ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

గమ్యం తెలియని ప్రస్థానం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

బడ్జెట్ ప్రతిపాదించడానికి ఉన్న ప్రాధాన్యత అంతకంతకూ తగ్గిపోతోంది. అయినా ప్రభుత్వం దృష్టిలో్ ఒక తంతుగానైనా బడ్జెట్ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఉంది. అంతర్జాతీయ రుణ సంస్థలను సంతృప్తి పరచడానికి ద్రవ్య నియంత్రణా చర్యలు చేపట్టడానికి బడ్జెట్ ఒక సాధనంగా మారినా ప్రభుత్వం మాత్రం తాము ప్రజలపక్షపాతమే అని చెప్పుకోవడానికి బడ్జెట్ ను వినియోగించుకుంటున్నాయి.

ఈ సంవత్సరం బడ్జెట్ ప్రస్తుత ప్రభుత్వ రాజకీయ దృష్టికి అనుగుణంగా ఉంది. బడ్జెట్ ప్రసంగాన్ని మీడియా దృష్టిని ఆకర్షించడానికి అనువుగా రూపొందించారు. ఈ ప్రసంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అనువుగా లేదు. విప్లవాత్మకమైన విధానాలు ఈ బడ్జెట్ లో ఉన్నాయని ప్రభుత్వం చెప్పుకుంటున్నా నిజానికి అది పాత పథకాలను కొత్తగా చూపించడమే. ప్రభుత్వ ఉద్దేశాలను విధానాలుగా చెలామణి చేస్తున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలను మీడియా ప్రశ్నించడం లేదు.

అయినప్పటికీ ఈ బడ్జెట్ లో ఏముందో పరిశీలిద్దాం. ఈ బడ్జెట్లో ప్రభుత్వ వ్యయం గత సంవత్సరం కన్నా 10.1% ఎక్కువ. అయితే ఇది 2017-18 కన్నా 2018-19లో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) 11.5 శాతం పెరగనుంది. కాని ఈ బడ్జెట్ లో చూపిన ప్రభుత్వ వ్యయం అంతకన్నా తక్కువే. జి.డి.పి.పెరుగుదల గత సంవత్సరం ఉన్న 12.3 శాతం పెరుగుదల కన్నా తక్కువే. 2017-18 తో పోలిస్తే 2018-19లో స్థూల రెవెన్యూ ఆదాయం 16.7% పెరుగుతుందన్న ఆశాభావం ఉంది. 2017-18లో మొత్తం ప్రభుత్వ వ్యయం అంచనాల కన్నా ఎక్కువ. మూలధన వ్యయం అంచనా వేసిన దానికన్నా రూ. 36,357 కోట్లు తగ్గింది. 2016-17 లో మూలధన వ్యయం కన్నా 2017-18లో తగ్గింది. మూల ధన వ్యయం పెరిగితే ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. ఆస్తులు ఏర్పడతాయి. 2017-18లో "భారీ, మధ్య తరహా నీటిపారుదల పథకాలపై" ప్రభుత్వ వ్యయం తగ్గించినందువల్ల ప్రభుత్వ వ్యయం తగ్గింది. 2014-15 నుంచి 2018-19లో ప్రతి ఏటా 10.4% పెరిగింది. కాని ఇది 2009-10 నుంచి 2013-14 వరకు 16.4% ఉండేది. ప్రభుత్వ పెట్టుబడి ప్రైవేటు కార్పొరేటు పెట్టుబడితో కలిసిపోవడం, ద్వంద్వ జమా ఖర్చుల పట్టీ సమస్య ఉంది కనక సమస్య మరింత జటిలం అవుతుంది.

