ప్రాధాన్యత కోసం ఆర్.బి.ఐ. పాకులాట
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
రిజర్వూ బ్యాంకుకు, ప్రభుత్వానికి మధ్య ఇటీవల స్థూల ఆర్థిక విధానాలపై రేగిన కలహం పాముల బుట్టను తెరిచినట్టయింది. ఈ జగడం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే నష్టం కాదు, జాతీయ ఆర్థిక వ్యవస్థకే నష్టం. రిజర్వూ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య చేసిన బహిరంగ ప్రసంగాన్ని తరచి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థను ఆర్.బి.ఐ. సాంకేతిక నిపుణులు దీర్ఘ దృష్టితో చూడడం, ఆర్.బి.ఐ. స్వయంప్రతిపత్తి అంటే స్వాతంత్ర్యం గురించి మాట్లాడడం కూడా బలహీనమైన వాదనే. మొదటిది, స్వల్పకాలిక ద్రవ్యోల్బణం విషయంలో ఆర్.బి.ఐ. ఎంత ఆందోళన పడుతోందో అందరికీ తెలుసు. దీర్ఘకాలిక అభివృద్ధి అంశాలను అంతగా పట్టించుకోవడం లేదని కూడా తెలుసు. రెండవది, ఆర్.బి.ఐ. చెప్తున్న "స్వయం ప్రతిపత్తి/స్వాతంత్ర్యం రాజ్య వ్యవస్థ నుంచి స్వాతంత్ర్యం కోసం మాట్లాడడమేననీ తెలుసు. అది మార్కెట్ల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి స్వాతంత్ర్యం/స్వయం ప్రతిపత్తి కోరడం లేదు. ఆర్.బి.ఐ. డిప్యూటీ గవర్నర్ మాటల్లో చెప్పాలంటే "మార్కెట్ల ఆగ్రహం" గురించి మాట్లాడడం లేదు. నిజానికి ఇవే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. స్వాతంత్ర్యం అంటే సామాజిక అంశాలకు సంబంధించినంత మేరకు నిర్నిబంధమైన స్వ్యాతంత్ర్యం కాదు.
నిరంకుశ అధికార వర్గాల జోక్యం పెరగడంవల్ల ఆర్.బి.ఐ. అందరికీ భాగస్వామ్యం ఉండే వ్యవస్థను రూపొందించడంలో విఫలమైంది. ప్రాధాన్య రంగాలకు, బలహీన వర్గాలకు రుణాలు ఇవ్వాలి అన్న విషయంలో ఆర్.బి.ఐ. అనాసక్తంగానే వ్యవహరించింది. సామాజిక ఆడిట్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. నిజానికి 1990 నుంచి నయా శాస్త్రీయ విధానాలనే అనుసరించడంవల్ల సామాజిక/అభివృద్ధి కోసం ప్రభుత్వ వ్యయం కుంచించుకు పోయింది. దీని పర్యవసానంగా అసమానతలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో అసమానతలు పెరిగాయి. ఆర్.బి.ఐ. ప్రమేయం లేకుండానే ఆర్థిక సంఘటిత విధానాలు చట్టాల రూపం సంతరించుకున్నాయి. ద్రవ్య బాధ్యత, 2003నాటి బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్.ఆర్.బి.ఎం.ఎ.), ద్రవ్య విధాన చట్రం ఒప్పందం (ఎం.పి.ఎఫ్.ఎ.) లాంటివి ప్రభుత్వానికి, ఆర్.బి.ఐ.కి మధ్య కుదిరిన ఒప్పందాలుగా మిగిలిపోయాయి. ఇవి ఆర్.బి.ఐ. చట్టంలో సవరణగా స్థానం కూడా సంపాదించాయి. దీనివల్ల భారత్ ప్రపంచంలో తక్కువ పన్నులు విధించే, తక్కువగా వ్యయం చేసే దేశంగా మిగిలిపోయింది. దీనికి తోడు ఇతర పోల్చదగిన దేశాలతో కలిపి చూస్తే స్థూల జాతీయ ఉత్పత్తి(జి.డి.పి.) తో పోలిస్తే తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే దేశంగా తయారైంది. ఎన్.కె.సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2024-25 వరకు ప్రభుత్వ రుణాలు, జి.డి.పి. మధ్య నిష్పత్తి 40 శాతం తగ్గితే ఈ భావన మరింత బలపడుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం అనుసరించే "అతి తక్కువ ప్రభుత్వ పాత్రతో అతి ఎక్కువ పరిపాలన" అన్న సిద్ధాంతానికి ఇది అనుగుణమైందే.
