాలని అడగాల్సింది. ఈ కేసులో మరింత సమగ్రమైన తీర్పు వెలువడవలసిన అవసరం ఉందన్న అభిప్రాయం కలుగుతోంది.

వివిధ వ్యవస్థలు సహకరించినా కోర్టు చూపే చొరవ న్యాయం జరగడానికి, విస్తృతమైన రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరడానికి తోడ్పడతాయన్న నమ్మకం కలగడం లేదు. 2జి కేసులో సుప్రీంకోర్టు ఎంత ఆసక్తి చూపినా, హడావుడి కనబరచినా తుది తీర్పులో మాత్రం ఒక్కరూ దోషిగా తేలలేదు. 

రాఫేల్ వ్యవహారంలాంటి విషయాల్లో ఏదో ఒక దశలో సుప్రీంకోర్టు సవ్యమైన ప్రక్రియ అనుసరించాలి. తన పాత్ర ఏమిటో నిర్ధారించుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పులు సమతూకంతో ఉండాలా? లేక వాస్తవం బయటపెట్టేవిగా ఉండాలా? సుప్రీంకోర్టుకు ఏదో ఒక పక్షం వేపు నిలబడే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు వ్యవహారాన్నే నిశితంగా పరిశీలిస్తున్న దశలో ఆ వ్యవస్థ ఆత్మపరీశీలన చేసుకోవడాన్ని వాయిదా వేయడం కుదరదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top