2018-19 జి.డి.పి.లో ద్రవ్య లోటు (రాబడి కన్నా ఖర్చులు ఎక్కువ కావడం) 3.5 శాతం ఉంటుందని అంటున్నారు. మునుపటి లక్ష్యాలతో పోల్చుకుంటే ఇది ఎక్కువే. కాని అసలు జి.డి.పి. ఇంత ఉంటుంది అన్న అంచనాలే అవాస్తవికమైనవి గనక ద్రవ్య లోటు కూడా పెరిగిపోవచ్చు. 2017-18లో ద్రవ్య లోటు పెరగడానికి కారణం రెవెన్యూ వసూళ్లు తగ్గడమే. ద్రవ్య లోటు తగ్గుతుందని అంచనా వేయడం, కొత్త "రుణ నియమాలు" ప్రవేశ పెట్టి రుణాలు జి.డి.పి.లో 40 శాతం మించకూడన్న నియమం ఉండడం, ప్రభుత్వం కొత్త ద్రవ్యలోటు తగ్గించే విధానాన్ని అనుసరిస్తుంది అనడం వల్ల బడ్జెట్ దృష్టి అంతా దీని మీదే ఉంది.

ఇక రాజకీయ దృష్టితో చూస్తే 2017-18లో విస్తారంగా కనిపించిన గ్రామీణ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా బడ్జెట్ రూపొందిస్తుందని ఆశించాం. గత సంవత్సరం రైతులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. వ్యవసాయం వల్ల నష్టాలు వచ్చాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దే విధానాలు రూపొందించనే లేదు. బడ్జెట్ ప్రసంగంలో మాత్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకున్నారు. కాని ఆ రంగానికి కేటాయించిన నిధులను చూస్తే నిరాశే మిగులుతుంది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం ఎక్కువ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. కాని ఆ వెంటనే రైతులకు తగిన ధర లభించేట్టుగా తగిన విధానాన్ని రూపొందించాలని నీతి ఆయోగ్ ను ఆదేశించారు. 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు గిట్టుబాటు ధర మీద ఎక్కువ యాగీ చేసింది. నిజానికి ఇది కేవలం చెల్లని వాగ్దానం కిందే మిగిలి పోయింది. ఇంకా దీనికి సంబంధించిన విధాన రూపకల్పనే జరగలేదు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకు కేటాయించింది కూడా నామమాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పెట్టుబడికి అవకాశం కల్పించే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు కూడా నిధుల కేటాయింపు పెరగలేదు. కాని ఆర్థికమంత్రి మాత్రం రోడ్ల నిర్మాణానికి పెట్టుకున్న గడువు ఇంతకు ముందు 2022 అయితే ఇప్పుడు దాన్ని 2019 కి కుదించామని చెప్పారు. ఇది కేవలం కంటి తుడుపు మాత్రమే. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన తమ పథకాల్లోకెల్లా గొప్పదని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అలాగే 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానం, ఆరోగ్య, స్వస్థత కేంద్రాలు, నిగూఢమైన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం గురించి కూడా బడ్జెట్ లో గొప్పగా చెప్పుకున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనకు కేటాయించింది కేవలం రూ. 1, 313 కోట్లు. 1.5 లక్షల ఆరోగ్య, స్వస్థత కేంద్రాలకు కేటాయించింది రూ. 1, 200 కోట్లే. కొత్తగా ప్రకటించిన ఆరోగ్య బీమా పథకం ప్రపంచంలోకెల్లా పెద్దది అని చెప్తున్నారు. నిజానికి బీమా పథకానికి ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ రంగు పులుముతోంది. దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ సబ్సిడీతో ఆరోగ్య పరిరక్షణకు అవకాశం లేకుండా పోతుంది. ప్రజలు సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిందే. పైగా ఈ పథకానికి ఈ బడ్జెట్ లో ఏమీ కేటాయించలేదు. ఈ పథకాన్ని 2016-17 బడ్జెట్ లోనే ప్రతిపాదించారు. కాని అది కాబినెట్ పరిశీలనకే పరిమితమైంది.