కానీ ఇలాంటి కఠినమైన స్థూల ఆర్థిక విధానాల వాతావరణంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, బలవంతంగా వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) అమలు చేయడం వంటి "సాహసోపేత" నిర్ణయాలు భరోసా లేని ఆర్థిక పరిస్థితికి దారి తీశాయి. ఈ విధానాల ప్రభావం చిన్న తరహా పరిశ్రమలపైన, అవ్యవస్థీకృత రంగంపైన ప్రధానంగా కనిపించింది. నిజానికి ఈ రంగాలే ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ప్రతీఘాతుక స్థూల ఆర్థిక విధానాలవల్ల స్వదేశీ పొదుపు తగ్గింది. పెట్టుబడులూ కుంచించుకు పోయాయి. ద్రవ్య చెలామణి తగ్గడం, కరెంట్ ఖాతాలో లోటు పెరగడంతో పాటు ఉపాధి కల్పన అవకాశాలు విపరీతంగా తగ్గాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో త్వరలో జరగవలసి ఉన్న సార్వత్రిక ఎన్నికలు ప్రభుత్వ విశ్వాసాన్ని మరింత తగ్గించాయి. అంటే కేంద్ర ప్రభుత్వం తానున్న నిస్సహాయ స్థితి నుంచి బయటపడడానికి ఆర్.బి.ఐ.ని బుజ్జగించడానికి ప్రయత్నిస్తోందా?
ఆర్థిక వ్యవస్థ ఆచరణీయంగా కనిపించడం కోసం ఆర్.బి.ఐ. అపరాధ నిరోధక విధానాలు/నిబంధనలు ప్రవేశపెట్టింది. విద్యుత్ రంగానికి రుణాలు ఇవ్వడంలో షరతులు విధించడం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు రుణాలు ఇవ్వడంలో నిబంధనలను ప్రతిపాదించడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎం.ఎస్.ఎం.ఇ.లకు) రుణాలు ఇవ్వడంలో కఠిన నిబంధనలను అమలు చేయడం, నిరర్థక ఆస్తులు పెరిగిపోయిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడం లాంటి చర్యలను ఆర్.బి.ఐ. తీసుకుంది. బ్యాంకు బోర్డు పాత్ర, ద్రవ్య లోటును తీర్చడానికి బ్యాంకు దగ్గర ఎక్కువ నిలవ ఉండడం, ముప్పు ఉన్న ఆస్తులు ఉంటే 9 శాతం పెట్టుబడి పర్యాప్తత (ఇది బ్యాంకింక్గ్ పర్యవేక్షణపై బాసెల్ కమిటీ చెప్పిన 8 శాతం అన్న సిఫార్సులకు విరుద్ధం) విధానం అనుసరించడం బ్యాంకుల వనరుల నుంచి పెద్ద మొత్తాలు విడుదల చేయడం వంటి చర్యలు ఆర్.బి.ఐ. తీసుకుంది.
మంచి చెడ్డలను పరికించకుండా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆర్.బి.ఐ.ని బలవంతపెట్టడం, కేంద్ర బ్యాంకు అయిన ఆర్.బి.ఐ. స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం ఖారారు చేయక పోవడం వల్లే ప్రస్తుత వివాదం తలెత్తింది. అలాగని ఎం.ఎస్.ఎం.ఇ.ల వంటి వాటికి రుణాలు ఇవ్వకూడదని కాదు. అయితే ఎం.ఎస్.ఎం.ఇ.లకు 59 నిముషాలలోగా రుణాల మంజూరువంటి పద్ధతి సవ్యమైంది కాదు. గతంలోనూ ప్రభుత్వాల అపరిమితమైన జోక్యంవల్లే ఈ దుస్థితి తలెత్తింది. ఆర్.బి.ఐ. బోర్డు పాత్ర వంటి ఇతర చిన్న విషయాల దగ్గరకు వస్తే ఈ బోర్డు సలహాలు ఇవ్వడానికే పరిమితమైందని, ఇది కంపెనీల చట్టం కింద ఉండే బోర్డుల లాంటికి కాదని ప్రభుత్వం గమనించాలి. ఈ బోర్డు ద్రవ్య విధానాలను, బ్యాంకుల విధానాలను ప్రభావితం చేయకూడదు. సాంకేతిక అంశాలపై ఆధారపడిన విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ఆర్.బి.ఐ. దగ్గర ఉండవలసిన నిలవల అంశాన్ని కనీసం మూడు కమిటీలు పరిశీలించాయి. మొత్తం నిలవల్లో 12 శాతాన్ని ప్రభుత్వానికి బదిలీ చేయాలనే సూత్రాన్ని అంగీకరించారు. "వివిధ ముప్పులను, ఉండవలసిన కనీస నిధులను" దృష్టిలో ఉంచుకుని ఈ పద్ధతి అనుసరించారు. అందువల్ల ఆగంతుక నిధుల అవసరాన్ని గౌరవించాలి. దానితో పాటు ఆర్.బి.ఐ. ప్రజా సంక్షేమ దృష్టితో ప్రభుత్వ ఆలోచనలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి.