ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

హషింపుర నేర్పిన పాఠాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  హషింపురలో రాష్ట్ర సాయుధ పోలీసులు (పి ఏ సి) 1987లో 38 మంది ముస్లింలను దారుణంగా ఊచకోత కోశారు. ఇది మరచిపోలేని దారుణం.  ఈ హత్యలపై ఢిల్లీ హైకోర్టు 31 సంవత్సరాల తరువాత    వెలువరించిన తీర్పుపై సమాలోచన జరపాల్సిన అవసరం ఉంది. వింటేనే వెన్నులో వణుకు పుట్టించే ఆ ఉదంతాన్ని మరవలేం.  అందువల్ల భారత సమాజంపై, రాజ్య పాలన తీరుపై దాని ప్రభావం ఎలా వుంటుందో సంగ్రహించాల్సిన అవసరం ఉంది.  ఈ కేసులో తీర్పు చెప్పిన ఢిల్లీ హైకోర్టు 16 మంది రిటైరైన పి ఏ సి సిబ్బందికి యావజ్జీవ శిక్ష విధించింది (మరో ముగ్గురు విచారణ సమయంలో మరణించారు).  38 మంది ముస్లింల ఊచకోతలో వారి పాత్రను గురించి ప్రస్తావిస్తూ “చట్టాన్ని అమలు చేసే సంస్థల సిబ్బందిలో ఉండే పక్షపాత ధోరణిని అది వెల్లడి చేస్తోందని” ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కస్టడి మరణాలకు, సంస్థాగత హింసకు అలవాటుపడిన దేశానికి కూడా ఇది భీతిగొలిపే పాశవిక చర్య. ** ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు వీలు లేని రీతిలో ముస్లిం వ్యతిరేకులు  విషాన్ని చిమ్మారు. **

నిజానికి గడచిన మూడు దశాబ్దాలుగా రాజ్యం, ఉత్తరప్రదేశ్ పోలీసులు మరియు వరుసగా అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు విచారణను ఎదుర్కొన్నాయి.  విచారణ జరిగిన తీరును పరిశీలించినట్లయితే కస్టడీ హింస, మరణాల విషయంలో పోలిసుల దర్యాప్తు ఎలా వుంటుందో అర్థమవుతుంది.  మొదట దిగువ కోర్టులో పోలీసులను నిర్దోషులుగా ప్రకటించారు.  హైకోర్టులో శిక్షలు ఖరారయ్యాయి.  దేశంలో కస్టడీ మరణాల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. వాటిని చూసినప్పుడు మనల్ని సాధించే  ప్రశ్నకు అలాగే ఉంటుంది:  పోలీసులపై ఎవరు నిఘా వేయాలి?  

తీర్పు సందర్భంగా హైకోర్టు మరో వ్యాఖ్య కూడా చేసింది.  “మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై నేరారోపణ చేసి విచారణ జరపడంలో న్యాయవ్యవస్థ సమర్ధవంతంగా వ్యవహరించలేకపోయిందని” హైకోర్టు పేర్కొంది. ఒకవేళ హషింపుర నేర్పిన పాఠాలను మనసు మీదకు తెచ్చుకుని తగిన చర్యలు తీసుకోనట్లయితే ఇదే చివరి కేసు కాబోదని  అనుకోవడం బహుశా నిరాశావాదమే, కానీ అదే వాస్తవం.  న్యాయం కోసం సుదీర్ఘమైన పోరాటం చేసిన మానవ హక్కుల ఉద్యమకారులు, న్యాయవాదులు “పి ఏ సి లోని దిగువ స్థాయి ఉద్యోగులు స్వబుద్ధితో ఇంతటి దురాగతానికి పాల్పడి ఉండబోరని” అభిప్రాయపడ్డారు.  ఇదే అనాదిగా ఉన్న రుగ్మత. కస్టడీ హింసకు శిక్షలు పడినప్పటికినీ ఎవరి పనుపున ఆ ఊచకోత జరిగిందో వారికి శిక్షలు పడలేదు. 

రాజ్యాంగంలో తెలిపిన విధంగా పౌరుల మానవ హక్కులను పరిరక్షించగలవని మనం కొన్ని సంస్థలనుంచి ఆశిస్తాము. కానీ అవి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.  దురదృష్టవశాత్తూ అది గతం కాదు. ఆ సంస్థల పనితీరు నానాటికి క్షీణిస్తున్నది. ఎంపిక చేసుకున్న సామాజిక వర్గాలపై కావాలని క్రూరాతిక్రూరంగా పలు రకాల దాడులు, హింసకు పాల్పడుతున్నా అందుకు బాధ్యులైనవారు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. అందువల్ల హషింపుర నుంచి నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకొని, చర్చించడం ఇప్పుడు తక్షణ అవసరం.  

అయితే ఆనాటి మత కల్లోలాలను, మారణకాండకు ఎదురొడ్డి నిల్చి ఈనాటికి బతికిఉన్న బాధిత కుటుంబాల సభ్యులు, మృతుల మద్దతుదారుల నైతిక బలం, న్యాయ వ్యవస్థపై వారు ఉంచిన విశ్వాసం ప్రత్యేకంగా గుర్తించవలసిన అంశం.  పి ఏ సి సిబ్బంది ముస్లింలను తీసుకెళ్ళిన ప్రాంతాన్ని పూర్తిగా ప్రమాదకరమైనదిగా, జాతివ్యతిరేక ప్రాంతంగా పేర్కొన్నట్లు మీడియాలో వచ్చింది. లాయర్లు కూడా అదే విషయం చెప్పారు.  పి ఏ సి సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి జనాన్ని చుట్టుముట్టినప్పుడు ఎవరూ ప్రతిఘటించలేదు. ఎలాంటి ఆయుధాలు దొరకలేదు. దాంతో అది కేవలం వారిని చెడ్డవారిగా చిత్రించడానికే ఆడిన అబద్ధం అని తేలిపోయింది. అంతేకాదు బాధితులకు దిగువ కోర్టులో ఎదురుదెబ్బ తగలడం వల్ల వారి జీవనోపాధికి భంగం కలిగింది. వారి పిల్లల విద్యాభ్యాసం దెబ్బతింది. ఇక మనోద్వేగం, మనస్తత్వం ఎంత ప్రభావానికి లోనయ్యయో చెప్పనక్కరలేదు. అయినప్పటికీ వారు తమ కేసును పై కోర్టుకు తీసుకెళ్ళారు.  వారికి వెరవకుండా ముందుకు సాగే ధృఢసంకల్పం గల న్యాయవాదుల అండ దొరికింది. వారి కేసు వాదించిన న్యాయవాదుల్లో కొందరు మహిళలు కూడా ఉన్నారు.  అలా పట్టుదలతో వదలకుండా ముందుకు సాగడం వల్ల  ఊచకోతతో పి ఏ సి సిబ్బందికి సంబంధం ఉన్నట్లు తెలిపే సాక్ష్యాన్ని కనుగోనగలిగారు.  ఎంతో కష్టపడి న్యాయం జరుగుతుందనే  ఆశను సజీవంగా ఉంచి న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ముందుకు సాగిన కల్లోల బాధితులు, లాయర్లు, మీడియాలో ఒక వర్గం కృషిని పరిగణనలోకి తీసుకోవాలి. వారంతా  అభినందనీయులు.

ఈ కేసు కొట్టి పారేయదగిన పదభ్రంశం వంటిది కాదు.  కల్లోల బాధిత కుటుంబాల డిమాండ్లను తప్పనిసరిగా తీర్చాలి.  కేసు దర్యాప్తు చేసిన ఒక పొలిసు అధికారి “స్వతంత్ర భారత చరిత్రలో ఇంత దారుణమైన కస్టడీ హత్యలు లేవు” అని వర్ణించినట్లు ఆ దుర్ఘటన వల్ల బాధితులు  కోల్పోయిందేమిటో మీడియా ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ సజీవంగా ఉంచడంతో పాటు జాతి భవితపట్ల ఆందోళన చెందే పౌరుల మద్దతువల్ల అది సాధ్యమవుతుంది.  

ఇక హషింపుర ముస్లింలకు వారి చరిత్రలో ఇది మరపురాని అధ్యాయం. ఆ దుర్ఘటన వివరాలు వారి జ్ఞాపకాలలో కాల్చిన వాతలుగా చెరిగిపోకుండా ఉంటాయి. అయితే దానిని జన బాహుళ్యం జ్ఞాపకాలలో కాలపు గుర్తులుగా ముద్రవేయడం ముఖ్యం. చరిత్రను మరిచేవారు మళ్ళి మళ్ళి తప్పులు చెస్తూనే ఉంటారనే  నానుడిని పదేపదే విస్మరించడమే అసలు విషాదం.

Back to Top