ప్రధానమంత్రి మాత్రు వందన యోజన (పి.ఎం.ఎం.వి.వై.) కి కూడా బడ్జెట్ లో నిర్లక్ష్యమే ఎదురైంది. ఈ పథకానికి కేటాయిస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవని, దీని అమలు అరకొరగా ఉందని 60 మంది ఆర్థికశాస్త్రవేత్తలు కేంద్ర ఆర్థిక మంత్రికి 2017 డెసెంబర్ లోనే లేఖ రాశారు. 2013 నాటి ఆహార భద్రత చట్టం కింద ప్రభుత్వమే ప్రసూతి సదుపాయాలు కల్పించాలని ఉంది. ఈ పథకం అమలు బాధ్యత కేంద్రం-రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం రూ. 8000 కోట్లు కేటాయించాలి. 2017-18 బడ్జెట్ అంచనాలలో రూ 2,700 కోట్లు, ఈ బడ్జెట్లో కేవలం రూ 2, 400 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం కింద ఇస్తున్న రూ. 200 ను రూ. 500 కు పెంచాలని, వితంతువులకు ఇచ్చే పింఛన్ రూ. 300 నుంచి రూ 500 కు పెంచాలన్న సూచనను కూడా ఈ బడ్జెట్ లో విస్మరించారు.

వనరుల సమీకరణ కోసం ఈ బడ్జెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి లాభంపై లక్ష కన్నా ఎక్కువ సొమ్ముపై 10% పన్ను విధించారు. ఇదివరకున్న 3% విద్యా సెస్సు స్థానంలో కొత్తగా 4% ఆరోగ్య, విద్యా సెస్సు వల్ల ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుంది. పైగా దీని వల్ల సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వవలసిన అవసరం లేదు. "వేతనాలు తీసుకునే వారికి పన్ను రాయితీ" పద్దు కింద ఇచ్చిన రాయితీ అల్లా ప్రామాణిక తగ్గింపులను రూ. 40000 కు పెంచడం నామ మాత్రమే కనక దానికి ఆ శీర్షికే దండగ.

ఈ ప్రభుత్వం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 14వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీపై కొత్త సూత్రం అమలులోకి వచ్చింది. సామాజిక రంగ బాధ్యతను రాష్ట్రాలే ప్రధానంగా భరించవలసి వస్తోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత నుంచి అంటే 2014 ఆగస్టు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. 2014 ఆగస్టులో పీపా ముడి చమురు ధర 100 డాలర్లు ఉంటే 2016 జనవరి నాటికి ఆ ధర పీపాకు 30 డాలర్లకు పడిపోయింది. ఇలాంటి సానుకూల పరిస్థితి ఇప్పుడు తగ్గింది. ప్రస్తుతం పీపా ధర 60 డాలర్లు ఉంటే ఇది క్రమేణా పెరుగుతుందంటున్నారు. ధర తగ్గినప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల ధర తగ్గించకుండా పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వం అధికాదాయం సమకూర్చుకుంది. దిగుమతుల బిల్లు తగ్గినందువల్ల వాణిజ్య లోటు కూడా తగ్గింది. చమురు దిగుమతి ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. కానీ ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం తమ ఘనతే అని ప్రభుత్వం చెప్పుకుంది. 2014 ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం ధరల పెరుగుదల వ్యవహారాన్ని ప్రచారానికి బాగా ఉపయోగించుకుంది. యూపీఏ ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ద్రవ్యోల్బణం తగ్గినా మోదీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడంలో మాత్రం విఫలమైంది. వస్తూత్పత్తిని పెంచలేక పోయింది. ఎగుమతులు కునారిల్లి పోయాయి. అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడ్డా మన ఎగుమతులు మాత్రం పెరగలేదు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే పెట్టుబడులు తగ్గు ముఖం పట్టినా ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ప్రభుత్వ పెట్టుబడి కూడా చతికిల పడింది. ఆర్థికంగా చూస్తే కొరగాని బడ్జెట్ ప్రతిపాదించి దానికి పురోగతి ముసుగు కప్పడానికి ప్రయత్నించారు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top