ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పరువు తీసిన పటేల్ విగ్రహం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

నరేంద్ర మోదీ అత్యుత్సాహంతో ఏర్పాటు చేయించిన బృహద్ "సమైక్యతా ప్రతిమ" ప్రపంచ రాజకీయ రంగంలో మన దేశాన్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది. "600 అడుగుల ఎత్తయిన ఈ ప్రతిమ ప్రపంచ రాజకీయాల్లో భారత్ కు ఉన్న అత్యుత్సాహాన్ని నిరూపించడమే కాక ఆ దేశ నాయకుడి రాజకీయ అహం ఎంతుందో కూడా రుజువు చేసింది" అని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వ్యాఖ్యానించింది. ప్రతిమలు నిర్మించడం మీద ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టగలిగిన దేశానికి సహాయం అందించడం హాస్యాస్పదం అని బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు పీటర్ బోన్ వ్యాఖ్యానించారు. ఈ విగ్రహం కోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడ్తున్న దశలోనే భారత్ సామాజిక రంగంలో వ్యయం చేయడానికి 1.1. బిలియన్ పౌన్ల (సుమారు రూ. 9,96,81,355,76 కోట్లు) సహాయం బ్రిటన్ నుంచి స్వీకరించింది. ఈ ప్రతిమ ఏర్పాటు చేయడంపై "అధికార వర్గాలలో" మాత్రమే ఆనందాతిరేకాలు వ్యక్తమైనాయి. సామాన్యులు, ముఖ్యంగా ఈ పథకంవల్ల నిర్వాసితులైన గిరిజనులు బాధనే వ్యక్తం చేశారు. అయినా మోదీ మాత్రం "భారత్ అస్తిత్వాన్ని ప్రశ్నించే వారందరికీ ఈ విగ్రహమే సమాధానం. ఇది మన ఇంజీనీరింగ్, సాంకేతిక శక్తికి నిదర్శనం" అని చెప్పారు. అంతే కాక ఇది దేశానికి అద్భుతమైన "కానుక" అని కూడా మోదీ అన్నారు. మోదీ చెప్పిన కారణాలకోసం భారీ మొత్తం ఖర్చు పెట్టవలసి వచ్చింది.

కానీ అసలు ఖర్చు ఎంతో ఎవరికి తెలుసు కనక? ఈ విగ్రహానికి సంబంధించిన అనేక పత్రాలను పోల్చి చూసినప్పుడు బయటికి చెప్పిన ఖర్చు రికార్డులలో నమోదైన ఖర్చుకన్నా చాలా తక్కువ అని తేలుతోంది. ఈ పథకానికి రూ. 2,980 కోట్లు ఖర్చయిందని మీడియాలో పదే పదే వార్తలు వచ్చాయి. కానీ ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం 2014-15 నుంచి ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాలు చూస్తే ఈ విషయం తెలుస్తోంది. 2014-15, 2017-18 కేంద్ర బడ్జెట్ లో రూ. 399 కోట్లు అదనంగా కేటాయించారు. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థలు, వ్యక్తులు రూ.550 కోట్ల మేర విరాళాలు సమకూర్చినట్టు సర్దార్ సరోవర్ నర్మదా నిగం లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ తెలియజేశారు. ఈ మూడింటినీ కూడితే మొత్తం ఖర్చు రూ.3,839 కోట్లు అవుతుంది. తరచుగా చెప్తున్న అయిన ఖర్చుకన్నా ఇది 1.3 రెట్లు ఎక్కువ. అంతే గాక కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి రూ. 146.83 కోట్లు కేటాయించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఖర్చును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆమోదించలేదు. జాతీయ వారసత్వ పరిరక్షణ కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఖర్చు పెట్టడానికి వీల్లేదని కాగ్ తేల్చి చెప్పింది. 2013 నాటి కంపెనీల చట్టంలోని షెడ్యూలు 7 ప్రకారం ఇలా వెచ్చించడం చెల్లదు.

భారతీయ జనతా పార్టీ, మోదీ వల్లభ భాయి పటేల్ వారసత్వాన్ని సొంతం చేసుకోవలని చేస్తున్న ప్రయత్నంలో తాము తలపెట్టే బృహద్ కార్యాలకు "వారసత్వ" ముసుగు వేయాలన్న పైకి చెప్పని ఉద్దేశం కూడా ఉంది. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులను మళ్లించడంవంటి ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు ప్రజల మదిలోంచి చెరిపి వేయడానికి ఉపకరించవు. సామాజిక బాధ్యత నిర్వహించడానికి కేటాయించిన నిధులను అనుత్పాదక పనుల కోసం వెచ్చించకూడదు. మన దేశంలో సామాజిక బాధ్యత కోసం పెడ్తున్న ఖర్చు చాలా మందకొడిగానే పెరుగుతోంది. ఇందులో 60 శాతం ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, మంచి నీరు, పారిశుధ్యం, విద్య, జీవనోపాధి కల్పన కోసమే ఖర్చు అవుతోంది. సామాజిక రంగం నుంచి ప్రభుత్వం క్రమంగా నిష్క్రమిస్తున్నందువల్ల సామాజిక బాధ్యత కోసం ఉద్దేశించిన మొత్తాన్ని దారి మళ్లించడం ఆమోదయోగ్యం కానే కాదు. గుజరాత్ విషయంలోనే చూస్తే ప్రభుత్వ అభివృద్ధి వ్యయం 70 శాతం నుంచి 60 శాతానికి తగ్గింది. 2014-15 నుంచి నాలుగేళ్ల కాలంలోనే ఇది తగ్గింది. అభివృద్ధితో సంబంధం లేని ఖర్చు 30 శాతం నుంచి 40 శాతానికి పెరగడం మరో వైపరీత్యం. అలాంటప్పుడు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం పెట్టిన ఖర్చును బీజేపీ, మోదీ ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్నట్టు సమర్థించుకోవడం ఎలా కుదురుతుంది? ఇలాంటి నిస్సారమైన ఆర్థిక తర్కంతో విపరీతంగా పెరుగుతున్న ఉద్యోగాల కొరత, ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయకుండా ఉండడాన్ని ఎలా సమర్థించుకోగలరు?

ఇలాంటి శుష్క వాదనలను విస్మరించడం కుదరదు. అణగారిన వర్గాల వారి పట్ల రాజ్యవ్యవస్థకు సహానుభూతి ఉందని నమ్మడం అంతకన్నా సాధ్యం కాదు. గిరిజన పరిశోధన, శిక్షణా సంస్థలకోసం నిధులైతే కేటాయిస్తున్నారు కానీ ఈ పథకంవల్ల నిర్వాసితులైన గిరిజనుల పునరావాసం దగ్గరకొచ్చే సరికి మాత్రం సామాజిక దన్ను కొరవడ్తోంది. సర్దార్ సరోవర్ పథకం అమలు చేసినప్పుడు పరిహారం ఎంత ఇచ్చినా నిర్వాసితులకు అందిన సామాజిక మద్దతు నామమాత్రమైందిగా కూడా లేదు అన్నది వాస్తవం. దీర్ఘ కాలికంగా ఇలాంటి చర్యలవల్ల ఫలితం ఏమీ ఉండదు. ఈ గిరిజనుల విషయంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పెట్టుబడి ఏమీ లేకపోవడం, ప్రభుత్వ పథకాలు వారికి అందుబాటులోకి రాకపోవడంతో ఆ వర్గాల వారు సామాజికంగా-ఆర్థికంగా నలిగిపోతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే విగ్రహం కోసం పెట్టిన భారీ ఖర్చు కొండంత అవుతుంది.

ప్రజలు తమ సామాజిక విలువను గుర్తించాలంటే సమైక్యత చాలా విలువైంది. కాని "సమైక్యత" అన్న మాటలో బీజేపీ నిర్ణాయకమైన అంశాన్ని ఏమైనా చేర్చగలదా? ఈ విగ్రహాన్ని "సమైక్యతా ప్రతిమ" అనడం రాజకీయ కుతంత్రం. పదాల గారడీ. ఇది ప్రభుత్వం రాజకీయ పునరేకీకరణ కోసం చేస్తున్న కుటిల యత్నాలలో భాగం. పటేల్ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం. ఆర్థిక వ్యవస్థలో అందరికీ భాగస్వామ్యం అన్న పేరుతో ఇటీవల అమలు చేసిన నల్ల ధనంపై దాడి, కార్పొరేట్ సంస్థల దివాలా వంటి దూకుడు ఆర్థిక విధానాలు సామాన్యులను లొంగ దీయడానికి అమలు చేస్తున్న విధానాలకే సంకేతం. ఇది ప్రభుత్వాన్ని ఆశ్రయించే కార్పొరేట్ సంస్థలను సంతృప్తి పరచడమే.

ఈ కాంస్య విగ్రహాన్ని చైనాలో తయారు చేయించినప్పుడు ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్న "మేక్ ఇన్ ఇండియా" గుర్తుకే రాలేదు. సర్దార్ సరోవర్ పథకం ఆయకట్టు ప్రాంతంలో ఉన్న రైతులు ఈ బ్రహ్మాండమైన రాజకీయ ప్రదర్శన కోసం కాలవ నెట్వర్కులో 20 శాతం అంటే 90.389 కి.మీ. మేర నీటిపారుదల సదుపాయాలను వదులుకోవల్సి వచ్చింది. 17.92 లక్షల ఎకరాల నీటిపారుదల సదుపాయాలలో 75 శాతం కోల్పోవలసి వచ్చింది. పటేల్ ఆదర్శాలను బాహాటంగా అగౌరవపరచి ఆయన వారసత్వాన్ని కబళించాలని చూడడం పక్షపాత బుద్ధితో కూడిన ప్రయోజనాల కోసమే. ఇది దేశ సౌభాగ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top